స్పోర్ట్స్‌ హబ్‌గా తెలంగాణ

thai boxing–  శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌
–  థారు బాక్సింగ్‌ పోటీల పోస్టర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ స్పోర్ట్స్‌ హబ్‌గా తయారైందని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అన్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా జాతీయ థారు బాక్సింగ్‌ పోటీలు నేటి నుంచి ఆరంభం కానుండగా.. టోర్నీకి సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ‘క్రీడా రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. స్టేడియాల నిర్మాణం, మౌళిక వసతుల కల్పన సహా గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం అందించేందుకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామానికి సమగ్ర క్రీడా సామాగ్రితో కూడిన కెసిఆర్‌ స్పోర్ట్స్‌ కిట్‌ను అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. జాతీయ థారు బాక్సింగ్‌ పోటీలకు హైదరాబాద్‌ను ఎంచుకోవటం సంతోషం. క్రీడా పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం, శాట్స్‌ నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని’ ఆంజనేయ గౌడ్‌ అన్నారు. జాతీయ థారు బాక్సింగ్‌ టోర్నీలో 16 రాష్ట్రాల నుంచి 390 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు. సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో మెన్‌, ఉమెన్‌ చాంపియన్‌షిప్స్‌ జరుగుతాయి. శనివారం పోటీలు ఆరంభం కానుండగా, ఆదివారం అన్ని విభాగాల్లో ఫైనల్స్‌ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మహారాష్ట్ర ఎమ్మెల్యే గౌతమ్‌ చుబుకేశ్వర్‌, తెలంగాణ ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి జగదీశ్వర్‌ యాదవ్‌, థారుబాక్సింగ్‌ ఆఫ్‌ ఇండియా ఫెడరేషన్‌ అధ్యక్షుడు సంతోష్‌ ఖైర్నార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love