సింగిల్‌విండో విధానంలో అనుమతులు
సోయా, మొక్కజొన్న సరఫరా సమస్యకు 48 గంటల్లో పరిష్కారం
దరఖాస్తు చేసుకుంటే ఫ్యూచర్‌సిటీలో భూమిస్తాం : పౌల్ర్టీ ఇండియా ఎక్స్‌పో-2026లో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో ఐటీతో పాటు పౌల్ర్టీని కూడా ప్రాధాన్యతా రంగంగా చూస్తామనీ, కోళ్ల పరిశ్రమలకు సింగిల్ విండో విధానంలో అనుమతులిచ్చేలా నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో పౌల్ర్టీ ఇండియా ఎక్స్‌పో-2026 ప్రారంభమైంది. అందులో సీఎంతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి, పౌల్ర్టీ ఇండియా అధ్యక్షులు ఉదయ్‌సింగ్ బయాస్, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, ఈశ్వర్‌కుమార్, రాజ్‌కుమార్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేషన్ చైర్మెన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ...18 ఏండ్ల నుంచి పౌల్ర్టీషోను హైదరాబాద్‌లో నిర్వహించడం, ప్రతి ఏటా వ్యాపారం విస్తరించడం గొప్ప విషయమన్నారు. తెలంగాణలో ఐదు కోట్ల 30 లక్షల గుడ్ల ఉత్పత్తి జరుగుతున్నదనీ, ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్లు, కళాశాల్లో గుడ్లు, చికెన్ పెట్టిస్తున్నామని తెలిపారు.
ఫ్యూచర్ సిటీలో బిల్ట్‌నౌ యాప్ ద్వారా పరిశ్రమలకు వెంటనే అనుమతులు ఇస్తున్నామనీ, త్వరలో ఈ విధానాన్ని గ్రామపంచాయతీలకు, మున్సిపాల్టీలకు కూడా విస్తరిస్తామని హామీనిచ్చారు. ఎలాంటి ఆలస్యం లేకుండా సింగిల్ విండో విధానంలో పౌల్ర్టీ పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తామని భరోసానిచ్చారు. దరఖాస్తు చేసుకుంటే ఫ్యూచర్ సిటీలో పౌల్ర్టీ రంగానికి భూమి కూడా కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. వ్యవసాయ కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తున్న రంగం పౌల్ర్టీ అని కొనియాడారు. పౌల్ర్టీ రంగంలో ఒడిదుడికులు సాధారణమనీ, షేర్‌మార్కెట్‌లాగా పొద్దున్నే బాగుండి సాయంత్రానికి నష్టం వచ్చే రంగమని చెప్పారు. సంక్షోభ సమయంలో పౌల్ర్టీ రంగానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. దాణా, మొక్కజొన్న, సోయాబీన్, పౌల్ర్టీ పర్రిశమలకు అనుమతుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను తమ దృష్టికి పౌల్ర్టీ ఇండియా వాళ్లు తీసుకొచ్చారన్నారు.
పౌల్ర్టీ రంగానికి దాణా కోసం సోయా, మొక్కజొన్నను సరఫరా చేసేందుకు సమీక్ష నిర్వహించి 48 గంటల్లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరిని ఆదేశించారు. దేశంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రజలకు రెండేండ్లకు సరిపోను ఆహార నిల్వలు, సన్నబియ్యం కేంద్రం, రాష్ట్రం వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. చిన్న, సన్నకారు పౌల్ర్టీ రైతులను ప్రోత్సహించడమే లక్ష్యం : మంత్రి వాకిటి శ్రీహరి తెలంగాణలో పౌల్ర్టీ రంగం అభివృద్ధికి రాష్ట్ర సర్కారు పూర్తిగా సహకరిస్తున్నదనీ, చిన్న, సన్నకారు పౌల్ర్టీ రైతులను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంతో ముందుకెళ్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే శక్తి పౌల్ర్టీ రంగానికి ఉందన్నారు. పౌల్ర్టీ పర్రిశమలకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు అందించేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. సామాన్య ప్రజలకు సరసైన ధరల్లో పౌష్టికాహారం అందించడంలో పౌల్ర్టీ రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
భూమి మీద కల్తీచేయలేనివి తల్లిపాలు, కోడిగుడ్డు మాత్రమేనన్నారు. కోడిగుడ్డు, చికెన్ మంచి ప్రోటీన్ వనరులని చెప్పారు. పౌల్ర్టీ రంగ నిపుణులు, మాజీ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో, జీడీపీలో పౌల్ర్టీ రంగం కీలకపాత్ర పోషిస్తోందనీ, స్టాక్ మార్కెట్‌లోనూ ఈ రంగానికి మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో పౌల్ర్టీ రంగం అభివృద్ధి కోసం భూమి కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. కొత్తగా పెట్టే పౌల్ర్టీ పరిశ్రమలకు అనుమతుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పౌల్ర్టీ ఇండియా అధ్యక్షులు ఉదయ్‌సింగ్ బయాస్ మాట్లాడుతూ..పౌల్ర్టీ ఎక్స్‌పో గురించి వివరించారు.






కామెంట్‌లు (0)