Magazines

రియల్‌ ఎస్టేట్‌ దందా ఆపండి

23 నిమిషాల క్రితం

scam
avatar
balaji

ప్రచురించబడింది నవం 25, 2026 | 2 నిమిషాల చదవడం

రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి

కూకట్‌పల్లి ట్రక్‌ పార్కు భూముల వేలాన్ని మానుకోండి

వామపక్షాలు, బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ ముట్టడి

జాన్‌‌వెస్లీ సహా పలువురి ‌నేతల అరెస్ట్‌

ముఖ్యమంత్రి రేవంత్‌‌ రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ విజ్ఞప్తి


నవతెలంగాణ – కూకట్‌పల్లి
మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి ట్రక్‌ పార్కు స్థలంలోని 3.15 ఎకరాల భూమి వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం రైతులు త్యాగం చేసి ఇచ్చిన భూములను విక్రయించే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌‌రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ దందా మానుకోవాలని సూచించారు. వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ సీపీఐ(ఎం), బీఆర్‌ఎస్‌, ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో జాన్‌ వెస్లీతో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ 1980–81లో అప్పటి ప్రభుత్వం మూసాపేట, కూకట్‌పల్లి రైతుల నుంచి భూసేకరణ చేసి 33 ఎకరాల్లో ట్రక్‌ పార్కింగ్‌ స్థలాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఇవి సాధారణ ప్రభుత్వ భూములు కావని, ప్రజా ప్రయోజనాల కోసం రైతులు త్యాగం చేసిన భూములని పేర్కొన్నారు.

వాటిని ప్రజావసరాలకు వినియోగించని పక్షంలో తిరిగి రైతులకే అప్పగించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ట్రక్‌ పార్కు భూములు ఎకరాకు రూ.99 కోట్ల కనీస ధర నిర్ణయించి వేలం వేయాలని చూస్తోందని, ఆ తర్వాత అది రూ. వందల కోట్లకు వెళ్తుందని తెలిపారు. ఇందులో రియల్ ఎస్టేట్ దందా దాగి ఉందని విమర్శించారు. భూముల అమ్మకాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ఆ స్థలంలో స్టేడియం, విద్యాసంస్థలు లేదా ఆస్పత్రి నిర్మించాలని సూచించారు. పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి, ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి భూములు లేవని చెబుతున్న ప్రభుత్వం వేలాది ఎకరాలను ఎలా అమ్మకానికి పెడుతోందని ప్రశ్నించారు. భూములన్నీ విక్రయిస్తే భవిష్యత్తు తరాల అవసరాలకు స్థలాలు ఎలా సమకూరుతాయని ప్రశ్నించారు.


సంక్షేమం, అభివృద్ధి కోసం భూముల అమ్మకమే మార్గమని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే వనరుల సమీకరణకు ఉత్పత్తి పెంపు, ఉపాధి కల్పన వంటి మార్గాలను అనుసరించాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, సీపీఐ(ఎం) మేడ్చల్‌ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఐలాపురం రాజశేఖర్‌, జిల్లా కమిటీ సభ్యులు కీలుకాని లక్ష్మణ్‌, సబిత, చింతల యాదయ్య, సంతోష్‌, విజయ, రాము, ధర్మారావు, జాహ్నవి, హుడా ట్రక్ పార్క్ బాధితులు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్