కాళోజీ పేరు చెబితే నిలువెత్తు స్వేచ్ఛ కళ్ళముందు నిలబడుతుంది. మోసాల మూలాల్ని కనిపెట్టే స్వేచ్ఛ, అన్యాయాన్ని నిటారుగా నిలబెట్టి కడిగేసే స్వేచ్ఛ! ఆయనకెంత స్వేచ్ఛ ఉందంటే నిజాంను నిర్భయంగా తిట్టిపోసేంతగ, ప్రధానమంత్రి మీద ఎదురుబడి చురకలేసేటంతగా. ఆయన వ్యక్తుల్ని విమర్శించేవాడు. వ్యవస్థల్ని విమర్శించేవాడు, రాజ్యాన్ని నిందించేవాడు అయితే విచిత్రంగా ఏ మాలనుండీ ఆయన విమర్శకు జవాబు సరిగ్గా వచ్చేది కాదు. దానికి కారణం ఆయనలోని నిజాయితి. ఆ నిజాయితే ఆయనను గాంధేయవాదిని చేసింది. పోరాట వాదిని చేసింది. హక్కుల ఉద్యమం వెంటనడిపించింది. అదే నిజాయితీ ఆయనను ప్రజాకవిని చేసింది. ఆయన కవిత్వం ఎల్లెడలా ఆవేశమే ఉంటుంది. అది నిజాయితీతో కూడిన ఆవేశం. అది ప్రణాళికాబద్ధంగా ఉండదు మరి! ప్రణాళికాబద్ధంగా ఉండకూడదనే అంటాడు తను. జనగాం తాలూకా బైరాన్పల్లి గ్రామంలో రజాకార్లు చేసిన హత్యాకాండకు చలించి, ఆయన ప్రతీకారం ప్రబోధిస్తాడు. గాంధేయవాది ప్రతిహింసను కోరుకుంటడా అనే వివేచన అప్పటికి ఆయన మదిలోకి రాదు.
‘‘మనకొంపలార్చిన మన స్త్రీల చెరచిన/ మనపిల్లలను చంపి మనల బంధించిన/ మానవాధములను మండలాధీశులను/ మరిచిపోకుండగ గురుతుంచుకోవాలె/ కసి ఆరిపోకుండ బుస కొట్టుచుండాలె/ కాలంబు రాగానె కాటేసి తీరాలె’’ అంటాడు. ఇక్కడ చాలా conscious గా అంటాడు.
పి.వి. నరసింహారావు, వరవరరావు లాంటి భిన్నధృవాలకు ఆత్మీయుడై వెళ్ళిపోయిన కాళోజీ కవిత్వం మీద ఆచార్య పేర్వారం జగన్నాధం రాసిన వ్యాసం కాళోజీ కవితా దృక్పథాన్ని పట్టి ఇస్తుంది. కాళోజీ మన భవిష్యత్తు అన్న వ్యాసంలో సజ్జ భిక్షం ‘Kaloji will be a major influence on my future thinking too’ అన్నమాట తెలుగు ప్రజలకు, ప్రజాపక్షవాదులందరికీ వర్తిస్తుంది. కోదాటి నారాయణ రావు వ్యాసం వాళ్ళమధ్య ఉన్న వయ్యక్తిక సంబంధాన్ని చెప్పినట్లుగా ఉండి తెలంగాణ చరిత్రలో ఇటీవలి రోజులను జ్ఞప్తికి తెస్తుంది. తెలంగాణ ప్రజాహృదయాలలో ఆయన కవిత్వం పునశ్చరణగా మిగిలిపోయింది.
