Sunday, September 6, 2026
E-PAPER
Homeదర్వాజనాన్నకు పూచిన మాధుర్యపు పుష్పం

నాన్నకు పూచిన మాధుర్యపు పుష్పం

- Advertisement -

మెట్టా నాగేశ్వరరావు “లేఖ్య” కవితా సంపుటిని చదివాక కవితలు, కవితో పాటు ఆ కవిత్వం వెనుక ఉన్న తండ్రి అంతరంగం, సామాజిక వాస్తవాలు బలంగా గుర్తుండిపోతాయి. తెలుగు సాహిత్యంలో వాత్సల్య కవిత్వం కొత్తది కాకపోయినా, “లేఖ్య” కేవలం పితృప్రేమను మాత్రమే ఆవిష్కరించకుండా ఆ వాత్సల్యాన్ని ఒక సామాజిక చరిత్ర కోణంలో పాఠకులకు పరిచయం చేస్తుంది. కుటుంబం ప్రేమకు ప్రతీక అయినప్పటికీ, అందులో కొడుకుకు, కూతురికి లభించే స్థానాల్లో వ్యత్యాసాలు ఉంటాయి. మన సమాజం కొడుకును వారసుడిగా, కూతురిని బాధ్యతగా చూసే వివక్షను సహజమైనదిగా మార్చివేసింది. ఈ సంపుటి ఆ సహజత్వాన్ని, “చరిత్ర అంతా కొడుకుల చరిత్రే” అన్న భావనను ప్రశ్నిస్తుంది.
నిజానికి చరిత్రలో ఆడబిడ్డ కనిపించకపోవడం యాదృచ్ఛికం కాదు. చరిత్ర ఎవరిని గుర్తుంచుకోవాలో, ఎవరిని మరచిపోవాలో కూడా సమాజమే నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయంలో ఆడబిడ్డకు పెద్దగా చోటు దక్కలేదు. అందుకే ఆమె స్వరం కూడా చాలా కాలం వినిపించలేదు. మెట్టా ఈ విషయాన్ని ఉపన్యాసంలా చెప్పడు. తన జీవితాన్ని మన ముందుంచుతాడు. తన కూతురితో గడిపిన చిన్న చిన్న క్షణాలను చూపిస్తాడు. ఆ క్షణాలను చదువుతుండగానే మనం సహజమని అనుకున్న విలువలే ఒక్కొక్కటిగా ప్రశ్నలుగా మారడం మొదలవుతుంది. అందుకే ఆయన తనదైన కవితా భాషలో ఇలా చెబుతారు.
“శూన్యానికి తలనిచ్చి/ ఖాళీతనానికి కండని నింపి/ నన్ను కుప్పపోసే బంగారు తల్లులు…” ఇక్కడ “బంగారు తల్లులు” అనేది మమకారంతో పిలిచిన మాట మాత్రమే కాదు. సమాజం లోటుగా చూసిన చోట జీవితాన్ని నింపే ఉనికికి కవి పెట్టిన పేరు. అందుకే ఈ పంక్తుల్లో కూతురు జాలి పడాల్సిన వ్యక్తిగా కనిపించదు. ఒక ఇంటికీ, ఒక జీవితానికీ అర్థాన్ని తీసుకొచ్చే ఉనికిగా కనిపిస్తుంది. ప్రేమ కూడా ఇక్కడ జాలిగా వ్యక్తం కాదు. జీవితాన్ని నిలబెట్టే శక్తిగా వ్యక్తమవుతుంది. అట్లాగే ఈ సంపుటిలో తండ్రి ప్రేమ వ్యక్తిగత అనుభూతిగా నిలిచిపోదు. ప్రతి కవితలోనూ అది మన సమాజం సహజంగా అంగీకరించిన కొన్ని విలువలతో సంభాషిస్తుంది. కొడుకే వంశాన్ని నిలబెడతాడనే భావనను కవి ఎక్కడా ఉపన్యాసంలా ఖండించడు. అలాంటి భావన ఎందుకు సహజంగా కనిపిస్తోందో జీవితంలోని చిన్న చిన్న సందర్భాల ద్వారానే చూపిస్తాడు. అందుకే “ఈ మగాడ్ని కన్నది ఏ మగాడు?” అనే ప్రశ్న చమత్కారం కాదు. మగవాడినే కేంద్రంగా ఊహించే ఆలోచనలోని వైరుధ్యాన్ని ఒక్క వాక్యంతో బయటపెడుతుంది. అలాగే మనం సహజమని ఒప్పుకున్న విలువలు కూడా ఒక్క ప్రశ్న ముందే తమ సహజత్వాన్ని కోల్పోతాయని ఈ పంక్తి గుర్తు చేస్తుంది. ఇక అదే దృష్టి మరో కవితలోనూ ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. అది

“తల్లీ! క్షమించు/ మన్నించు…/ ఇన్ని నొప్పుల్లో ఇదో నొప్పి/ పుట్టింది బిడ్డ అయితే/ ఆడపిల్ల అంటున్నారేంటి?/ థూ..!”. ఇక్కడ “థూ” ఒక అలంకారిక వ్యక్తీకరణ కాదు. ఆడపిల్ల పుట్టుక పట్ల సమాజం సహజంగా అంగీకరించిన వివక్ష మీద కవి విసిరిన నిరాకరణ. అందుకే ఈ కవిత మనల్ని కదిలించేది దుఃఖం వల్ల కాదు; మనం సహజమని అంగీకరించిన క్రూరత్వాన్ని కనిపించేలా చేయడం వల్ల. అయితే ఈ సంపుటి ఇలా నిరసన దగ్గర ఆగిపోదు. అదే కవిత్వం మరోచోట ప్రత్యామ్నాయ దృష్టిని కూడా ప్రతిపాదిస్తుంది.
“జీవితపు మూటలో/ కమ్మని వాసనవి…/ మా ఇంటి సెంటుసీసా ఈ లేఖ్య.” ఈ కవితలో వాసనను మనం చూడలేం. చేత్తో తాకలేం. కానీ అది ఉన్న చోటంతా తన ఉనికిని తెలుపుతుంది. కూతురిని కూడా కవి అలాంటి ఉనికిగానే చూస్తాడు. ఇంటిని అలంకరించే వస్తువుగా కాదు; ఇంటి జీవనంలో కలిసిపోయే శక్తిగా. అందుకే “సెంటుసీసా” అనే పోలిక అలంకారం కాదు; ఒక అనుభవానికి దొరికిన భాష.ఈ సున్నితత్వమే సంపుటి అంతా చిన్న చిన్న దృశ్యాల్లో కనిపిస్తుంది.
తండ్రీకూతుళ్ల అనుబంధం పెద్ద పెద్ద ప్రకటనలతో కాక మౌనంతో, అమాయకమైన బాల్యపు ఊహలతో ముడిపడి ఉంటుందని కవి నిరూపించారు. “జీవితపు మూటలో కమ్మని వాసనవి… మా ఇంటి సెంటుసీసా ఈ లేఖ్య” అని వర్ణిస్తూ, “చేపబొమ్మను కాగితం మీద వేసి నీళ్ళు పోసింది”, “మీసాల బొమ్మ గీసుకుంది” వంటి దృశ్యాల ద్వారా ఆత్మీయ ప్రపంచాన్ని ఆవిష్కరించారు. అదే సమయంలో “మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా? ఐతే ఇక హాయిగా నిద్రపొండి!” అంటూ ఆడపిల్ల భద్రతపై సమాజాన్ని నిలదీశారు. తన ఆనందాన్ని మేరి, రాముని కళ్లలోని కాంతితో పోలుస్తూనే, “ఆ పుటను చేజారనివ్వొద్దు తల్లీ” అని ప్రేమకు బాధ్యతను జోడించారు. మొత్తానికి “లేఖ్య” అనేది కేవలం ఒక తండ్రి ప్రేమకవితల సంపుటి మాత్రమే కాదు; సమాజం సహజమని నమ్ముతున్న విలువలను పునఃపరిశీలించమని కోరే ఒక శక్తివంతమైన సామాజిక స్పందన.

సందీప్ వోటారికారి
9390280098

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -