Tuesday, January 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసింగరేణి కుంభకోణంపై నేడు గవర్నర్‌కు ఫిర్యాదు

సింగరేణి కుంభకోణంపై నేడు గవర్నర్‌కు ఫిర్యాదు

- Advertisement -

కేటీఆర్‌ సారధ్యంలో సాక్ష్యాధారాలతో ఇవ్వనున్న బీఆర్‌ఎస్‌
నేడు ప్రజాప్రతినిధులతో కీలక సమావేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సింగరేణి కుంభకోణంపై గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేయనుంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సారధ్యంలో గవర్నర్‌ను మంగళవారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో కలిసి ఆ కుంభకోణానికి సంబంధించిన సాక్ష్యాధారాలతో కూడిన నివేదికను అందజేయనుంది. సింగరేణి కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు ఇతర మంత్రుల పాత్రపైనా ఫిర్యాదు చేయనుంది. రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందనీ, సింగరేణి సంస్థలో రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని యధేచ్ఛగా లూటీ చేస్తోందని విమర్శించింది. ఈ భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరనుంది. సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు, లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను బీఆర్‌ఎస్‌ నేతలు గవర్నర్‌కు సమర్పించనున్నారు. సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో జరిగిన ఈ భారీ కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు, వారి కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు నేరుగా భాగస్వాములయ్యారని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనుంది. రాష్ట్ర సంపదను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి, ఇంతటి భారీ స్కామ్‌లో భాగస్వాములైన ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు పదవుల్లో కొనసాగే నైతిక, రాజ్యాంగ పరమైన హక్కు లేదని బీఆర్‌ఎస్‌ స్పష్టం చేసింది. ఇదే అంశాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లనుంది. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతోపాటు సీనియర్‌ నాయకులు తెలంగాణ భవన్‌లో సమావేశమవుతారు. అదేరోజు సాయంత్రం నాలుగు గంటలకు లోక్‌భవన్‌కు బయల్దేరి 4.30 గంటలకు గవర్నర్‌ను కలుస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -