నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఎరీ నగరంలో జరిగిన దారుణ ఘటనలో ఓ వ్యక్తి ఎనిమిది మందిని కాల్చి చంపి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, 8 నెలల గర్భిణి కూడా ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం ఎరీ నగరంలోని ఓ వీధిలో ఒక వ్యక్తి తుపాకితో కాల్పులు జరుపుతూ ఇంట్లోకి ప్రవేశించాడని స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఇంటి బయట ఇద్దరు మహిళల మృతదేహాలు కనిపించాయి. ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించగా, అక్కడ మరో ఆరుగురి మృతదేహాలతో పాటు నిందితుడి మృతదేహం కూడా లభ్యమైంది.
విచారణలో భాగంగా పోలీసులు వీడియో ఫుటేజీని పరిశీలించారు. ఇంటి బయట చనిపోయిన 51, 37 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు.. నిందితుడి నుంచి తప్పించుకుని ఇరుగుపొరుగు వారి సాయం కోరడానికి ప్రయత్నించినట్టు అందులో రికార్డయింది. అయితే, నిందితుడు బయటకు వచ్చి వారిద్దరినీ కాల్చి చంపినట్లు పోలీసులు గుర్తించారు.
ఇంట్లో మొదటి అంతస్తులో ఐదేళ్లు, ఏడాది వయసున్న ఇద్దరు చిన్నారుల మృతదేహాలను, రెండో అంతస్తులో 24, 44 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు, 19, 21 ఏళ్ల వయసున్న ఇద్దరు యువకుల మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో ఒకరు మినహా అందరూ బంధువులేనని ఎరీ పోలీస్ చీఫ్ రిక్ లోరా తెలిపారు. ఈ దారుణానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని, అయితే నిందితుడి మానసిక సమస్యలే ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. "కొన్ని దృశ్యాలు మనల్ని జీవితాంతం వెంటాడతాయి. ఇది అలాంటి ఘటనే" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అమెరికాలో కాల్పుల మోత..చిన్నారులు, గర్భిణి సహా 8 మంది కాల్చివేత
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 11, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)