మానేరు వరదల్లో పశువులను కోల్పోయిన రైతులకూ పరిహారం
నవతెలంగాణ – గంభీరావుపేట
ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద వాగు దాటుతూ గల్లంతైన వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసింది. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి మంగళవారం రూ.5 లక్షల చెక్కును రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అందజేశారు. వరదల్లో పశువులను కోల్పోయిన రైతులకు కూడా పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన పంపుకాడి నాగయ్య మానేరు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. ఐదు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆయన ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో నాగయ్య భార్య లక్ష్మికి రూ.5 లక్షల చెక్కును కలెక్టర్ అందజేశారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
పశువుల యజమానులకు పరిహారం
లింగన్నపేట గ్రామానికి చెందిన గడ్డమీది మణెమ్మకు చెందిన రెండు పశువులు, ప్రవీణ్గౌడ్కు చెందిన పశువు వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో వారికి ప్రభుత్వం తరపున నష్టపరిహారం చెక్కులను అందజేశారు. మణెమ్మకు రూ.లక్ష, ప్రవీణ్గౌడ్కు రూ.50 వేల చెక్కులను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ విజయ, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ, నాయకులు పాల్గొన్నారు.