Magazines

రూ.120 కోట్లతో 
స్టేడియాల అభివృద్ధి

15 నిమిషాల క్రితం

stadiums
avatar
balaji

ప్రచురించబడింది నవం 25, 2026 | 3 నిమిషాల చదవడం

యూత్‌ గేమ్స్‌తో క్రీడాభివృద్ధికి బలమైన పునాదిమంత్రులకు వేదికల ఇన్‌చార్జ్‌ బాధ్యతలు

నిర్వహణ ఏర్పాట్లు, నాణ్యతపై విజిలెన్స్ నిఘా

ఖేలో ఇండియా గేమ్స్‌పై సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి


నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ నిర్వహణతో తెలంగాణలో క్రీడాభివృద్దికి బలమైన పునాది పడనుందని, హైదరాబాద్‌ను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే కార్యాచరణలో ఇది ముందుడుగు కానుంది రాష్ర్ట ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు తెలంగాణ వేదికగా జరుగనుండగా, క్రీడా పోటీల నిర్వహణ, ఏర్పాట్లపై బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది భవనంతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు.

స్టేడియాల అభివృద్ధి

2002 జాతీయ క్రీడల తర్వాత ఆ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించటం ఇదే తొలిసారి కానుంది. అందుకే, ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రూ.21 కోట్లు కేటాయించగా, రాష్ర్ట ప్రభుత్వం రూ.203 కోట్లు వెచ్చిస్తోంది. అందులో భాగంగా రూ. 120 కోట్ల రాష్ట్ర బడ్జెట్‌తో స్టేడియాలలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అత్యాధునిక క్రీడా పరికరాలకు కేటాయించాం. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ నిర్వహణను తాత్కాలిక అవసరాలకు కాకుండా, భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడేలా కార్యాచరణ రూపొందించాం. అందుకే, ప్రధాన స్టేడియాల్లో శాశ్వత క్రీడా సదుపాయాలను కల్పించే ప్రక్రయ వేగంగా జరుగుతోంది. యూత్‌ గేమ్స్‌ అనంతరం ప్రపంచ స్థాయి సదుపాయాలు, మౌలిక వసతులు రాష్ట్ర క్రీడాకారులకు ఉపయోగపడతాయి. 2002 జాతీయ క్రీడలకు 8 వేల మంది పాల్గొనగా.. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో 9 వేల మంది పాల్గొనే అవకాశం ఉందని సీఎం అన్నారు.

మంత్రులకు బాధ్యతలు

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ ఆరంభ, ముగింపు వేడుకలు సహా పోటీలు జరిగే వేదికలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు తీసుకోవాలి. ఎల్బీ స్టేడియంలో ఆరంభ వేడుకలు, గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి. హైదరాబాద్‌, రంగారెడ్డి పరిధిలో మంత్రులు పొన్నం ప్రభావకర్‌, శ్రీధర్‌ బాబు సమన్వయం చేసుకుని ఏర్పాట్లను పర్యవేక్షించాలి. మహబూబ్‌నగర్‌ పరిధిలో జూపల్లి కృష్ణారావు, వరంగల్‌ పరిధిలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కరీంనగర్‌ పరిధిలో అడ్లూరి లక్ష్మన్‌ కుమార్‌, ఖమ్మం పరిధిలో తుమ్మల నాగేశ్వర్‌ రావు, నిజామాబాద్‌ పరిధిలో సుదర్శన్‌ రెడ్డి పోటీల ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలు తీసుకోవాలని సీఎం సూచించారు. పోలీసు, మున్సిపల్‌ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో పని చేయాలి ఆదేశించారు.

ఏర్పాట్ల నాణ్యతమైన విజిలెన్స్‌ నిఘా

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ జరిగే అన్ని నగరాల్లో క్రీడా స్ఫూర్తి ఉట్టిపడేలా ఏర్పాట్లు ఉండాలి. యూత్‌ గేమ్స్‌ నిర్వహణతో తెలంగాణ యువతను క్రీడల వైపు మళ్లించేందుకు దోహదపడేలా భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించాలి. స్టేడియాల పునరుద్ధరణ, ఆధునీకరణ ఏర్పాట్ల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. స్టేడియాల్లో ఏర్పాట్ల నాణ్యమైన విజిలెన్స్‌ నిఘా ఉండాలి. పోటీలు జరిగే అన్ని వేదికల్లో టాయిలెట్లతో సహా ఇతర అవసరాలకు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వాడాలని సీఎం ఆదేశించారు.

మన క్రీడాకారులకు స్పోర్ట్స్‌ కిట్లు

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో 27 క్రీడల్లో పతక పోటీలు నిర్వహించనున్నారు. తెలంగాణ క్రీడాకారులకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. పోటీల్లో పాల్గొనే 861 మంది తెలంగాణ క్రీడాకారులు, కోచ్‌లకు స్పోర్ట్స్‌ కిట్లు పంపిణీ చేయనున్నాం. స్పోర్ట్స్‌ కిట్‌లో 2 జతల ట్రాక్‌ సూట్లు, 2 టీ షర్టులు, 2 షార్టులు, ఒక జత స్పోర్ట్స్‌ షూ, 2 జతల సాక్స్‌లు, 2 జతల లో దుస్తులు, 2 ట్రైనింగ్‌ టీ షర్టులు ఉంటాయని అధికారులు సీఎంకు వివరించారు. యూత్‌ గేమ్స్‌ జరుగనున్న 14 స్టేడియాలో పనులు పూర్తయ్యావని, మరో 6 స్టేడియాల్లో ఈ నెలాఖరులోగా పనులు పూర్తవుతాయని తెలిపారు. స్టేడియాల పనుల పురోగతిపై నోడల్‌ ఆఫీసర్లు ప్రతి రోజు నివేదికలు పంపుతున్నారని, జిల్లా కలెక్టర్లు క్యాంప్‌లు, స్టేడియాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని అధికారులు సీఎంకు తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసి మెరుగైన శిక్షణ అందించేందుకు దేశంలోనే అత్యుత్తమ కోచ్‌లను రాష్ట్ర జట్లకు ఎంపిక చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు.

ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు చేపడుతున్న ప్రణాళికలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ సంప్రదాయ యుద్ధ కళ కర్ర సాము ఈ పోటీల్లో ప్రదర్శన క్రీడగా తొలిసారి కనిపించనుందని అధికారులు తెలిపారు. జాతీయ వేదికపై కర్రసాముకు సముచిత స్థానం కల్పించటంతో ఈ క్రీడకు ప్రోత్సాహం అందుతుందని సీఎం అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణా రావు, ఎంపీ వేం నరేందర్‌ రెడ్డి ,రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌ రెడ్డి, క్రీడా శాఖ స్పెషనల్‌ చీఫ్‌ సెక్రటరీ వాణి ప్రసాద్‌, శాట్‌ ఎండీ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్