ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర ఎంత ఉందనే దాని మీద ఆ దేశ ప్రగతి ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కార్మిక రంగంలో కూడా మహిళల భాగస్వామ్యం పురుషులతో సమానంగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక వృద్ధి రేటు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. ఇంతకీ, భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర ఎలా ఉందో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం.
మనదేశంలో శ్రామిక మహిళల సంఖ్య ఇటీవల కాలంలో ఎంతో పెరుగుతోంది. కానీ మొత్తం శ్రామిక మహిళల శక్తి పాల్గొనే రేటు సుమారుగా 25 శాతం నుండి 30 శాతం మధ్యే ఉంటుంది. ఇది ప్రపంచ సగటుతో పోల్చితే తక్కువే. వ్యవసాయ రంగంలో 55-60 శాతం, ఉద్యోగ, సేవా రంగాలలో సుమారు 20 శాతం, తయారీ పరిశ్రమ లలో 10 శాతం వరకు పనిచేస్తున్నారు. అదే పనికి పురుషులతో పోలిస్తే తక్కువ వేతనాలు ఇస్తున్నారు. వీటికి తోడు పని ప్రదేశంలో లైంగిక వేధింపులు, రక్షణలేని పని ప్రదేశాలు, అత్యధిక పని గంటలు, విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలతో శ్రామిక మహిళలు అల్లాడుతున్నారు. దీనివలన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొం టున్నారు. అంతేకా కుండా నైపుణ్య శిక్షణ లేకపో వడం, అవిద్య వంటి సమస్యలు అదనం. ఇంటిచాకిరి కూడా మహిళల మీదే ఎక్కువ. వెరసి ఇవన్నీ వారి పని సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి.
నిలువు దోపిడీ
శ్రామిక మహిళలకు ప్రత్యేకంగా ఉన్న చట్టాలే తక్కువ. ఉన్న ప్రసూతి చట్టం, సమాన పనికి సమాన వేతన చట్టం, లైంగిక వేధింపుల నిరోధక చట్టం వంటివి ప్రభుత్వ సంస్థలతో సహా అనేకచోట్ల అమలుకావడం లేదు. దీనికి తోడు రాత్రి వేళల్లో కూడా పనిచేసేలా చట్ట సవరణలు కూడా ప్రభుత్వం చేసింది. వ్యవసాయం, స్వయం ఉపాధి రంగాలలో పనిచేస్తున్న మహిళలకు అసలు ఏ చట్టాలూ వర్తించడం లేదు. ఇక మన దేశంలో సామాజిక వివక్షత, లింగ అసమానతలు ఎలాగూ ఉన్నాయి. గౌరవ వేతనం పేరున కోటి మందికి పైగా ఉన్న స్కీం వర్కర్ల నిలువు దోపిడీ కొనసాగుతూనే ఉంది.
సమానత్వం కల్పిస్తే
దేశ సంపద సృష్టిలో ప్రత్యక్ష పాత్ర నిర్వహిస్తున్న శ్రామిక మహిళల పట్ల వివక్షత దేశానికే అనర్ధం. వీరి సమస్యల పరిష్కారం, సమానత్వం సాధించకుండా సాధికారత పేరున ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా నిరుపయోగమే. ప్రభుత్వం నుండి సరైన ప్రోత్సాహంతో పని ప్రదేశాల్లో సురక్షిత వాతావరణం, సమాన వేతనాలు, ప్రత్యేక సెలవులు, చట్టాల వర్తింపు, వాటి పటిష్ట అమలు, సామాజిక అవగాహన వంటివి కల్పించాలి. ప్రపంచంలోని ముఖ్యమైన 145 దేశాల ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్రకు సంబంధించిన జాబితాను గమనిస్తే.. భారత దేశం 139వ స్థానంలో ఉంది. ఒకవేళ కార్మిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పురుషులతో సరిసమానంగా ఉంటే భారత దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 27 శాతానికి చేరుకుంటుంది. ఇది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అధికారిక గణాంకాలు చెబుతున్న మాట.
వినడానికి బాగానే ఉన్నా…
మెక్ కెంజీ గ్లోబల్ సంస్థ విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం మహిళలు.. పురుషులతో సమానంగా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములైతే 2025 కల్లా భారత దేశ జీడీపీ 77,000 కోట్ల డాలర్లు దాటుతుందని అంచనా. ఇదంతా వినడానికి బాగానే ఉంది.. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందన్నది ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం దేశంలో సంఘటిత రంగంలో 53.26 శాతం పురుషులుంటే 25.5 శాతం మహిళలున్నారు. గ్రామాలతో పోల్చి చూస్తే పట్టణాలలో ఈ సంఖ్య కొద్దిగా మెరుగ్గా కనిపిస్తోంది. ఇక మొత్తం శ్రామిక మహిళల్లో దాదాపు 63 శాతం మంది వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. దేశం మొత్తంలో సంఘటిత క్షేత్రంలో మహిళలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, అట్టడుగు స్థానంలో ఉన్నది ఢిల్లీ.
పరిష్కారమార్గం వెతకాలి
2011 లెక్కల ప్రకారం దేశంలో చదువు పూర్తి చేసి కెరీర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే సమయంలోనే చాలా మంది అమ్మాయిల వివాహాలు అయిపోతున్నాయి. అంతేకాదు, ప్రపంచ బ్యాంకు చెబుతున్న లెక్కల ప్రకారం, భారతదేశంలో ఏదో ఒక సమయంలో ఉద్యోగాలను వదిలేసే మహిళల శాతం చాలా ఎక్కువగా ఉంది. ఒక్కసారి వదిలేశాక చాలామంది మహిళలు తిరిగి ఉద్యోగాలలో చేరట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తున్న మహిళలు వేతనాల విషయంలో లింగ వివక్ష, లైంగిక వేధింపులు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమాజం, ప్రభుత్వం, ప్రైవేటు రంగ సంస్థలు కలిసి ఈ సమస్యలకు పరిష్కారమార్గం వెతకాల్సిన అవసరం ఉంది. అప్పుడే మహిళలు ప్రగతిని సాధించగలరు, దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తుంది.
పాలపర్తి సంధ్యారాణి
ప్రభుత్వం ఆదుకోవాలి
ఇరవైఐదేండ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాను. నా భర్త రిక్షా నడిపేవాడు. అనారోగ్యం వల్ల అది మానేసి పండ్లు అమ్మేవాడు. నాలుగేండ్ల కిందటే చనిపోయాడు. నాకు ఇద్దరు బిడ్డలు. ఒక కొడుకు. బిడ్డలకు పెళ్లిళ్లు చేశాను. నాకు వచ్చే జీతం సరిపోవటం లేదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్మనెంట్ చేస్తాం అంటుంది గాని చేయట్లేదు. మా ఆయనకి పెన్షన్ వచ్చేది. ఇప్పుడు అది కూడా రావడం లేదు. ఇల్లు కిరాయికి ఉంటున్నాం. కట్టలేకపోతే సామాన్లు బయట పడేస్తున్నారు. అప్పులు చేసి ఇల్లు గడపాల్సి వస్తోంది. ఇదివరకు మేము రాత్రిపూట కూడా డ్యూటీ చేసే వాళ్ళం. ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాం. రోడ్లు చాలా గలీజ్ చేస్తున్నారు. ఆ గలీజు అంతా అసహ్యం అనేది లేకుండా ఎత్తివేస్తున్నాం. మాకు కుటుంబాలు ఉన్నాయి. మాకూ అనారోగ్యాలు వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఏ రోజైనా సెలవు పెడితే ఆ రోజు జీతం కట్ చేస్తారు. అలా కటింగ్‌లు పోను చేతికి 9,000 కంటే ఎక్కువ రావు. అందుకే ప్రభుత్వం మాకు ఉండటానికి ఇల్లు ఇచ్చి ఉద్యోగం పర్మినెంట్ చేస్తే బాగుంటుంది. వయసు పెరిగిపోతుంది. ఎలా బతకాలి అనే దిగులు మమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. – గేర మారెమ్మ, పారిశుధ్య కార్మికురాలు
పర్మినెంట్ చేస్తే ఓ ధైర్యం
నేను అంబర్‌పేటలో ఉంటాను. గత 27 ఏండ్లుగా పనిచేస్తున్నాను. నేను చేరినప్పుడు నా జీతం రూ.900. ఇప్పుడు 18,000 వేలు అయ్యింది. సెలవు పెట్టకుండా ఉంటే మొత్తం జీతం వస్తుంది. పీఎఫ్, ఈఎస్‌ఐ రెండు పోగా 15000 వేల దాకా చేతికి వస్తుంది. నాకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. కొడుకులిద్దరికీ పెండ్లి చేశాను. బిడ్డ చదువుకుంటుంది. నా భర్త ఏడేండ్ల కిందట చనిపోయాడు. దాంతో కుటుంబ భారం అంతా నా మీద పడింది. మాలాంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇంటి అద్దెలు కట్టుకుంటూ ఈ జీతాలతో బతకడం చాలా కష్టం. ఇన్నేండ్ల నుండి ఉద్యోగం చేస్తున్నా పర్మినెంట్ చేయలేదు. పర్మినెంట్ చేస్తే ఒక ధైర్యం వస్తుంది.
- మేడిపల్లి లక్ష్మి, పారిశుధ్య కార్మికురాలు