కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులను విస్మరిస్తున్నాయి
అంధకారంలో మగ్గుతున్న ఆదివాసీ బతుకులు
కనీస సౌకర్యాలు లేక అభివృద్ధికి ఆమడ దూరంలో గిరిపల్లెలు
కొత్త జిల్లాలకు ఐటీడీఏలను ఏర్పాటు చేయాలి
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్
ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం పాటు పడాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని విస్మరిస్తున్నాయని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(టీఏజీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు రాజ్యాంగం కల్పిం చిన హక్కులను కాలరాస్తున్నారని, మారు మూల గ్రామాలు ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయని తెలిపారు. గిరిజన అభివృద్ధి కోసం రూపొందించిన చట్టాలు అమలు చేయడంలో పాలకులు విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన గిరిజన సమగ్ర అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లను నిర్వీర్యం చేస్తు న్నారని మండిపడ్డారు. ఈ నెల 28, 29 తేదీల్లో కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించనున్న టీఏజీఎస్ 4వ రాష్ట్ర మహాసభల సందర్భంగా నవతెలంగాణ ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి మహేశ్‌తో జరిపిన ముఖాముఖీలో పూసం సచిన్ పలు విషయాలు వెల్లడించారు.
నవతెలంగాణ : గిరిజనులు దేనిపై ఆధారపడి జీవిస్తున్నారు..?
సచిన్ : వ్యవసాయం, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనాన్ని గిరిజనులు కొనసాగిస్తున్నారు. స్థానికంగా పండించిన సేంద్రీయ పంటలను మార్కెట్లో(సంత)లో విక్రయించి కుటుంబా లను పోషించుకుంటారు. అడవిలో సహజ సిద్ధంగా పండిన ఆహార ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. అటవీ అధికారులు వారిని అడవిలోకి రానివ్వకుండా అడ్డుకుంటు న్నారు. సాగు చేసుకుంటున్న భూములను సైతం లాక్కుంటున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో గ్రామాలను వీడి పట్టణాలకు వలస బాట పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర పాలకుల విధానాలతో పట్టణాల్లో ఉపాధి వెతుక్కునే పరిస్థితులు వచ్చాయి.
రాష్ట్రంలో గిరిజనుల స్థితిగతులు, జీవన విధానాలు ఏవిధంగా ఉన్నాయా..?
తెలంగాణలో ఆదివాసీ గిరిజనులు ఆర్థిక స్థితిగతులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా గిరిజనుల బతుకుల్లో మార్పు రాలేదు. విద్య, వైద్యం అందక అనేక గిరిజన గ్రామాల్లో జనం అవస్థలు పడుతున్నారు. అనేక గ్రామాలకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేదు. కనీసం తాగు నీరు, ఉండటానికి పక్కా ఇండ్లు, విద్యుత్ సౌకర్యాలు లేక అంధకారంలో మగ్గుతున్నారు. ఎన్నో మార్లు వినతిపత్రాలు సమర్పించినా పట్టించు కోవడం లేదు. గిరిజనుల ఓట్లతో గెలిచిన నాయకులు తర్వాత పట్టించుకోవడం లేదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు అమలవుతున్నాయా..?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో గిరిజనులకు అందడం లేదు. గిరిజనుల కోసం కేటాయించిన నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు చేయడంలేదు. గిరిజనులకు కేటాయింపులోనే తక్కువ నిధులు కేటాయించి అందులోనూ పూర్తి స్థాయిలో ఖర్చు చేయకపోతే గిరిజనులు ఎలా అభివృద్ధి చెందుతారు. క్షేత్ర స్థాయిలో సంక్షేమ ఫలాలు అర్హులకు అందించకపోవడంతో ఆదివాసులు అభివృద్ధికి నోచుకోవడం లేదు.
పీఎం జన్మన్ పథకం రాష్ట్రంలో అమలు ఎలా ఉంది..?
కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి జన్మన్ పథకం క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. అటవీ ప్రాంతంలో గుర్తించిన పీవీటీజీ గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలి. మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యంతో పాటు కనీస సదుపాయాలైన తాగు నీరు, పక్కా ఇండ్లు, విద్యుత్ సౌకర్యం, పాఠశాలలు, అంగన్వాడీ భవనాలు, అంతర్గత రోడ్లు నిర్మించాలి. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు అసంపూర్తిగా ఉంటున్నాయి.
ఆదివాసులు అభివృద్ధి చెందకపోవడానికి కారణాలు ఏమిటి..?
ప్రస్తుతం రాష్ట్రంలో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లు మొత్తం నాలుగు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్, ఏటూరునాగారం, మన్ననూర్, భద్రాచలంలో ఉన్నాయి. ఇవి 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వంలో పని చేస్తున్న అన్ని శాఖలు ఐటీడీఏ పరిధిలో ప్రత్యేకంగా ఉండాలి. కానీ ప్రస్తుతం ఉన్న శాఖలను మార్చుతున్నారు. ఐటీడీఏ పరిధి నుంచి తొలగించి ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంటున్నారు.
గిరిజన అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి..?
5వ షెడ్యూల్ భూభాగంలో జిల్లాకు ఒక ఐటీడీఏను ఏర్పాటు చేయాలి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఐటీడీఏ పని చేస్తోంది. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా ఒక ఐటీడీఏ ఏర్పాటు చేయడంతో పాటు ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో అన్ని శాఖలు ఉండాలి. ప్రస్తుతం ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని అన్ని శాఖలను మార్చి జిల్లా కలెక్టర్ పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం జన్మన్ పథకం ఐటీడీఏ పరిధిలోంచి వెళ్లిపోవడంతో క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. కేవలం పర్యవేక్షణ తప్ప ఎలాంటి అధికారాలూ ఐటీడీఏకు లేవు.
గిరిజనులకు హక్కులు కల్పిస్తూ రూపొందించిన చట్టాలు ఏమైపోయాయి?
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్క ప్రభుత్వమూ నిలబెట్టుకోవడం లేదు. అధికారంలోకి వస్తే 8 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విస్మరించారు. ఎత్తివేసిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పునరుద్ధరిస్తామన్న మాటను సీఎం నిలబెట్టుకోవాలి. 1/70 చట్టాన్ని రద్దుచేయాలని కోరుతూ 1770 మంది సుప్రీం కోర్టుకు ఆశ్రయిస్తే పట్టించుకోలేదు. 2006 అటవీ భూముల హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు.
టీఏజీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాలు ఎలాంటి ఫలితాలను తెచ్చి పెట్టింది..?
రాష్ట్ర ప్రభుత్వం జీఓ49 ప్రవేశపెట్టి 339 గ్రామాలను అడవి నుంచి బయటకు పంపించడానికి ప్రయత్నించింది. ఈ జీఓను ముందుగానే గుర్తించిన టీఏజీఎస్ గిరిజన పోరాటాలకు పిలుపునిచ్చింది. అన్ని గిరిజన సంఘాలను ఏకం చేసి చేపట్టిన పోరాట ఫలితంగానే ప్రభుత్వం దాని అమలును నిలిపేసింది. ఆ జీఓను పూర్తి స్థాయిలో రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదు. గిరిజనుల అభివృద్ధి జరగాలంటే 2023లో తీసుకొచ్చిన అటవీ సంరక్షణ చట్టాన్ని రద్దు చేయాలి. తునికాకు కల్లాలను రీఓపెన్ చేయాలి. రాష్ట్రంలో వలస ఆదివాసులను గుర్తించి స్థానికంగా ఉపాధి కల్పించాలి. అటవీ ప్రాంతాల్లో గిరిజనులపై జరుగుతున్న అటవీ అధికారుల దాడులను ఆపాలి.






కామెంట్లు (0)