ఖాతాల నుంచి తొలగింపు
పదేండ్ల లోనే భారీ మాఫీ
టాప్-10 బ్యాంకుల వాటా
రూ.11.73 లక్షల కోట్లు
ఐదేండ్ల లో రికవరీ 13 శాతమే
న్యూఢిల్లీ : రైతులు, సామాన్యులు రూ.లక్ష అప్పు చెల్లించకపోతేనే నోటీసులు, జప్తు హెచ్చరికలు, పరువు పోయేలా వసూళ్ల వేధింపులకు పాల్పడే బ్యాంక్‌లు అదే పెద్ద కార్పొరేట్లు, బడా వ్యాపారులు వేల కోట్లు ఎగ్గొడితే మాత్రం ఉదారంగా రద్దు చేస్తోన్నాయి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడాబాబుల మొండి బాకీలను బ్యాలెన్ష్ షీట్ల జాబితా నుంచి తొలగించడం (రైట్‌ఆఫ్) పరిపాటిగా మారిపోయింది. ఇలా పదేండ్ల లో బ్యాంకులు ఏకంగా రూ.18.08 లక్షల కోట్ల మొండి రుణాలను ఖాతాల నుంచి తొలగించాయి. ఇందులో ఐదేండ్ల లో కేవలం 13 శాతం (రూ.1.32 లక్షల కోట్లు) మాత్రమే వసూళ్లయ్యాయని ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం మాఫీలో తొలి పది బ్యాంకుల వాటానే రూ.11.73 లక్షల కోట్లుగా ఉన్నాయి.సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) ద్వారా వెల్లడైన ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. 2016-17 నుంచి 2025-26 వరకు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు రూ.18,07,812 కోట్ల రుణాలను రద్దు చేశాయి. 2018-19లో అత్యధికంగా రూ.2.39 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయి. అనంతరం కూడా వరుసగా రెండేండ్లలో రూ.2 లక్షల కోట్లకు పైగా ఈ ప్రక్రియ కొనసాగింది.
2025-26లో రుణాల రద్దు 8.2 శాతం తగ్గి రూ.1.44 లక్షల కోట్లకు చేరినప్పటికీ.. పదేండ్లలో మొత్తం మాత్రం రూ.18 లక్షల కోట్లను దాటడం ఆందోళకరం. ఈ భారీ మొత్తాల్లో ఎన్ని రుణాలు తిరిగి వసూలయ్యాయి? రుణాలు ఇచ్చే సమయంలో అనుసరించిన ప్రమాణాలు ఏమిటి? పెద్ద రుణగ్రహీతల విషయంలో బాధ్యతను ఎంత కఠినంగా నిర్ధారిస్తున్నారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.రుణాల మాఫీలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా అధికంగా ఉంది. ఎస్‌బీఐ పదేండ్లలో రూ.3,03,160 కోట్ల రుణాలను రైట్‌ఆఫ్ చేయగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.1,31,170 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.1,14,701 కోట్లు, యూనియన్ బ్యాంక్ రూ.1,13,112 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.1,03,949 కోట్ల రుణాలను రద్దు చేశాయి. ఈ ఐదు బ్యాంకుల మొత్తం రూ.7.66 లక్షల కోట్లుగా ఉంది. తొలి పది బ్యాంకుల రైట్‌ఆఫ్‌ల మొత్తం రూ.11.73 లక్షల కోట్లకు చేరింది. అంటే మొత్తం రైట్‌ఆఫ్‌లలో సుమారు 65 శాతం ఈ పది బ్యాంకుల నుంచే జరిగాయి.
పెద్ద రుణాల విషయంలో వీడియోకాన్ గ్రూపు ఉదంతం ఈ సమస్య తీవ్రతను గుర్తుచేస్తోంది. వీడియోకాన్ మాజీ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ వ్యక్తిగత హామీలకు సంబంధించిన రూ.12,668 కోట్ల రుణాల వ్యవహారంలో ఇటీవల నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) దివాలా ప్రక్రియకు సంబంధించిన చర్యలు చేపట్టింది. ఇందులో కేవలం రూ.600 కోట్లు చెల్లిస్తే చాలని తెలిపింది. ఆ తర్వాత ఇది తీవ్ర వివాదం కావడంతో తీర్పును వెనక్కి తీసుకుంది. మరోవైపు ఫ్యూచర్ గ్రూపు ప్రమోటర్లు కిషోర్ బియానీ, రాకేష్ బియానీలు దాదాపు రూ.24వేల కోట్లు మేర బ్యాంక్‌లను ముంచారు. చిన్న రుణగ్రహీతపై ఒత్తిడి తెచ్చే బ్యాంకులు, భారీ రుణగ్రహీతల విషయంలోనూ అదే స్థాయి బాధ్యత, జవాబుదారీతనం చూపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థలో రుణ వసూళ్ల విధానం పేద, ధనిక రుణగ్రహీతల మధ్య వివక్షతో కూడుకున్నదనే అనుమానాలు మరింత బలపడతాయి.






కామెంట్‌లు (0)