నవతెలంగాణ – నవీపేట్
దేశ సంపద మొత్తం కార్పోరేట్ చేతిలోకి వెళ్లకుండా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ వ్యతిరేక ఉద్యమాన్ని ఉదృతం చేసి కాపాడుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా పోరాటాన్ని ఆగస్టు 13 న తీసుకున్న సందర్భంగా దేశంలో క్విట్ కార్పొరేట్ వ్యతిరేక ఉద్యమాన్ని ఉదృతం చేయాలని సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, మహిళ మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశంలోని 60 శాతం సంపద కార్పొరేట్ ల చేతిలోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నవరత్నాల లాంటి ఫ్యాక్టరీలను, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం అప్పజెప్పడంతో కార్మిక వర్గానికి భవిష్యత్తు లేకుండా పోయిందని అన్నారు. అంబానీ, ఆదాని లాంటి వారికి భూములు కేటాయిస్తూ కార్పొరేట్ వ్యవసాయం చేయించి చిన్న, సన్నకారు రైతుల పుట్టగొట్టే ప్రయత్నం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగంలో కార్పొరేట్ కళాశాలల్లో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ తీరు మారకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు మేకల ఆంజనేయులు, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి గోవింద్ నాయక్, తెలంగాణ రైతు సంఘం నాయకులు దేవేందర్ సింగ్, షేక్ మహబూబ్, రాదా తదితరులు పాల్గొన్నారు.
దేశ సంపద కార్పోరేట్ల చేతిలోకి వెళ్లకుండా కాపాడుకోవాలి: సీఐటీయూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES