Magazines

అదానీ ‘మహా’ మోసం

15 నిమిషాల క్రితం

అదానీ ‘మహా’ మోసం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 3 నిమిషాల చదవడం

25 ఏండ్లలో రూ.28,400 కోట్ల అదనపు వ్యయం

మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు

బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అండ.. ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం

తక్కువ ధరకు విద్యుత్‌ లభించే అవకాశాలున్నా అధిక ధరకు కొనుగోలు

పోటీ సంస్థల అభ్యంతరాలు బేఖాతరు..
అదానీ గ్రూపునకు అనుకూలంగా నిబంధనలు

కేంద్రంలో మోడీ సర్కారు.. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం. పాలనలో ప్రజా ప్రయోజనాల కంటే కార్పొరేట్‌ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నాయన్న విమర్శలకు మహారాష్ట్ర విద్యుత్‌ ఒప్పందం మరో ఉదాహరణగా నిలుస్తోంది. అదానీ గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థల మధ్యే విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా ఒప్పందాలు కుదిరేలా పరిస్థితులు కల్పించడమే కాకుండా, పోటీ సంస్థల అభ్యంతరాలను సైతం ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేసే అవకాశాలున్నప్పటికీ అధిక ధరకు ఒప్పందం కుదుర్చుకోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ముంబయి : ప్రభుత్వ రంగ విద్యుత్‌ పంపిణీ సంస్థను ఉపయోగించుకుని అదానీ గ్రూప్‌నకు ప్రయోజనం చేకూర్చేలా మహారాష్ట్రలో విద్యుత్‌ ఒప్పందం జరిగిందా? పోటీ సంస్థలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన టెండర్‌ ప్రక్రియలో అదానీ సంస్థలకే అనుకూలంగా నిబంధనలు రూపొందించారా? తాజాగా వెలుగులోకి వచ్చిన పత్రాలు, టెండర్‌ వివరాలు ఈ ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. 2500 మెగావాట్ల నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం మహారాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎంఎస్‌ఈడీసీఎల్‌) నిర్వహించిన టెండర్‌లో అదానీ పవర్‌ విజయం సాధించింది. అయితే ఈ ఒప్పందంలో అదానీ గ్రూప్‌నకు చెందిన మరో సంస్థ నుంచే సౌర విద్యుత్‌ తీసుకోవాలనే నిబంధన వివాదానికి కేంద్రంగా మారింది.

అదానీ సంస్థల మధ్యే విద్యుత్‌ లావాదేవీలు

2024 అక్టోబర్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం అదానీ గ్రూప్‌తో 25 ఏండ్లపాటు 5,000 మెగావాట్ల సౌర విద్యుత్‌, 1,600 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ సరఫరాకు ఒప్పందం చేసుకుంది. ఇందులో సౌర విద్యుత్‌ సరఫరా బాధ్యత అదానీ రెన్యూవబుల్‌ ఎనర్జీ ఫిఫ్టీ ఫైవ్‌ సంస్థకు అప్పగించారు. ఈ ఏడాది మార్చిలో మరో 2,500 మెగావాట్ల నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం కొత్త టెండర్‌ నిర్వహించారు. ఇందులో గెలిచే సంస్థ తప్పనిసరిగా గతంలో ఒప్పందం చేసుకున్న అదానీ సంస్థ నుంచే 5,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ను వినియోగించుకోవాలని నిబంధన విధించారు. చివరకు అదానీ పవర్‌ ఈ టెండర్‌ను దక్కించుకుంది. దీంతో అదానీకి చెందిన రెండు సంస్థలు, ప్రభుత్వ విద్యుత్‌ పంపిణీ సంస్థ మధ్య త్రైపాక్షిక ఒప్పందం ఏర్పడింది.

పోటీ సంస్థల అభ్యంతరాలు బేఖాతరు

టెండర్‌ ప్రక్రియలో ఇతర కంపెనీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన సంస్థే సౌర విద్యుత్‌ సరఫరా చేస్తూ, అదే గ్రూప్‌లోని మరో సంస్థ టెండర్‌లో పాల్గొనడం ప్రయోజనాల సంఘర్షణకు దారితీస్తుందని హెచ్చరించాయి. తమ సొంత సౌర విద్యుత్‌ కేంద్రాల నుంచి విద్యుత్‌ సరఫరా చేసుకునేందుకు అనుమతించాలని కోరినా అధికారులు అంగీకరించలేదు. అదానీ ప్లాంట్‌ విద్యుత్‌ ఉత్పత్తి వివరాలు, సరఫరా సమయాలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని అడిగినా స్పందన లేదు. అయినప్పటికీ ఎలాంటి అనుకూలత కల్పించలేదని అధికారులు సమాధానమిచ్చారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర పరిశోధకులు సైతం టెండర్‌ పారదర్శకతను ప్రశ్నించారు.

బాధ్యత మాత్రం కొనుగోలుదారుదే!

అదానీ సంస్థ నుంచి సౌర విద్యుత్‌ అందుబాటులో లేకపోయినా, గెలిచిన సంస్థ నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాల్సిందేనని టెండర్‌లో పేర్కొన్నారు. అంటే విద్యుత్‌ సరఫరా కోసం అదానీ సంస్థపై ఆధారపడాల్సి వస్తున్నా, సరఫరా విఫలమైతే బాధ్యత మాత్రం మరో సంస్థదే. అదానీ సంస్థకు ఎలాంటి బాధ్యత లేకుండా నిబంధనలు రూపొందించడంపై పోటీదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బ్యాటరీ నిల్వ వ్యవస్థ ఏర్పాటు చేయాలనుకున్నా గుజరాత్‌లోని అదానీ ప్లాంట్‌ ఉన్న ఖవ్డా ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే షరతు విధించారు. దీనివల్ల ఇతర సంస్థల స్వేచ్ఛకు మరింత పరిమితులు ఏర్పడ్డాయి.

ప్రజలకు చౌకగా విద్యుత్‌ అందించాల్సిన ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఈ వ్యవహారంతో మరింత బలపడుతున్నాయి. కేంద్రంలో మోడీ సర్కారు, రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఉన్నప్పటికీ టెండర్లలో పారదర్శకత, పోటీ, ప్రజాధన పరిరక్షణకు ప్రాధాన్యం దక్కిందా అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

అధిక ధరతో ప్రజాధనానికి గండి

ఈ ఒప్పందంలో యూనిట్‌ విద్యుత్‌కు రూ.5.90 చెల్లించేందుకు నిర్ణయించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ నిర్వహించిన మరో టెండర్‌లో యూనిట్‌కు రూ.5.25 నుంచి రూ.5.26కే నిరంతర విద్యుత్‌ సరఫరా ఒప్పందాలు కుదిరాయి. అంటే మహారాష్ట్ర ఒప్పందం దాదాపు 12.38 శాతం అధిక ధరతో జరిగింది. ఈ ధరల ఆధారంగా 25 ఏండ్లలో సుమారు రూ.28,400 కోట్ల వ్యత్యాసం ఉండొచ్చని లెక్కలు చెప్తున్నాయి. ఎస్‌బీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ విశ్లేషణలో యూనిట్‌ విద్యుత్‌ ధర రూ.4.70గా అంచనా వేయడం మరిన్ని ప్రశ్నలకు తావిస్తోంది.



డేటా సెంటర్లకు విద్యుత్‌.. అదానీకే లబ్ధి!

మహారాష్ట్రలో డేటా సెంటర్లు, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, కృత్రిమ మేధా రంగాల అభివృద్ధి కోసం నిరంతర హరిత విద్యుత్‌ అవసరమని ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని సమర్థించుకుంది. అయితే రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటులో అదానీ గ్రూప్‌ కూడా కీలకంగా ఉంది. ఆ గ్రూప్‌ డేటా సెంటర్‌ విభాగం పవర్‌పల్స్‌ ట్రేడింగ్‌ సొల్యూషన్స్‌ నుంచి విద్యుత్‌ కొనుగోళ్లు చేసినట్టు స్టాక్‌ మార్కెట్‌కు సమర్పించిన వివరాలు వెల్లడిస్తున్నాయి. అవి ఇదే ఒప్పందానికి సంబంధించినవా అన్నది తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్