Tuesday, March 3, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రపంచ రౌడీగా అమెరికా

ప్రపంచ రౌడీగా అమెరికా

- Advertisement -

ఆధిపత్యం కోసం అడ్డగోలు దాడులు
ఇరాన్‌పై సైనిక చర్య దుర్మార్గం
మోడీ మౌనం దేశప్రతిష్టకు భంగం
యూఎస్‌ సుంకాలు రైతాంగానికి హానికరం
ట్రంప్‌నకు మోడీ సాష్టాంగ నమస్కారం : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
ఇరాన్‌పై ఇజ్రాయిల్‌, అమెరికా దాడిని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అమెరికన్‌ సామ్రాజ్యవాదం ప్రపంచ రౌడీగా, అంతర్జాతీయ టెర్రరిస్టుగా రూపాంతరం చెందిందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. ‘ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దాడి’కి వ్యతిరేకంగా సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరసనా ర్యాలీ నిర్వహించారు. ‘అమెరికా యుద్ధోన్మాదం నశించాలి, అమెరికన్‌ సామ్రాజ్యవాదం నశించాలి, డౌన్‌ డౌన్‌ అమెరికన్‌ ఇంపీరియలిజం, పోరాడుదాం ఇరాన్‌ ప్రజల పోరాటానికి సంఘీభావం’గా అంటూ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అధ్యక్షతన నిర్వహించిన సభలో రాఘవులు మాట్లాడుతూ అమెరికా ప్రపంచ దేశాలపై అడ్డగోలుగా దాడులు చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా దేశాల నాయకత్వాన్ని, ప్రజలను చంపి, ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నదని, దేశాలను లొంగదీసుకునేందుకు కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందులో భాగంగానే తాజాగా ఇరాన్‌పై దాడికి తెగబడిందని చెప్పారు. అంతకు ముందు గాజాపై జరిగిన దాడిలో 70వేల మందిని చంపి మారణకాండను సృష్టించిందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండూ మూడు నెలల కిందట ఇరాన్‌పై 12 రోజులు దాడి చేసి అణుశుద్ధి కార్మాగారాలను ధ్వంసం చేసిందని చెప్పారు. వెనిజులా అధ్యక్షుడు, ఆయన భార్యను కిడ్నాప్‌ చేసి అమెరికాలో నిర్బంధించిందని గుర్తు చేశారు. క్యూబాను లొంగదీసుకుంటామని ప్రకటించటం ఏ అంతర్జాతీయ న్యాయసూత్రమో చెప్పాలని నిలదీశారు. ఇరాన్‌నే కాదు..ప్రపంచంలో అనేక దేశాలను అమెరికా బెదిరిస్తున్నదని చెప్పారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులకు పూనుకుంటుంటే..దేశ ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌ విందుకు పోయి అక్కడి పార్లమెంట్‌లో నెతన్యాహును పొగుడుతూ ఉపన్యాసం చేయటం ఈ దేశ ప్రజలకు అవమానకరమని విమర్శించారు.

విశ్వగు రువునంటూ మీసాలు మెలేస్తున్న ప్రధానికి అమెరికా తొత్తుగా వ్యవహరిస్తున్న దేశంపట్ల ఆ పొగడ్తలేంటని ప్రశ్నించారు. దేశ రైతాంగానికి వినాశకరమైన సుంకాలు విధిస్తే.. ట్రంప్‌నకు సాగిలపడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. మిత్ర దేశమైన ఇరాన్‌పై దాడి జరుగుతుంటే.. కనీసం ఖండించకుండా కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం అవమానకరమన్నారు. అందుకే కేంద్ర సర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఇరాన్‌కు సంఘీభావ ర్యాలీలు జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌ అరుణ్‌కుమార్‌, కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి, ఎస్‌ వీరయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జి నాగయ్య, టి సాగర్‌, ఎండీ అబ్బాస్‌, బండారు రవికుమార్‌, మల్లు లక్ష్మి, చుక్క రాములు, పోతినేని సుదర్శన్‌, ఎండీ జహంగీర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్వీ రమ, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -