Sunday, June 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలునిరుద్యోగ జేఏసీ పోరాటానికి మద్దతిస్తాం

నిరుద్యోగ జేఏసీ పోరాటానికి మద్దతిస్తాం

- Advertisement -

– అసెంబ్లీ బయటా..లోపలా హామీలపై నిలదీస్తున్నాం : మాజీ మంత్రి టి.హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ జులై 4న తలపెట్టిన హలో నిరుద్యోగి…చలో సెక్రెటేరియట్‌ కార్యక్రమానికి మద్దతిస్తున్నట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిరుద్యోగ జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హలో నిరుద్యోగి.. చలో సెక్రెటేరియట్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. విద్యార్థులకు, నిరుద్యోగులకు రేవంత్‌రెడ్డి సర్కారు ఇచ్చిన హామీలపై అసెంబ్లీ బయటా, లోపలా బీఆర్‌ఎస్‌ పోరాడుతున్నదని చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించి 95 శాతం ఉద్యోగులు తెలంగాణ వాసులకే దక్కేలా చేసింది కేసీఆరే అని గుర్తుచేశారు. ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్లోబెల్‌ ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. జాబ్‌క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టకుండా సభ వాయిదా వేసుకొని పారిపోయారని ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీ దగా డీఎస్సీ అయిందని విమర్శించారు. మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్తీ అని పెద్ద ఎత్తున యాడ్‌లు ఇచ్చుకున్నారుగా..భర్తీ ఏమైందని నిలదీశారు. ప్రియాంకగాంధీ ప్రవేశపెట్టిన యూత్‌ డిక్లరేషన్‌ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రయివేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ బీసీలకు మేలు చేసేలా రిజర్వేషన్‌ తెస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులను కోదండరామ్‌, బల్మూరి వెంకట్‌, ఆకునూరి మురళి, రియాజ్‌ రెచ్చగొట్టారనీ, ఇప్పుడు నిరుద్యోగులు తమకు న్యాయం చేయాలని అడుగుతుంటే మొహం చాటేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తే నిరుద్యోగుల మీద దాడులు చేయడం దారుణమన్నారు. నిరుద్యోగుల పోరాటానికి బీఆర్‌ఎస్‌ మద్దతు ఉంటుందని నొక్కి చెప్పారు. తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలనీ, రెండు లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని, నాలుగు వేల భృతి ఇవ్వాలని, అమ్మాయిలకు స్కూటీలు అందజేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -