‘శ్రమ మూలం ఇదం జగత్!’ ఇది ప్రకృతి. దాన్ని అంగీకరించలేని కొందరు పరాన్న భుక్కులు ‘ధన మూలం ఇదం జగత్! అన్నారు ఇది వికృతి. ఈ ప్రకృతి, వికృతుల చెరలాటలో పరాన్న భుక్కుల చేతిలో శ్రమజీవుల సంవేదనా శీలతను బలంగా విప్పి చెప్పిన నవల కిలారి. తమ గొర్రెల, మేకల మందలను మేపుకుంటూ అడవులు (చెలకలు) పట్టుకుని సంచరించే కురబలను, యాదవులను ‘కిలారి’ అంటారు. నవల పొడవునా కిలారిల జీవితాలను వివరించారు. వాటితో పాటు ఒకనాటి పల్లెల్లో మనుషులు శ్రమ నుండి సేదదీరడానికి ఇప్పుడున్నన్ని అవకాశాలులేవు. అటువంటి కాలంతో స్త్రీ పురుష సంపర్క మొక్కటే మానసికోల్లాసాన్నిచ్చే సాధనం. తమ శారీరక శ్రమ మూలంగా జీవనయానాన్ని సాగించే వారికి మాత్రమే తెలిసిన శ్రమజీవన సౌందర్యారాధనకు వేదికగా అత్యధికంగా కురబల కుటుంబాలుండే ‘ముత్యాలంపల్లి’ అనే గ్రామం ఈ నవల కార్యక్షేత్రం. కుల వృత్తుల నేపథ్యంతో సాగిన ఓ వాస్తవ జీవన ఉమ్మెత్తపూల మాల ఈ కిలారి నవల.
నవల కురబ వీరయ్య, సక్కిరమ్మ దంపతులు కిలారి జాతరకు వెళ్లడానికి తయారవుతున్న సందర్భంలో ప్రారంభమౌతుంది. ఒక కుటుంబం జాతరకు వెళ్లాలంటే దాని వెనుక ఎన్నెన్ని ప్రణాళికలు, ఎన్నెన్ని కోరికలు, ఎన్నెన్ని ఆశలు, ఆశయాలుంటాయో రచయిత జొన్నరొట్టె మీద ముద్దకారం వేసుకుని, దాని మధ్యలో బొటన వేలుతో గుంతచేసి, దాన్నిండా పల్లీ నూనే పోసుకుని, రొట్టెను కొద్ది కొద్దిగా తుంపి ఆ కారం నూనెలో అంచుకు తింటుంటే ఎంత అమత ప్రాయంగా వుంటుందో!? అంత అమత ప్రాయమైన ఆ ప్రాంత యాసతో అంతే అధ్బుతంగా ప్రతి పాత్రను, ప్రతి సన్నివేశాన్నీ చిత్రికపట్టి కూర్చారు రచయిత నాగశేషు. వీరయ్య కుటుంబం జాతరకు చేరుకోగానే అక్కడ రోడ్డుకు ఇరువైపులా బెండు బత్తాసు, జిలేబి, మైసూరుపాకు అంగళ్లు, గాజులమ్మేవాళ్లు, సినిమా టెంట్లు, పీపీలు, పుట్టబాళ్ళు, పిన్నీసులు, రిబ్బన్లు అని అరిసి అరిసి అమ్ముకునేవాళ్లు.
కొమ్ముకుప్పలు, స్టీల్ సామాన్లు, సిల్వర్ పాత్రలమ్మేవాళ్లు, శరబత్తు అమ్మే వాళ్లతో జాతరంతా కిటకిటలాడుతుంది అంటూ సంత వాతావరాణాన్ని పాఠకుల కళ్ళ ముందు బొమ్మకట్టి చూపిస్తాడు రచయిత. ఒకానొక సందర్భంలో గూరప్ప అనే ఎరుకలి కుటుంబం గంపేడు సంసారంతో కురబలకు కావాల్సిన గంపలు, మేక పిల్లల్ని కప్పిపెట్టేందుకు కావాల్సిన బుట్టల్ని అల్లడానికి ముత్యాలంపల్లి వస్తుంది. ఆవూరు వాళ్ళకి వాళ్ళ పనితనం, గూరప్ప వాళ్ళకు ఊరు అన్ని విధాలుగా నచ్చడంతో కురబలు తమ కులదైవం బీరప్పకు గుడికట్టాలని కొని వుంచిన ఊమ్మడి స్థలంలో గుడిశలు వేసుకుబుట్టలల్లుకుంటూ పందులు పెంచుకుంటూ ఊరివాళ్లతో కలిసిమెలిసి జీవిస్తుంటారు. అట్లా వాళ్లకు అక్కడ అన్నిరకాలుగా అనుకూలంగా వుండడంతో ఇక ఆ ఊళ్లోనే స్థిరపడిపోతారు. ఆ విధంగా గూరప్ప వాళ్ళ కుటుంబం ఆ ఊరిలో భాగమైపోతుంది.
