మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం
ఫ్లోరోసిస్ రక్కసిని
రూపుమాపిన వ్యవస్థ
కాంగ్రెస్ నిర్లక్ష్యంతో నిర్వీర్యం : మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణలో ప్రతి ఇంటికీ సురక్షిత, స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన మిషన్ భగీరథ పథకం నేటితో పదేండ్లు పూర్తి చేసుకోవడం సంతోషకరమని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణలో ఇంటింటికీ తాగునీటి విప్లవానికి దశాబ్ది కాలం పూర్తయ్యిందని ఎక్స్ వేదికగా శుక్రవారం వీడియోను షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణలో ఫ్లోరోసిస్ రక్కసిని రూపుమాపిన సుజల వ్యవస్థగా పేరుగాంచిందని వివరించారు. మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో రూపుదిద్దుకున్న మిషన్ భగీరథ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిర్వీర్యమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సరిగ్గా పదేండ్ల క్రితం ఇదే రోజు గొప్ప ఆలోచనతో ప్రారంభమైన ఈ పథకం ప్రజల తాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపిందని తెలిపారు. మిషన్ భగీరథ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న అతిపెద్ద తాగునీటి మౌలిక వసతుల ప్రాజెక్టుగా నిలిచిందని గుర్తు చేశారు. దేశానికి రోల్ మోడల్‌గా నిలిచి హర్ ఘర్ జల్ పథకం అయిందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ఒక పథకం కాదనీ, తెలంగాణ ప్రజల జీవితాలను మార్చిన మహత్తరమైన ప్రణాళిక అని వివరించారు.
రాష్ట్రంలో ఏ ఇంట్లోనూ తాగునీటి కోసం ఇబ్బంది ఉండకూడదనీ, ఏ తల్లి కూడా బిందె పట్టుకుని కిలోమీటర్ల దూరం నడవకూడదనీ, ఏ గ్రామం కూడా వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కోకూడదనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం ఈ బృహత్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు దయనీయ పరిస్థితి
తెలంగాణ ఏర్పాటుకు ముందు అనేక గ్రామాలు, తండాలు, మారుమూల ప్రాంతాల్లో తాగునీటి పరిస్థితి దయనీయంగా ఉండేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. తాగునీటి కోసం బిందెలు మోసుకుంటూ కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవడం మహిళలకు నిత్యకృత్యంగా ఉండేదని తెలిపారు. చాలా గ్రామాల్లో చేతిపంపులు, బోర్లు, స్థానిక నీటి వనరులపైనే ప్రజలు ఆధారపడేవారని పేర్కొన్నారు. భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని తెలిపారు. ఫ్లోరైడ్ సమస్య ఉన్న ప్రాంతాల్లో విషపూరితమైన నీటినే తాగాల్సిన పరిస్థితులు ఉండేవని ఆందోళన వ్యక్తం చేశారు. దానివల్ల ఎముకలు వంకర్లు తిరిగి ఎదుగుదల ఆగిపోయేదని వివరించారు. మారుమూల ప్రాంతాల్లో కలుషిత నీటి కారణంగా మలేరియా, డెంగీ, డయేరియాతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారని తెలిపారు. ఈ దుస్థితిని మార్చాలంటే తాత్కాలిక చర్యలు సరిపోవని గుర్తించిన కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఒక సమగ్ర తాగునీటి గ్రిడ్‌ను నిర్మించాలనే ఆలోచన చేశారని పేర్కొన్నారు. ఆ బృహత్తర యజ్ఞమే మిషన్ భగీరథ అని గుర్తు చేశారు.
ఇంటింటికీ సమగ్ర తాగునీటి వ్యవస్థ
గోదావరి, కృష్ణా నదుల నుంచి ఉపరితల ప్రవాహ జలాన్ని సేకరించి, శుద్ధి చేసి, భారీ పైప్‌లైన్ల ద్వారా గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాలకు తరలించి ఇంటింటికీ సరఫరా చేసే సమగ్ర తాగునీటి వ్యవస్థను నిర్మించామని హరీశ్‌రావు తెలిపారు. వేల కిలోమీటర్ల పైప్‌లైన్లు, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు, ఓవర్‌హెడ్ ట్యాంకులతో ఒక భారీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తాగునీటి అవసరాలను ఒకే సమగ్ర వ్యవస్థతో పరిష్కరించాలనే ఆలోచన అప్పట్లో దేశంలోనే అరుదైనదని తెలిపారు. అందుకే మిషన్ భగీరథ తెలంగాణ అభివృద్ధి చరిత్రలో మాత్రమే కాకుండా దేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచిందని వివరించారు. మిషన్ భగీరథ ప్రభావంతో గ్రామీణ తెలంగాణలో మహిళలు తాగునీటి కోసం పడే కష్టాలు తగ్గాయని పేర్కొన్నారు. తాగునీటి అవసరాలు తీరిపోవడంతోపాటు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీటిని అందించడంలో మిషన్ భగీరథ కీలక పాత్ర పోషించిందని వివరించారు. ఫ్లోరైడ్ రహిత తెలంగాణకు మిషన్ భగీరథ సాధించిన ఖ్యాతి అని పేర్కొన్నారు. దాన్ని కేవలం ప్రభుత్వ పథకంగా చూడలేమనీ, ఇది తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మార్చిన సమగ్ర వ్యవస్థ అని తెలిపారు. తాగునీటితో ప్రజల ఆరోగ్యాలను కాపాడిన అమృత జల ప్రణాళిక అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం… మిషన్ భగీరథకు శాపం
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నేడు మిషన్ భగీరథ పథకానికి శాపంగా మారిందని హరీశ్‌రావు తెలిపారు. పథకాన్ని నిర్మించడం ఎంత ముఖ్యమో.. దాన్ని నిరంతరం నిర్వహించడం అంతకంటే ముఖ్యమని పేర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో పైప్‌లైన్ల లీకేజీలు, మోటార్ల సమస్యలు, పంపింగ్ వ్యవస్థలో ఇబ్బందులు, విద్యుత్ అంతరాయాలు, మరమ్మతుల జాప్యం, నీటి సరఫరాలో అంతరాయాలు కలుగుతున్నాయని వివరించారు. మిషన్ భగీరథను నిర్వహించే సమర్థత ఈ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. పథకాలను రాజకీయ కక్షలకు బలి చేయొద్దని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది కాబట్టి మిషన్ భగీరథను నిర్లక్ష్యం చేయడం క్రిమినల్ నెగ్లిజెన్స్ అవుతుందని తెలిపారు. ప్రభుత్వాలు మారుతాయి కానీ ప్రజల అవసరాలు మారవని తెలిపారు. రాజకీయ కక్షలు, వ్యక్తిగత విమర్శలను పక్కనపెట్టి ప్రజలకు ఉపయోగపడుతున్న పథకాలను సజావుగా నిర్వహించాలని సూచించారు.
మిషన్ భగీరథ నిర్వహణకు నిధులు కేటాయించాలి
మిషన్ భగీరథ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. దెబ్బతిన్న పైప్‌లైన్లు, మోటార్లు, పంపింగ్ వ్యవస్థలను వెంటనే మరమ్మతు చేయాలని కోరారు. నీటి సరఫరాలో ఎక్కడ అంతరాయం ఏర్పడినా వెంటనే స్పందించేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. పదేండ్ల క్రితం కేసీఆర్ ఏర్పాటు చేసిన సమగ్ర తాగు నీటి వ్యవస్థను కాపాడుతూ రాబోయే తరాలకు కూడా సురక్షితమైన తాగునీరు అందించాలని తెలిపారు. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సమగ్ర చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యంతో నిర్వీర్యం చేయకుండా మిషన్ భగీరథ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు.



