నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని కంసానిపల్లి గ్రామంలోని బీటీ మెయిన్ రోడ్డు గుంతలతో నిండిపోవడంతో, వర్షపు నీరు నిల్వై రహదారి అధ్వాన స్థితికి చేరుకుంది. ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలో రహదారిపై ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చింతల నాగరాజు మాట్లాడుతూ.. “రోడ్డు గుంతలతో నిండిపోవడం వలన ప్రయాణం చాలా ప్రమాదకరం అయింది. వెంటనే రహదారి పునర్నిర్మాణ పనులు ప్రారంభించాలి” అని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కంసానిపల్లి నుండి డిండిచింతపల్లి, కల్వకుర్తి, హైదరాబాద్ వంటి ప్రధాన ప్రాంతాలకు వెళ్లే ఈ రహదారి పాడై, ప్రయాణం మరింత ఇబ్బందికరంగా మారిందని ప్రజలు తెలిపారు. గ్రామపంచాయతీ నుండి అంగన్వాడి కార్యాలయం వరకు ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడి, ముఖ్యంగా వర్షాకాలంలో ప్రమాదాలు పెరుగుతున్నాయని వారు పేర్కొన్నారు.
ఇటీవలి మూడు నాలుగు రోజుల వర్షాల కారణంగా గుంతల్లో నీరు నిలిచి, ఎక్కడ ఏ గుంత ఎంత లోతుగా ఉందో అంచనా వేయలేక చాలామంది ప్రమాదాలకు గురై గాయపడ్డారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ, రహదారులు భవనాల శాఖలు స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు, పాదాచారులు, గ్రామస్తులు కోరుతున్నారు.