Monday, October 13, 2025
E-PAPER
Homeజాతీయందుస్తుల పరిశ్రమపై సుంకాల దెబ్బ

దుస్తుల పరిశ్రమపై సుంకాల దెబ్బ

- Advertisement -

ప్రమాదంలో లక్షలాది మంది కార్మికుల ఉపాధి

న్యూఢిల్లీ : ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన దేశీయ వస్త్రాలు-దుస్తుల పరిశ్రమ ఇప్పుడు మనుగడ కోసం ఆపసోపాలు పడుతోంది. ఒకనాడు ఈ పరిశ్రమ ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించింది. అత్యధికంగా దుస్తులను ఎగుమతి చేసే ఐదు దేశాల జాబితాలో మన దేశం చోటు దక్కించుకుంది.అయితే అదంతా గతం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ యాభై శాతం సుంకాలు విధించడంతో ఈ పరిశ్రమ ఆగస్ట్‌ చివర నుంచే కుదేలైంది. వస్త్రాలు-దుస్తుల రంగం ఆందోళన చెందుతున్న విధంగా దేశంలోని మరే రంగం కలత చెందడం లేదంటే అతిశయోక్తి కాదు.

పడిపోతున్న ఎగుమతులు
మన వస్త్రాలు, దుస్తులకు అమెరికా చాలా కాలం నుంచే ముఖ్యమైన మార్కెట్‌గా కొనసాగుతోంది. ఒక్క 2024-25లోనే మన దేశం అమెరికాకు 10.9 బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన వస్త్రాలు, దుస్తులు ఎగుమతి చేసింది. టారిఫ్‌ విధించడానికి ముందు కూడా ఈ రంగం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ డిమాండ్‌ బలహీనపడడంతో 2020 నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. కోవిడ్‌ మహమ్మారి విరుచుకుపడడం దీనికి ఓ కారణం. మరోవైపు ఉత్పత్తి వ్యయం కూడా బాగా పెరిగిపోయింది. 2023లో ఎగుమతులు 44.4 బిలియన్‌ డాలర్ల నుంచి 34.4 బిలియన్‌ డాలర్లకు అంటే దాదాపు 22.5 శాతం పడిపోయాయి. అదే సమయంలో వియత్నాం, చైనా నుంచి పోటీ పెరిగిపోయింది. భారత్‌తో పోలిస్తే ఈ దేశాలు ఉత్పత్తి చేస్తున్న దుస్తుల ఖరీదు తక్కువ.

విదేశాలకు తరలిపోతున్న పెట్టుబడులు
గత సంవత్సరం మన వస్త్రాలు-దుస్తుల పరిశ్రమ కొంతమేర కోలుకుంది. ఎగుమతులు పెరిగాయి. అయితే అమెరికా విధించిన తాజా సుంకాల కారణంగా పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, వియత్నాం, శ్రీలంక, ఇండోనేషియాలపై అమెరికా 20 శాతం సుంకాలు విధించగా మనపై మాత్రం ఏకంగా 50 శాతం బాదింది. పోటీదారులతో పోలిస్తే ఆయా దేశాలకు, భారత్‌కు మధ్య నికరంగా 30 పాయింట్ల వ్యత్యాసం కన్పిస్తోంది. దేశంలో పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో అనేక దుస్తుల తయారీ సంస్థలు తమ పెట్టుబడులను పొరుగు దేశాలకు తరలిస్తున్నాయి. ఉదాహరణకు అమెరికాకు ఫ్యాషన్‌ బ్రాండ్లను సరఫరా చేస్తున్న పెరల్‌ గ్లోబల్‌ అనే ప్రముఖ సంస్థ తన కార్యకలాపాలను బంగ్లాదేశ్‌, వియత్నాంలలోని తయారీ యూనిట్లకు తరలించాలని నిర్ణయించింది.

ప్రమాదంలో కార్మికుల ఉద్యోగాలు
దేశంలో కార్మికులు అధిక సంఖ్యలో పనిచేస్తున్న పరిశ్రమల్లో వస్త్రాలు-దుస్తుల పరిశ్రమ కూడా ఒకటి. ఇందులో నాలుగున్నర కోట్ల మంది పనిచేస్తున్నారు. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) వీరి వాటా 2.3 శాతం. ట్రంప్‌ విధించిన తాజా టారిఫ్‌లతో లక్షలాది కార్మికుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. కోవిడ్‌ సమయంలో తగిలిన దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ పరిశ్రమపై మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఇప్పుడు ఈ టారిఫ్‌ భారం పడింది. కోవిడ్‌ దెబ్బ తాత్కాలికమే కానీ ట్రంప్‌ టారిఫ్‌ బాదుడు మాత్రం శాశ్వతం. తయారీ సంస్థలు తమ యూనిట్లను పొరుగు దేశాలకు తరలిస్తే వాటిని తిరిగి మన దేశానికి రప్పించడం చాలా కష్టం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -