800 మందికి పైగా మృతి….2,500 మందికి గాయాలు
నేలమట్టమైన నివాస గృహాలు…అపార ఆస్తి నష్టం
సాయం అందిస్తున్న ప్రపంచ దేశాలు
కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లోని తూర్పు ప్రాంతంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 2,500 మంది గాయాలపాలయ్యారు. ఇప్పటికే మానవతావాద సంక్షోభంతో విలవిలలాడుతున్న ఈ దక్షిణాసియా దేశాన్ని భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో ఆదివారం రాత్రి కునార్, నంగర్‌హార్ రాష్ట్రాలను తాకిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించి అపార నష్టాన్ని మిగిల్చింది. నంగర్‌హార్ రాష్ట్రంలోని జలాలాబాద్ నగరానికి ఈశాన్యంగా 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడింది. ఇది కేవలం ఎనిమిది కిలోమీటర్ల లోతులోనే ఏర్పడడంతో భారీ నష్టం వాటిల్లింది. నుర్ గుల్, సోకీ, వాత్పూర్, మనోగి, చపాదర్, చాకే, షిగాల్ జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. నంగర్‌హార్, లగ్మన్, నురిస్తాన్ రాష్ట్రాలకు కోలుకోలేని అపార నష్టం సంభవించింది. వందలాది నివాస గృహాలు పూర్తిగా కూలిపోవడమో లేదా దెబ్బతినడమో జరిగింది.
మజర్ లోయలోని గ్రామాలన్నీ కొండచరియల కింద శిథిలమై పోయాయి. రహదారులు పూర్తిగా ఛిద్రమయ్యాయి. అఫ్ఘనిస్థాన్-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రాంతాలలో కూడా 4.0 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంపం ధాటికి అనేక భవనాలు నామరూపాలు లేకుండా కూలిపోయాయి. వాటి కింద చిక్కుకుపోయిన క్షతగాత్రులను స్ట్రెచ్చర్లపై మోసుకొచ్చి హెలికాప్టర్లలో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సహాయ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు అన్ని బృందాలనూ రంగంలోకి దింపామని తాలిబాన్ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ మతేన్ క్వానీ తెలిపారు. భూకంపాలు, వరదలకు పెట్టింది పేరైన మారుమూల ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకుంటున్నాయని రాజధాని కాబూల్‌లో ఆరోగ్య అధికారులు చెప్పారు. 2022 జూన్ తర్వాత ఆఫ్ఘన్‌లో భారీ స్థాయిలో భూకంపం సంభవించడం ఇదే మొదటిసారి. గాయపడిన వారిని అంబులెన్సులలో తరలించేందుకు సైనికులు, వైద్య సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలకు స్థానికులు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు.
భూకంపం ధాటికి కునార్ ప్రాంతంలోని మూడు గ్రామాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. అనేక ఇతర గ్రామాలలో కూడా కోలుకోలేని విధంగా నష్టం జరిగింది. ఒక్క కునార్‌లోనే 600 మందికి పైగా చనిపోయారు. నంగర్‌హార్‌లో 12 మంది విగతజీవులయ్యారు. పాకిస్తాన్‌లోని ఖైబర్ పక్తూన్‌క్వా సరిహద్దున ఉన్న భూకంప ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్న సహాయ సిబ్బంది శిథిలాల కింద చిక్కుబడిపోయిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. హెలికాప్టర్లతో పాటు 40 విమానాల ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. భూకంపాలకు ఆఫ్ఘనిస్థాన్ పెట్టింది పేరు. ముఖ్యంగా హిందూ కుష్ పర్వత ప్రాంతంలో ఇవి ఎక్కువగా సంభవిస్తుంటాయి. పశ్చిమ ప్రాంతంలో గత సంవత్సరం సంభవించిన భూకంపాల కారణంగా వెయ్యి మందికి పైగా చనిపోయారు.
ప్రపంచ దేశాల ఆపన్న హస్తం
భూకంపం ధాటికి విలవిలలాడిన అఫ్ఘనిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి అత్యవసర సాయాన్ని పంపింది. పరిస్థితి తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపింది. తమ బృందాలు ఇప్పటికే భూకంప ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయని, అత్యవసర సాయాన్ని అందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో నిమగమయ్యాయని చెప్పింది. ‘మా ఆలోచలన్నీ బాధిత ప్రజల చుట్టూనే తిరుగుతున్నాయి’ అని తెలిపింది. కాగా భారత్ కూడా అఫ్ఘనిస్థాన్‌కు మద్దతును, సంఘీభావాన్ని తెలియజేసింది. బాధిత కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ సానుభూతి తెలియజేశారు. ‘అఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన భూకంపంలో భారీగా ప్రాణనష్టం సంభవించడం నన్ను బాధించింది. ఈ కష్టకాలంలో మా ఆలోచనలు, ప్రార్థనలు బాధిత కుటుంబాలతోనే ఉంటాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు అవసరమైన మానవతా సాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలిపారు. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. అఫ్ఘన్‌కు సాయం చేసేందుకు ఇరాన్ కూడా ముందుకొచ్చింది.
అఫ్ఘన్‌ను కుదిపేసిన భారీ భూకంపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES