ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ,
ఈడబ్ల్యూఎస్ కోటా తేవాలి
ఇందుకు ప్రభుత్వం చట్టం చేయాలి
ప్రయివేటులో భారీ ఫీజులతో అణగారిన వర్గాలకు ఇబ్బందులు : పార్లమెంటరీ ప్యానెల్ సిఫారసులు
న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ఉన్నత ప్రయివేటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్లకు పార్లమెంటరీ ప్యానెల్ ప్రతిపాదించింది. అలాగే రిజర్వేషన్లకు అనుగుణంగా సీట్లను పెంచటంలో భాగంగా మౌలిక సదుపాయాల కోసం ప్రయివేటు విద్యాసంస్థలకు ప్రభుత్వ నిధులు అందించాలని సిఫారసు చేసింది. ప్రభుత్వం ఇందుకు చట్టాన్ని తీసుకురావాలని సూచించింది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ, సీనియర్ నాయకులు దిగ్విజరు సింగ్ నేతృత్వంలోని విద్యపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు ఒక నివేదికను రూపొందించింది. ఈ కమిటీ ప్రతిపాదనల ప్రకారం.. ఉన్నత ప్రయివేటు విద్యాసంస్థల్లో ప్రవేశాలలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ సభ్యులకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించటంలో భాగంగా సీట్ల పెంపు కోసం, అదనపు మౌలిక సదుపాయాలకు ప్రభుత్వ నిధులు అందించాలని ప్రతిపాదించింది. ”ప్రయివేటు విద్యాసంస్థలు రిజర్వేషన్ విధానాలను అమలు చేయటానికి చట్టబద్ధంగా బాధ్యత వహించవు. ఎందుకంటే వాటిని తప్పనిసరిగా అమలు చేసేలా ఎలాంటి చట్టమూ లేదు. కాబట్టి రాజ్యంగంలోని ఆర్టికల్ 15(5)ని పార్లమెంటు చట్టం ద్వారా దేశవ్యాప్తంగా పూర్తిగా అమలు చేయాలని కమిటీ సిఫారసు చేస్తున్నది” అని తన నివేదికలో పార్లమెంటరీ ప్యానెల్ పేర్కొన్నది. ప్రయివేటు ఉన్నత విద్యా సంస్థలు ఫీజులు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నాయనీ, వాటిని చెల్లించడానికి అణగారిన వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని వివరించింది. రిజర్వేషన్ కోటా కింద ప్రయివేటు విద్యాసంస్థల్లో చదివే పేద విద్యార్థులకు సహాయం అందించటం కోసం ఫీజుల్లో 25 శాతాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయాలని కమిటీ ప్రతిపాదించింది. బిట్స్ పిలానీ, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, శివ్‌నాడార్ యూనివర్సిటీ వంటి ప్రఖ్యాత ప్రయివేటు విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంఖ్య వారి జనాభా, కోటా నిబంధనల కంటే చాలా తక్కువగా ఉన్నదని కమిటీ పేర్కొన్నది.
ప్రయివేటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు
- Advertisement -
- Advertisement -