ఫైనల్లో వరల్డ్ నం.1 చేతిలో ఓటమి
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750
పారిస్ (ఫ్రాన్స్) : భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి సింధుకు మరోసారి నిరాశే ఎదురైంది. వరల్డ్‌నం.1, ప్రపంచ చాంపియన్ అన్ సే యంగ్ (దక్షిణ కొరియా)తో వరుసగా 10 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన పి.వి సింధు.. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోనూ కొరియా షట్లర్ చేతిలో ఓటమి చెందింది. మూడు గేముల పాటు సాగిన మ్యాచ్‌లో 21-16, 11-21, 12-21తో సింధు పరాజయం పాలైంది. గతంలో యంగ్‌పై ఒక్క విజయం సాధించని సింధు.. ఆమెపై ఓ గేమ్‌లో పైచేయి సాధించటం ఇది రెండోసారి మాత్రమే. తొలి గేమ్‌లో ఫ్రంట్ ఫుట్‌తో దూకుడుగా ఆడిన సింధు ప్రథమార్థంలో వెనుకంజ వేసినా 11-11తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత జోరందుకుని 21-16తో తొలి గేమ్‌ను ఖాతాలో వేసుకుంది. నిలకడగా రాణించే యంగ్ రెండో గేమ్‌లో పుంజుకుంది. వరుస పాయింట్లతో 21-11తో సత్తా చాటింది. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. డిసైడర్‌లోనూ యంగ్ జోరు తగ్గలేదు. 21-12తో సింధుపై పైచేయి సాధించి నాల్గో సారి ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా అవతరించింది. ఈ ఏడాది జులైలో జపాన్ ఓపెన్ విజేతగా నిలిచిన సింధు.. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్‌ను రన్నరప్‌గా ముగించింది.





కామెంట్‌లు (0)