– హాజరు కానున్న జాతీయ కోశాధికారి ఎం. సాయిబాబు : యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలను విజయవంతం చేసేందుకుగాను జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో ఈ నెల 19వ తేదీన ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు తెలిపారు. మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవన్‌లో గురువారం జరిగిన సీఐటీయూ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకుగాను ఈ నెల 19న ఉదయం 10.30 గంటలకు మెదక్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్న సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు మెదక్ జిల్లాలో మొదటిసారిగా నిర్వహిస్తున్నామన్నారు. ఆహ్వాన సంఘం సమావేశానికి సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం. సాయిబాబు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, నవతెలంగాణ దినపత్రిక మాజీ సంపాదకులు ఆర్ సుధాభాస్కర్ హాజరు కానున్నారని తెలిపారు. జిల్లాలో 40 ఏండ్లుగా కార్మికులు, స్కీమ్ వర్కర్ల సమస్యలు, హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించిన సంఘం సీఐటీయూ అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని గంటలు పెంచి కార్మికులపై భారాలు వేసి, పెట్టుబడిదారులకు మేలు చేస్తున్నారని విమర్శించారు. 9న దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో 25 కోట్ల మంది పాల్గొన్నారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కండ్లు తెరవాలన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ కార్మికుల వేతనాలు రెగ్యులర్‌గా చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం సమావేశానికి కార్మికులు, మేధావులు, శ్రేయోభిలాషులు, ప్రజలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి. బాలమణి, కార్యదర్శి ఎ. మల్లేశం, కోశాధికారి కె. నర్సమ్మ, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, నాగరాజు, సహాయ కార్యదర్శి గౌరయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె. మల్లేశ్, నాయకులు అజరు తదితరులు పాల్గొన్నారు.
19న సీఐటీయూ మహాసభల ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES