పంజాబ్‌తో హైదరాబాద్ రంజీ పోరు
ఉదయం 10 నుంచి జింఖానా గ్రౌండ్‌లో..
నవతెలంగాణ-హైదరాబాద్
రంజీ ట్రోఫీలో వరుసగా రెండు విజయాలు సాధించి జోరుమీదున్న హైదరాబాద్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఎలైట్ గ్రూప్-బిలో పంజాబ్‌తో హైదరాబాద్ నేటి నుంచి తలపడనున్నాయి. రెండు విజయాలు సహా ఓ బోనస్ పాయింట్‌తో హైదరాబాద్ గ్రూప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఓ విజయంతో పంజాబ్ తర్వాతి స్థానంలో నిలిచింది. హైదరాబాద్, పంజాబ్ మ్యాచ్‌కు జింఖానా గ్రౌండ్ వేదికగా నిలువనుంది. ఇక్కడ ఇటీవల ఎర్ర మట్టి పిచ్‌ను సిద్ధం చేయగా, తొలి రోజు నుంచే స్పిన్‌కు సహకారం లభిస్తోంది. హైదరాబాద్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ రెండు మ్యాచ్‌ల్లో 20 వికెట్లతో రంజీ ట్రోఫీ వికెట్ల వేటగాళ్ల జాబితాలో ముందంజలో కొనసాగుతున్నాడు. ఎర్ర మట్టి పిచ్‌పై మ్యాచ్ కావటంతో తనయ్ త్యాగరాజన్‌తో పాటు అనికెత్ రెడ్డి, రుతిక్ యాదవ్‌లు సైతం ఆతిథ్య హైదరాబాద్‌కు కీలకం కానున్నారు. హైదరాబాద్, పంజాబ్ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ఆరంభం కానుంది.
జోరు కొనసాగేనా
హైదరాబాద్ తొలి రెండు మ్యాచ్‌ల్లో అలవోక విజయాలు సాధించింది. స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ టర్న్ లభించిన పిచ్‌లపై వరుసగా పదేసి వికెట్లు పడగొట్టాడు. అనికెత్ రెడ్డి, రుతిక్ యాదవ్‌లు తమదైన మాయాజాలం ప్రదర్శించారు. దీంతో ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేసేందుకు హైదరాబాద్‌కు వీలు పడింది. బ్యాట్‌తో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్, అభిరథ్ రెడ్డిలు మంచి ఫామ్‌లో ఉన్నారు. కొడిమెల హిమతేజ, రాహుల్ రాడేశ్, వరుణ్ గౌడ్‌లు రాణించాల్సి ఉంది. స్పిన్ ఆల్‌రౌండర్‌గా రుతిక్ యాదవ్ ఆకట్టుకున్నాడు. జింఖానాలో అరంగేట్ర ఇన్నింగ్స్‌లోనే అర్థ సెంచరీ చేసిన రుతిక్ మరోసారి ఆ తరహా ఇన్నింగ్స్‌పై గురి పెట్టాడు. హైదరాబాద్ మరోసారి ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగనుంది. మహ్మద్ సిరాజ్ స్థానంలో సివి మిలింద్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
బలమైన ప్రత్యర్థి
దేశవాళీ సర్క్యూట్‌లో పంజాబ్ బలమైన జట్టు. గ్రూప్-బిలో పంజాబ్ నుంచి హైదరాబాద్‌కు గట్టి సవాల్ ఎదురు కానుంది. సాలిల్ అరోరా, ఉదయ్ సహరాన్, విహాన్ మల్హోత్రా, హర్నూర్ సింగ్‌లు పంజాబ్ బ్యాటింగ్ బాధ్యతలు మోస్తున్నారు. గుర్నూర్ బరార్, ఉమేశ్ యాదవ్, హర్‌ప్రీత్ బరార్, రమణ్‌దీప్ సింగ్‌లతో కూడిన బౌలింగ్‌కు లైనప్ 20 వికెట్లు పడగొట్టగల సామర్థ్యం ఉంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై ఉమేశ్ యాదవ్ నుంచి రివర్స్ స్వింగ్ ఆశిస్తోన్న పంజాబ్.. తుది జట్టు కూర్పులో స్పిన్నర్లకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
సిరాజ్ స్థానంలో ముదస్సర్
రంజీ ట్రోఫీలో తర్వాతి రెండు మ్యాచ్‌లకు హెచ్‌సీఏ సీనియర్ సెలక్షన్ కమిటీ ఆదివారం జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్ మహ్మద్ సిరాజ్ న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధం అవుతున్నాడు. దీంతో సిరాజ్‌ను పంజాబ్, చత్తీస్‌గఢ్‌తో రంజీ మ్యాచ్‌లకు సెలక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. మహ్మద్ సిరాజ్ స్థానంలో మరో పేసర్ మహ్మద్ ముదస్సర్ హుస్సేన్‌ను సెలక్షన్ కమిటీ జట్టులోకి తీసుకుంది. 2018లో రంజీ అరంగేట్రం చేసిన ముదస్సర్ హుస్సేన్ ఇటీవల టీజీ20 లీగ్‌లో వరంగల్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. టాప్ ఆర్డర్‌లో రాహుల్ సింగ్ రెండు మ్యాచ్‌లో నిరాశపరిచాడు. అతడి స్థానంలో హృషికేశ్ సింహాను ఎంపిక చేస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ.. సెలక్షన్ కమిటీ రాహుల్ సింగ్‌పై మరో రెండు మ్యాచ్‌లు నమ్మకం ఉంచింది. కెప్టెన్‌గా సీవీ మిలింద్ బాధ్యతలు చేపట్టనున్నాడు.





కామెంట్‌లు (0)