స్నేహమంటే ప్రతిఫలం ఆశించని బంధం. కానీ ప్రేమలో మాత్రం అలా కాదు. ప్రేమలో ఒకరి నుండి మరొకరు ఎన్నో ఆశిస్తారు. నా కోసం నేను ప్రేమించిన వ్యక్తి ఇది చేయాలి అది చేయాలి, నాతో మాత్రమే మాట్లాడాలి అని అనుకుంటారు. కొన్ని సార్లు ఇది ఇబ్బంది కరంగా కూడా మారుతుంది. కానీ స్నేహంలో ఇలాంటివి ఏమీ ఉండవు. ఇంట్లో వారితో కూడా పంచుకోలేని చాలా విషయాలు స్నేహితులతో చెప్పుకోవచ్చు. స్నేహానికి లింగ భేదం, పేద-ధనిక అనే తేడా కూడా ఉండదు. ఎవరు ఎవరితోనైనా స్నేహం చేయవచ్చు. ఇది ఒక స్వచ్ఛమైన బంధం. ఇప్పుడెందుకు ప్రేమ, స్నేహం గురించి మాట్లాడుతున్నాను అనే కదా మీ సందేహం. వారి మధ్య వున్నది ప్రేమ అని పెద్దలు, స్నేహం అని పిల్లలు భావిస్తూ ఐద్వా అదాలత్ (ఐలమ్మ ట్రస్ట్)కు వచ్చారు.
జ్యోతి, నవీన్ ఇద్దరూ కాలేజీ రోజుల నుండి మంచి స్నేహితులు. ప్రస్తుతం ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. మంచి ఉద్యోగం, మంచి కుటుంబం. నవీన్‌కు 28 ఏండ్లు అయితే జ్యోతికి 27 ఏండ్లు. వీళ్లిద్దరి స్నేహంతో ఇరు కుటుంబాల మధ్య కూడా స్నేహం కుదిరింది. అయితే ఆ పెద్ద వాళ్లే వీరిద్దరికీ పెండ్లి చేయాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని ఇద్దరి ముందు ప్రస్తావించారు. అయితే జ్యోతికి ఇదం తా ఇష్టం లేదు. అందుకే మా దగ్గరకు వచ్చి… ‘నవీన్‌తో పాటు నాకు కాలేజీలో ఇంకా నలుగురు స్నేహితులు ఉన్నారు. అందులో ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు. మేమందరం మంచి స్నేహితులం. నవీన్‌తో నా స్నేహం ఇంటర్‌లో మొదలయింది. కానీ గాయత్రితో నా స్నేహం స్కూల్ నుండే ఉంది. కానీ ఆమె విషయంలో లేని ఆలోచన నవీన్ విషయంలోనే ఎందుకు, ఒక అమ్మాయి అబ్బాయి స్నేహంగా ఉండకూడదా? మరి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. స్నేహం వేరు ప్రేమ వేరు. కానీ ఆ విషయం మా వాళ్లకు అర్థం కావడం లేదు. నేను నవీన్‌ని పెండ్లి చేసుకుంటే మంచి స్నేహితుడ్ని కోల్పోతాను అనిపిస్తుంది.
నాకు నవీన్ కేవలం ఒక స్నేహితుడిగానే కనిపిస్తాడు. ఎలాంటి స్నేహితుడు అంటే ఎలాంటి ఆలోచనా లేకుండా వాడు అబ్బాయా లేక అమ్మాయా అనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడేస్తాను. నాకు అనిపించింది చెప్పేస్తాను. మేము సన్నిహితంగా వుంటాము. నవీన్ కూడా అలాగే ఆలోచిస్తాడు. అతనికి కూడా ఏ ఆలోచన వచ్చిన కనీసం టైం కూడా చూడకుండా ఫోన్ చేసి మాట్లాడతాడు. నాకే కాదు అతనికి కూడా నాపైన అలాంటి ఫీలింగ్ అంటే పెండ్లి చేసుకోవాలనే ఆలోచన ఉండదు. ఒక వేళ ఉంటే నాకు తెలుస్తుంది కదా! అలాంటప్పుడు మేము పెండ్లి చేసుకొని సంతోషంగా ఎలా ఉంటాము అనేది నా ప్రశ్న. నేను ఆలోచించేది సరైనదే అని నా నమ్మకం. నా మిగిలిన స్నేహితులు కూడా ఇదే చెబుతున్నారు. కానీ మా కుటుంబ సభ్యులకి విషయం అర్థం కావడం లేదు. ‘పరిచయం లేని అబ్బాయి వస్తే ఎలా ఉంటాడో, నవీన్ అయితే మన కుటుంబానికి బాగా తెలుసు, నిన్ను బాగా అర్థం చేసుకుంటాడు, బాగా చూసుకుంటాడు అంటూ నన్ను బలవంతంగా పెండ్లికి ఒప్చించాలని చూస్తున్నారు. అందుకే మీ దగ్గరకు వచ్చాను. మీరే ఎలాగైనా మా ఇంట్లో వాళ్లకు నా బాధ అర్థమయ్యేలా చెప్పండి’ అన్నది. నవీన్‌తో మాట్లాడితే అతను కూడా ఇలాగే అన్నాడు.
‘మా మధ్య వున్న ప్రేమ కేవలం స్నేహితుల మధ్య వుండేది తప్ప ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ కాదు. నేను జ్యోతితో మాట్లాడినా, ఆమెతో సమయం గడిపినా స్నేహి తులుగా మాత్రమే ఉంటాము. ఎప్పుడో మరో ఆలోచనే రాలేదు. వేరే అమ్మాయిని చూసిన ప్పుడు వచ్చే ఫీలింగ్ జ్యోతిని చూసినప్పుడు కలగడం లేదు. అదే విషయం నేను జ్యోతికి చెప్తే ‘ఏంటిరా ఏదైనా మాట్లాడేస్తావా, ఎంతైనా నేను అమ్మాయినిరా’ అంటుంది. దానికి నేను వెంటనే నువ్వు అమ్మాయివో, అబ్బాయివో అనేది నాకు సంబంధం లేదు నువ్వు స్నేహితురాలివి అంతే తప్ప ఇక నాకు వేరేలా కనిపించవు అని చెప్పేవాడిని. ఇప్పుడు పెండ్లి అనే ప్రస్తావన తీసుకు వచ్చి మా మధ్య ఉన్న స్నేహాన్ని దూరం చేస్తున్నారు. జ్యోతి చెప్పినట్లు ఇరు కుటుంబ సభ్యులతో మాట్లాడి మా సమస్యకు పరిష్కారం చూపించండి’ అన్నాడు.
ఇద్దరి మాటలు విన్న తర్వాత ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడితే ‘ఇద్దరూ మంచి స్నేహితులు, ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. ఇద్దరికీ ఉద్యోగాలు ఉన్నాయి. వయసు కూడా పెరిగిపోతుంది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అభిమానం అనేది వుంది. ఇంతకు మించి పెండ్లికి ఇంకేం కావాలి. మేమందరం కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం. మేము తీసుకున్న నిర్ణయంలో తప్పు వుంటే మీరే చెప్పండి అన్నారు. దానికి మేము ‘తల్లిదండ్రులుగా మీరు ఆలోచించడం మంచిదే. అందులో ఎలాంటి తప్పూ లేదు. ఏ తల్లిదండ్రులైనా పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఆలోచిస్తారు. కానీ ఇద్దరూ కలిసి జీవించడానికి మీరు అనుకున్నట్టు స్నేహం, పరిచయం, ఉద్యోగం ఉంటే సరిపోదు. ప్రేమ కూడా ఉండాలి. మాకు అదేం లేదు అని వాళ్లే చెబుతున్నారు. అలాంటప్పుడు బలవంతం చేసి పెండ్లి చేయడం ఎంత వరకు సరైనదో ఆలోచించండి.
రేపు వాళ్ల మధ్య ఏమైనా ఇబ్బందులు వస్తే మీరు తట్టుకోగలరా? మంచి స్నేహితులుగా ఉన్న వాళ్లు మంచి భార్యా భర్తలుగా ఉండగలరని గ్యారెంటీ లేదు. అసలు వాళ్ల మధ్య అలాంటి ఫీలింగ్ లేదు. మీరు అనవసరంగా వారి మధ్య ఉన్న స్నేహాన్ని పాడు చేయకండి. వాళ్లేమీ చిన్న పిల్లలు కాదు. అన్నీ తెలిసిన వాళ్లే. వాళ్ల ఆలోచనలు ఏంటో ఎవరితో జీవితం పంచుకోవాలో తెలిసిన వాళ్లు. కాబట్టి వాళ్ల నిర్ణయాలు వాళ్లను తీసుకోనీయండి. మీ అభిప్రాయాలు వాళ్లపై రుద్దకండీ. కాదని బలవంతంగా పెండ్లి చేస్తే రేపు జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి వుంటుంది’ అని చెప్పి పంపించాము.
వై వరలక్ష్మి, 9948794051