‘‘గడియ గడియకూ మారు ప్రపంచం/ గవ్వ గవ్వకూ కొరగాని ప్రపంచం/ ఆశపెట్టి ఆడించు ప్రపంచం/ మోసపుచ్చి మురిపించు ప్రపంచం’’
విడిచిపోయిండు కాళోజీ. అవును! ఆయనకు వాదం లేదు. వివాదం ఉంది. ఆ వ్యవస్థతో కాళోజీకి నిరంతర వివాదం కడదాకా కొనసాగింది. ఆ వివాదాన్ని కొనసాగించే క్రమంలో వెలువడ్డ మాటలే ఆయన గొడవ. ‘నా గొడవ’కు కూడా ఎలాంటి ప్రణాళికా లేదు. ఆయన సాహిత్యానికి ఏ పథకం లేదు. నిర్దిష్ట ప్రక్రియాలేదు. ప్రధానంగా వచన కవివిత్వమైనప్పటికీ లయాత్మకంగా వచ్చిన మాత్రానియమాలు యాదృచ్ఛికంగా వచ్చాయి. ఆయన సాహిత్యం అంత స్వేచ్ఛాపూరితంగా ఉండడం కాకతాళీయమేం కాదు. దానికి నిర్దిష్టమైన భౌతిక కారణాలు, భావహేతువులున్నాయి.
ఆయన తోచిన సందర్భాలలో చెబుతూ ఉంటే దగ్గరున్న వాళ్ళు రాసుకున్న కవిత్వం చాలా ఉంది. వరవరరావు చెప్పినట్లు నిద్రలో తప్ప మాటల నదివలె ప్రవహించే కవి కాళోజీ. మొదలే అనుకున్నట్లు ఆయన ఒక సిద్ధాంతానికి కట్టుబడలేదు.
ఏ వ్యక్తినైనా సరిగ్గా అర్థం చేసుకోవాలంటే స్వయంగా తన గురించి తాను చెప్పుకున్న మాటల్నే మొదట ఆధారంగా పెట్టుకోవాలి. కాళోజీ అనేక సందర్భాలలో తన అభిప్రాయాలను విపులీకరించాడు. ఆయన ఎంత స్వేచ్ఛా ప్రియుడంటే వరంగల్లులో నడుస్తూ నడుస్తూ వెళ్ళిపోయి బస్సెక్కి ఏదో ఊరుకు చేరుకునే వాడట. ఇంత సమాచార వ్యవస్థలేని రోజుల్లో ఆయన ఎక్కడ ఉన్న సంగతి తెలియక బెంబేలెత్తిన రోజులున్నాయట. ఏదో ఊరిలో జరిగిన సాహిత్య సభలో కాళోజీ ప్రసంగించారని ఆకాశవాణి వార్తల్లో విని ఊపిరి పీల్చుకునే వారట. ఎవరి ఇంట్లోనైనా దిగిపోయి తన ఇల్లేనన్నంత స్వతంత్రంగా జీవించగల సజీవత్వం ఆయనకే చెల్లింది. అందుకే ‘ఇచ్ఛయే నా ఈశ్వరుడని ఖచ్చితముగ నమ్ముతాను. ఇచ్చవచ్చినట్లు నేను ఆచరించి తీరుతాను. జరిగిన దానిని తలవను, జరిగే దానికి వగవను, జరగనున్నదిదియని ఊహాగానము చేయను’ అని స్వయంగా చెప్పుకున్నాడు. అందువల్ల ఆయన ప్రతి విషయాన్ని స్వంత కళ్ళతో చూసాడు.
‘జరిగినదంతా చూస్తూ ఎరగనట్లు పడి ఉండగ సాక్షీభూతున్ని కాను. సాక్షాత్తు మానవుణ్ణి. అగో ఆ మానవున్నీ కాబట్టే చుట్టుపక్కల జరిగే ప్రతి విషయానికి స్పందించడం, ఆలోచన-అసమ్మతి, నిరసన, ధిక్కారం, ప్రతిఘటన, ప్రతిఘటనా కార్యక్రమం. నేననుకున్న అవకతవకలను సవరించే ప్రయత్నం. నా వలెనే అవకతవకలను సవరించే వారితో సహకరించే ప్రయత్నం. ‘ఎవరిలోనూ సంపూర్ణంగా ఏకీభవించక పోవడం- మరెవరూ నాతో ఏకీభవించకపోవడం’ అంటాడు నా గొడవ ముందుమాటలో. బతుకు వైరుధ్యాల పుట్ట అంటాడాయన. ఆయన దృష్టిలోనూ ‘హింస తప్పు. రాజ్యహింస మరీ తప్పు. ప్రతిహింస తప్పుకాదు. ఏకీభవించనోని పీకనొక్కుడు సిద్ధాంతం అంటే మరేమిటో కాదు అచ్చమైన ఫాసిజం’ అంటాడు. ఆర్య సమాజంతో కలిసి నడిచాడు, నిజాం వ్యతిరేక పోరాటంలో నడిచాడు, 1956 విశాలాంధ్రోద్యమాన్ని సమర్ధించాడు, 1969 జైతెలంగాణలో కదిలాడు, మలిదశ ఉద్యమంలో గొంతు కలిపాడు. నక్సలైట్లను సమర్ధించాడు. వారిచ్చిన ప్రతిపిలుపునూ సమర్థించ లేదు, మొత్తంగా కాలానుగుణమైన ప్రజాపక్షవాది. ‘పరిస్థితులెట్లా ఉన్నాయని కాదు, ఉన్న పరిస్థితులో మనమెట్లా ఉన్నామన్నదే’ ప్రధానమంటాడు.
కాళోజీ వ్యక్తిత్వంలోని నిర్భీతి, స్వేచ్ఛాప్రియత్వం, ప్రజాస్వామి కతత్వం ఆయనను నిటారుగా నిలబెట్టాయి. అదే ఆయన సాహిత్యంలో, రాజకీయంలో, ప్రజాపోరాటంలో ప్రతిఫలించింది. తనను ఒక ‘తెలంగాణ సంకేతం’ చేసింది. సాహిత్యానికి, వ్యక్తిత్వానికి, తెలంగాణ జీవన మౌలికతకు కాళోజీ ఒక నిలువుటద్దం. కాళోజీ తెలంగాణతనానికి తగిన కారణాలున్నాయి. తెలంగాణలోని బహుభాషా సమ్మేళనానికి కాళోజీ కుటుంబం ఒక నమూనా. తల్లి రమాబాయిది కన్నడం, తండ్రి రంగారావుది మరాఠీ. తల్లికి మరాఠీ వచ్చు, తండ్రి కన్నడ మాట్లాడగలరు. తెలంగాణలో ఉండే చాలా మందిలాగే తండ్రికి హిందీ, ఉర్దూ వచ్చు. కాళోజీకి మిగిలిన సమాజమంతా తెలుగు మాట్లాడేది. కాళోజీ ఇంట్లో సాంప్రదాయ వాదులైన కవి పండితులతో పాటు, ముస్లింలు, ఇతర మతస్తులు వస్తూపోతూ ఉండేవారు. 1914 సెప్టెంబర్, 9న బీజాపూర్ జిల్లాలోని రట్టహళ్ళిలో జన్మించి 13 నవంబర్ 2002 నాడు హైద్రాబాద్‌లో మరణించిన కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది.
‘బడిపలుకులకు స్వస్తిపలికి, పలుకుబడులకు పట్టం గట్టిన’ కాళోజీ కవిత్వ సొబగులను వెలికితీసారు బుక్కాబాలస్వామి గారు.
‘‘తెలంగాణ వేరైతే / దేశానికి ఆపత్తా?/ తెలంగాణ వేరైతే / తెలుగుభాష మరస్తారా?/ వానపడక ఉంటుందా? / చెలిమెలెండిపోతాయా?
ప్రాజెక్టులు కట్టుకున్నా / నీరు ఆగనంటుందా?’’ అనే కవితను ఉటంకిస్తూ ప్రజల పలుకుబడులలో ప్రజల వెతలను కవిత్వీకరించిన విధానాన్ని వివరించారు. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం, గ్రంథాలయోద్యమం, స్టేట్ కాంగ్రెసు సత్యాగ్రహం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, పౌరహక్కుల పోరాటం, ఆధీకృత హింసపై పోరాటం చేసిన కాళోజీ ప్రజల పక్షాన చేసిన అక్షర యుద్ధాన్ని ఉదాహరణంగా వివరించారు సిద్ధగౌని సుదర్శన్. ఆయన ఇచ్చిన ఉదాహరణ:
‘‘అన్యాయన్నెదిరిస్తే / నా గొడవకు సంతృప్తి/ అన్యాయం అంతరిస్తే / నా గొడవకు ముక్తిప్రాప్తి/ అన్యాయాన్నెదిరించినోడు/ నాకు ఆరాధ్యుడు…’’ అని అంటాడు.
వరంగల్ మిత్రమండలిలో కాళోజీ జ్ఞాపకాలతో పాటు ఉద్ధండులైన వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సాహిత్యకారుల గురించి పొట్లపల్లి శ్రీనివాసరావు, కాళోజీ ఉద్యమ జీవితం గురించి తనదైన శైలిలో వరవరరావు రాసిన వ్యాసంలో విలువైన చేర్పులున్నాయి.
ఆచార్య కాత్యాయనీ విద్మహే కవిత్వ సమీక్ష, గంటా రామారెడ్డి వ్యాసం సవివరంగా నడిచి కాళోజీ తాత్విక దృక్పథం, కవిత్వ శిల్పం మీద విపులమైన అవగాహణ కలిగిస్తాయి. డా. పి.శ్రీనివాసులుగారిది కొత్త దృష్టితో రాసిన వ్యాసం. కాళోజీ కవిత్వంలోని అధిక్షేప ధోరణిని లోతుగా విశ్లేషించారు అమ్మంగి. అన్యాయాన్ని సహించని వ్యక్తిత్వంతో 1943లో రాసిన కవిత ‘కోకిలా!’ నిజాం పక్షం వహించిన రాయప్రోలు మీద వేసిన సెటైర్‌గా చెప్పాడు.
బహుముఖీనమైన వ్యక్తిత్వమున్న కాళోజీ జీవితాన్ని ఒక్క గ్రంథంలో సమగ్రం చేయాలనుకోవడం అత్యాశే అవుతుంది. విభజించిచూస్తే అనేక సంకలనాలుగా మారగలిగే అవకాశమున్న సాహిత్యం కాళోజీది. అనువాదాలు, కథలు, విమర్శల సంగతి పక్కన పెడితే ఆయన జీవిత కాలంలో రాసిన కవిత్వమంతా ఒక ‘నాగొడవ’ సంకలనంగానే వచ్చింది. సృజించిన ఇతర ప్రక్రియలెన్ని ఉన్నా కవిత్వం ద్వారానే కాళోజీ గుర్తించబడతాడు. స్పష్టతకు, సూటిదనానికి ఆయన కవిత్వం పెట్టింది పేరు. ధైర్యానికి, నిజాయితీకి ఆయనొక నిలువుటద్దం.
‘‘గూండాలకు నేను ద్రోహినే/ దొంగనాకొడుకుల పరిభాషలో/ అన్యాయాన్నెదించడం ద్రోహమైతే/ ఆ ద్రోహమే నా జన్మహక్కు’’ అని నినదించిన కలం ఆయనది. ఆయన తెలంగాణ మట్టిని, మనుష్యులను అమితంగా ప్రేమించాడు, అందుకే
‘‘ఏ భాషరా నీది/ ఏమి వేషమురా/ ఈ భాషలీవేష/ మెవనికోసమురా/ అన్యభాషలు నేర్చి/ ఆంధ్రంబురాదంచు/ సకిలించు ఆంధ్రుడా/ చావవెందుకురా’’ అని నిలదీస్తాడు.
‘‘అతిథి వోలె వుండి వుండి/ అవని విడిచి వెళ్ళుతాను/ పల్లె పట్టణంబు లనక/ పల్లేరై తిరిగినాను/ మురికి పేట నడుమనున్న/ ఇరుకులలో తిరిగినాను/ కూటి పేద తన కబలము/ నోటికీయ గుడిచినాను/ పూల వాసనలు నిండిన/ పాలరాతి మేడలలో/ ఆయాసము కలిగించెడు/ పాయసాలు మెక్కినాను’’ అనే ‘స్వగతం’ కాళోజీ జీవన విధానాన్ని మనకు స్పష్టం చేస్తుంది. ఇంతకీ కాలోజీ ఎవరు? హెూచిమన్ ఆవేశించిన గాంధేయ వాది అంటాడు వరవరరావు. ‘మితవాదుల్లో అతివాది, అతివాదుల్లో మితవాది’ అంటాడు సామల సదాశివ. ‘Where the mind is with out fear, where head is held high, where knowledge is free’ అన్న ఠాగూరు మాటల స్ఫూర్తి కాళోజీ ప్రతి అడుగుకూ కారణమై ఉంటుంది. కాళోజీ కేవలం కవి, రచయిత మాత్రమేనా? హక్కుల యోధుడు, స్వేచ్ఛా ప్రియుడు, నిరంతర పర్యాటకుడు మాత్రమేనా? అంటే ఆ ప్రశ్నలకు అంత త్వరగా ముగింపు ఉండదు. ఆయన ఎంతటి స్వేచ్ఛావాది అంటే ఆయన 1956లో విశాలాంధ్రను మనస్ఫూర్తిగా ఆహ్వానించిండు. మలివిడత ఉద్యమాన్ని మహా ఆవేశంతో సమర్థించిండు. అదే ఆయన స్వేచ్ఛాప్రియత్వం.
