ఆన్‌లైన్ యాప్‌తో కొత్త ఇబ్బందులు.!
స్మార్ట్‌ఫోన్లు లేక.. బుక్ చేయలేక తిప్పలు.!
ఓటీపీ రాక గంటల తరబడి నిరీక్షణ
రోజుకోచోట ఆందోళనలు
యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్
నవతెలంగాణ – నల్లగొండ టౌన్
రైతుల భయమే నిజమైంది. అనుకున్నట్టే.. కాంగ్రెస్ సర్కారు తీరుతో ‘పెనం నుంచి పొయ్యిలో’ పడినట్టయింది. యూరియా కొరత లేకుండా చేస్తామని చెప్పిన ప్రభుత్వం, తీరా ఆన్‌లైన్ యాప్ పేరిట మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. గత నెల 31 నుంచి యూరియా విక్రయాలు ఆన్‌లైన్‌లోనే జరుగుతుండగా, నిరక్ష్యరాసులు, స్మార్ట్‌ఫోన్లు లేని వారు బుక్ చేసుకునేందుకు అరిగోస పడాల్సి వస్తున్నది. స్మార్ట్‌ఫోన్లు ఉన్న రైతులు బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా క్షణాల్లోనే స్టాక్ అయిపోతున్నది. మరోవైపు ఓటీపీ కోసం గంటల తరబడి నిరిక్షీంచాల్సి వస్తున్నది. అష్టకష్టాలు పడి బుక్ చేసుకున్నా డీలర్ దగ్గరకి వెళ్లే సరికి స్టాక్ లేక నిరాశగా వెనుదిరుగుతున్నారు. మొన్నటివరకు ఒక్క బస్తా కోసం రోజుల తరబడి తిరిగామని, ఇప్పుడు యాప్‌తో కష్టాలు మరింత పెరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకోచోట రోడ్డెక్కుతూ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాత విధానంలోనే యూరియా పంపిణీ చేయాలని కోరుతున్నారు.
యూరియాపై నియంత్రణ కోల్పోయిన కాంగ్రెస్ సర్కారు, కొరతను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు నల్లగొండ అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అవసరం మేరకు అందించి ప్రోత్సహించాల్సింది పోయి మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్న కష్టాలు పునరావృతమయ్యాయి. యూరియా కోసం అరిగోస పడాల్సి వస్తున్నది. గత రెండు సీజన్లలో అయితే ఒక్క బస్తా దొరకడమే గగనమైంది. సింగిల్ విండో కార్యాలయాలు, గోదాంల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఒక్క బస్తా కోసం పడరాని పాట్లు పడినా పట్టించుకునే దిక్కు కరువైంది. సకాలంలో అందించకపోవడంతో దిగుబడులపైనా ప్రభావం పడింది.
పోయిన వానకాలంలో ఆశించిన దిగుబడి రాలేదని, యూరియా సకాలంలో వాడకపోవడమే అందుకు కారణమని రైతులు వాపోతున్నారు. ఇక ఈ సీజన్‌లో జనవరి చివరి నుంచి ఆన్‌లైన్‌లోనే యూరియా విక్రయిస్తుండగా, మళ్లీ అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ‘ఫర్టిలైజర్ మొబైల్ యాప్’ ద్వారా రైతులు యూరియా కొనుగోలు చేసుకుంటున్నారని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం రైతుల అరిగోస పడుతూ.. రోజుకోచోట ఆందోళన చేస్తూనే ఉన్నారు.
స్మార్ట్ ఫోన్లు లేక.. ఓటీపీ రాక తిప్పలు..
యాప్‌లో యూరియా కొనుగోలు చేసుకోవాలంటే స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. మెజార్టీ రైతులు ఫీచర్ ఫోన్లే వాడుతుంటారు. అందులోనూ చదువురాని ఉన్నారు. వీరు యూరియా బుక్ చేసుకునేందుకు గోస పడుతున్నారు. అయితే అధికారులు మాత్రం ఎవరి స్మార్ట్‌ఫోన్ నుంచైనా బుక్ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఎరువుల డీలర్ల వద్దకు వెళ్లినా బుక్ చేసి యూరియా ఇస్తారంటున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం అది సాధ్యం కావడం లేదు. ఎందుకంటే ఏకకాలంలో చాలా మంది రైతులు యూరియా బుక్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంటున్నారు. డీలర్లు గాని, ఇతరులెవరైనా గాని బుక్ చేసేందుకు ప్రయత్నిస్తే ఓటీపీలు రావడానికి చాలా సమయం పడుతున్నది. సర్వర్ బిజీగా ఉండి కొన్ని సార్లు గంటల సమయం తీసుకుంటున్నది. దీంతో ఎవరికి ఓపిక లేక రైతులకు ఈ సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. ఈ తలనొప్పి మాకెందుకని బుక్ చేసుకుని వస్తేనే యూరియా ఇస్తామని డీలర్లు ఖరాఖండిగా చెబుతున్నారు.
స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తున్నది. తరుచూ సర్వర్ డౌన్ కావడం, నెట్‌వర్క్ సిగ్నల్స్ సరిగ్గా లేక పోవడం, బుక్ అయిన తర్వాత సకాలంలో ఓటీపీలు రాకపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. బుక్ చేసుకుంటేనే యూరియా ఇస్తామని డీలర్లు స్పష్టం చేస్తుండడంతో చదువురాని, స్మార్ట్‌ఫోన్లులేని రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు పాస్‌బుక్కులకు అటాచ్ అయిన ఫోన్ నంబర్లు, ఆధార్‌కు లింక్ అయిన ఫోన్ నంబర్లు లేక మరింత ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆధార్‌తో ఉన్న ఫోన్ నంబర్లను పాస్‌బుక్కులకు లింక్ చేసుకోవడానికి రైతువేదికల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది భూ యాజమానులు ఓటీపీలు చెప్పకపోవడంతో కౌలు రైతులు యూరియా తెచ్చుకోలేకపోతున్నారు.
క్షణాల్లోనే స్టాక్ మాయం..
అష్టకష్టాలు పడి యూరియా బుక్ చేసుకున్నా చివరకు నిరాశే మిగులుతున్నది. యాప్‌లో కనిపిస్తున్న స్టాక్ క్షణాల్లోనే అయిపోతున్నది. బుక్ చేసుకుంటున్న సమయంలోనే నోస్టాక్ అని వస్తున్నది. ఒక వేళ బుక్ చేసుకొని డీలర్ వద్దకు వెళ్లే సరికి స్టాక్ క్లోజ్ అవుతున్నది. దీంతో రైతులు ఉత్తచేతులతో వెనుతిరగాల్సి వస్తున్నది. రైతులు బుక్ చేసుకున్నట్టు డీలర్లకు సమాచారం లేక.. బుక్ చేసుకున్న వారిలో ఎవరు ముందుగా వస్తే వారికే బస్తాలు దొరుకుతున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. వందల బస్తాలు ఉన్నప్పటికీ, కొద్దిసేపట్లోనే జీరో చూపిస్తున్నదని, ఆ కొద్ది సేపట్లోనే బస్తాలు ఏమైతున్నాయనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
షాపుల యజమానులు, ఇతర డీలర్లు వారే రైతుల పేరుతో యూరియా బుక్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బుక్ చేసుకున్న తర్వాత బస్తాలు దొరకపోతే మరో పదిహేను రోజుల వరకు మళ్లీ బుక్ చేసుకునే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు మండలాలు దాటి బుక్ చేసుకున్నా దొరకడం లేదని వాపోతున్నారు. గతంలో తమ ఊర్లోనే దొరికేదని, ఇప్పుడు పక్క మండలాలకు వెళ్లాల్సి వస్తున్నదని చెబుతున్నారు.
మండిపడుతున్న రైతులు…
యూరియా నియంత్రణ చేతగాకనే కాంగ్రెస్ సర్కారు తమను గోస పెడుతున్నదని రైతులు మండిపడుతున్నారు. అవసరానికి మించి తీసుకెళ్తున్నారని, మోతాదుకు మించి పంటలపై వాడుతున్నారని తమపై అపవాదులు సృష్టించారని ఆగ్రహిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడు అవసరముంటే అప్పుడు డీలర్ వద్దకో.. స్థానికంగా ఉండే సహకార సంఘాల వద్దకో వెళ్లి తెచ్చుకునేదని, యూరియా మార్కెట్‌లో ఎప్పుడైనా దొరుకుతుందనే నమ్మకం ఉండేదని గుర్తు చేస్తున్నారు. కానీ, ఇప్పుడు ఆ నమ్మకం లేకుండా పోయిందని, కనీసం అవసరం మేరకు కూడా తెచ్చుకోలేక పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ చిన్న ఆందోళన కనిపించలేదని, ఇప్పుడు ఒక్క బస్తాకోసం రోడ్డెక్కాల్సి వస్తున్నదని వాపోతున్నారు. కేంద్రం నుంచి సరిపడా యూరియా తెప్పించే చేతగాక తమని ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా యాప్‌ను తొలగించి ఆధార్ కార్డుపై యూరియా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.