కొన్నాళ్లు గడిచిపోయిన తరువాత ఆ కుటుంబానికి గ్రామంలోని భూస్వామి శివరామిరెడ్డికి పందుల కారణంగా గొడవ మొదలవుతుంది. దాంతో గూరప్ప కుటుంబం రెడ్డి చేతిలో ఎంత హింసకు లోనయ్యిందో? చివరికి ఆ కుటుంబంలోని ఓ వ్యక్తే అజ్ఞాతంగా, నిస్వార్థంగా ఊరికి ఏమి చేశాడో? పాఠకులు చదివి తెలుసుకుంటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. నవలలోని అనేక పాత్రల మధ్య ఈశ్వరమ్మ అనే ఓ పాత్ర వస్తుంది. అటువంటి పాత్ర నేటికీ పల్లెల్లో అక్కడక్కడా కనబడుతూనే వుంటుంది. అటువంటి స్త్రీలు గ్రామాల్లోన్ని మగవాళ్ళ దగ్గర పైసలు తీసుకుని వాళ్ళు కోరుకున్న ఆడవాళ్ళను వాళ్ళకు తార్చుతుంటారు. ముత్యాలంపల్లిలో ఊసాయమ్మ అనే ఓ స్త్రీ నిస్సహాయ దయనీయ కుటుంబ పరిస్థితి ఆసరాగా చేసుకుని ఈశ్వరమ్మ ఆవిడకు అనేక రకాల మాయమాటలు చెప్పి ఓ వ్యక్తికి మరగేస్తుంది. చదవడానికిది పాఠకులకు నమ్మశక్యంగా అన్పించకపోయినా ఇప్పటికీ పల్లెల్లో ఇదొక కాదనలేని నిష్ఠుర సత్యం. ఈ సత్యాన్ని రచయిత అశ్లీలతకు ఏమాత్రం తావులేకుండా చెప్పడంలో నేర్పును ప్రదర్శించారు.
మరో గుర్తుంచుకోదగిన పాత్ర మంగలి దుబ్బోడు. ఒకనాటి గ్రామీణ వ్యవస్థలో మంగళ్ళదో విశిష్టమైన పాత్ర. ఊరుమ్మడి బ్రతుకుల్లో ప్రధానమైన చేతివృత్తుల కులాల్లో ఈ నాయిబ్రాహ్మలది కూడా ఒకటి. పైగా వీళ్ళు ఆనాటి గ్రామాల్లో శస్త్ర వైద్యులుగా కూడా పనిచేసేవారు. తమ కత్తులతో గడ్డలను, వ్రణాలను చీల్చి వైద్యం చేసేవారు. గ్రామాల్లో శుభాశుభాలకు మేళం వాయించేవారు.
ఆ గ్రామీణ వారసత్వానికి తిరుగులేని ప్రతినిధిగ గ్రామస్తులందరి తలలోని నాలుకలా వుండే దుబ్బోడు కూడా భూస్వామి శివరామిరెడ్డి దాష్టీకానికి తట్టుకోలేక ఊరిడ్చిపెట్టిపోతాడు.
ఆనాటి కాలంలో అత్తగారి ఇండ్లల్లో వుండిపోయిన అల్లుళ్ల పరిస్థితిని, ఆస్తులకోసం స్వంత ఆడపడుచులను కూడా మోసం చేసే అన్నదమ్ముల అరాచకాన్నీ కళ్ళకు కట్టినట్టు వివరిస్తాడు రచయిత.
తన ఈ రెండో నవల ‘కిలారి’ (ఉత్పత్తి కులాల ఉస్తువారి) నవలలోని భాష (యాస) ను కొంత సరళీకరించుకొని పాఠకుడిలో పాఠనాసక్తిని పెంచేవిధంగా వ్రాయడం ముదావహమైన విషయంగా అన్పిస్తుంది. ఉపశీర్షికలో చివరన ఉస్తువారి అనే పదం ఏ ప్రాంతం నుండి, ఏ భాషనుండి వచ్చి మన తెలుగు భాషలోకి చేరినప్పటికీ దాని ప్రధాన అర్ధం మాత్రం పదోత్పత్తి శాస్త్రంగా చెప్పుకోవచ్చు.
కష్టజీవులు ఉత్పత్తులను సాధించే క్రమంలో అవసరమైన పరికరాలను అప్పటికప్పుడు తామే సృష్టించుకుంటారు. పదే పదే వాటి అవసరాలను దృష్టిలో వుంచుకుని సుళువుగా గుర్తుండిపోయేలా వాటికి పేర్లు పెట్టుకుంటారు. అందుకే ‘ఉస్తువారి’ అంటే ఉత్పత్తికులాల వారి కారణంగా రూపుదిద్దుకున్న పదోత్పత్తి శాస్త్రంగా చెప్పుకోవచ్చునేమో మరి!
నాగశేషు గారి కలం నుండి ముందు ముందు మరిన్ని విలువైన రచనలు వెలువడతాయన్న భరోసాను ఈ నవలతో పాఠకులకు ఇచ్చారనుకోవచ్చు.
- శిరంశెట్టి కాంతారావు, 9849890322