ఒక వైతాళికున్ని చిన్న బొమ్మగా గీసి చిత్రకారుడు పులకించిపోతాడు, పాట చేసి గాయకుడు పరవశిస్తాడు, రూపం సృజించి శిల్పి చిరకీర్తిని ఆపాదిస్తాడు. బి. నరసింగ రావు అలాగే చేశాడు. ప్రజాకవి కాళోజీని చిన్నపిల్లలకు, విద్యార్థులకు మరిచిపోలేని విధంగా పరిచయం చేయాలనుకున్నాడు. వాళ్ళ లేత హృదయాలలో చెదిరిపోని కాళోజీ ముద్రను వేయాలనుకున్నాడు. అలా వచ్చిన చిరుసంకలనమే కాళోజీకెంపులు.
ఇంతకీ ఈ కెంపులకు ఇప్పుడెందకింత రిలవెన్స్? కేవలం ఆయన శతజయంతి వల్లేనా? తెలంగాణ ఉద్యమం వల్లేనా? దానికి బి.నరసింగరావు జవాబు వేరు. ‘బుద్ధుడు, జీసెస్, గాంధీ, మార్టిన్ లూధర్ కింగ్ లాంటి యుగపురుషుల కోవలోకి చెందిన వాడు కాళోజీ. మనుషులు ఎంత నిరాడంబరంగా, నిస్వార్థంగా బతకవచ్చో మనకు అర్థమయ్యేలా చేస్తాడు. భావ పరంగా కాళోజీ మనను అంటిపెట్టుకొని ఉంటాడు’. ఆయన భావాలు నిక్షిప్తమైన మేటి కవితా ఖండికలను ఏరి కాళోజీ కెంపులుగా ప్రచురించాడు.
కాళోజీ తన తోటి వారిని ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడట. ఆయనతో ఎన్నిగంటలు గడిపినా బోర్ ఉండేది కాదని, అందుకు కారణం ఆయన ఓపన్నెస్ అని అంటుంటారు. అలాంటి ఓపెన్నెస్, చమత్కారం కాళోజీ కవిత్వం నిండా గమనించవచ్చు.
ఈ కందపు వ్యంగ్యం చూడండి… ‘‘కలదందురు లోకసభను/కలదందురు ప్రభుతలోన పంచాయతిలో/ కలదందురు రాజ్యాంగమున/ కలదుప్రజాస్వామ్య మనెడు వింత, కలదో? లేదో’’.
అయితే కాళోజీ కవిత్వ శిల్పం పట్ల ఏనాడూ శ్రద్ధ పెట్టలేదని విమర్శ కూడా ఉంది. ఆ ప్రశ్న ఆయన ముందుకు వస్తే కూడా చాలా సులభంగానే ‘ఇది నాగొడవ’ అనేవాడు. ‘కవిత్వం అవునో కాదో నాకు తెలియదు’ అని కూడా అనే వాడట. అయితే విచిత్రంగా కాళోజీ పలికిన ప్రతి కవిత ‘కోటబుల్ కొటేషన్’లాగ నిలిచిపోతుంది.
ఏనుగు నరసింహారెడ్డి, 8978869183
స్వేచ్ఛకు, తెలంగాణ తత్వానికి ప్రతీక కాళోజీ
- Advertisement -
- Advertisement -


