Magazines

ప్రపంచ నాయకత్వంలో మోడీ ప్రభ తగ్గుముఖం

11 నిమిషాల క్రితం

influence
avatar
balaji

ప్రచురించబడింది నవం 25, 2026 | 2 నిమిషాల చదవడం

అంతర్జాతీయ వ్యవహారాల్లో తగ్గిన ప్రాధాన్యం

అమెరికా, చైనా తర్వాతే
 భారత్‌ స్థానం

దౌత్యంలో పాకిస్తాన్‌ పైచేయి : లోవీ పవర్‌ ఇండెక్స్‌ నివేదిక


న్యూఢిల్లీ: అంతర్జాతీయ వ్యవహారాల్లో మోడీ ప్రభుత్వ నాయకత్వ ప్రభావం తగ్గుతోందని ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్‌ తాజా నివేదిక వెల్లడించింది. ఆసియా దేశాల శక్తి సామర్థ్యాలను అంచనా వేసే 2026 ఆసియా పవర్‌ ఇండెక్స్‌లో భారత్‌ మూడో స్థానాన్ని నిలబెట్టు కున్నప్పటికీ.. ప్రపంచ నాయకత్వం, వ్యూహాత్మక లక్ష్యాల విషయంలో ప్రధాని మోడీపై నిపుణుల అంచనాలు తగ్గినట్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, ఇరాన్‌ యుద్ధ నౌకపై అమెరికా దాడి వంటి కీలక పరిణా మాలపై భారత్‌ అనుసరించిన మౌన వైఖరి దేశ దౌత్య ప్రతిష్ఠను దెబ్బతీసినట్టు నివేదిక పేర్కొంది.


అగ్రరాజ్యాల సరసన భారత్‌ ఎక్కడ?

లోవీ ఇన్‌స్టిట్యూట్‌ విడుదల చేసిన ఈ సూచీలో అమెరికా 78.9 పాయింట్లతో మొదటి స్థానంలో, చైనా 73.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాయి. 40.5 పాయింట్లతో భారత్‌ మూడో స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాదితో పోలిస్తే భారత్‌కు 0.5 పాయింట్లు పెరిగాయి. అయితే అమెరికా, చైనాలను 'సూపర్‌ పవర్స్‌'గా, భారత్‌ను ఏకైక 'మేజర్‌ పవర్‌'(ప్రధాన శక్తి)గా నివేదిక వర్గీకరించింది. జపాన్‌, రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, ఇండోనేషియా, పాకిస్తాన్‌ తదితర దేశాలు 'మిడిల్‌ పవర్స్‌'(మధ్యస్థాయి శక్తులు)గా నిలిచాయి. పాకిస్తాన్‌ 15 పాయింట్లతో 16వ స్థానాన్ని దక్కించుకుంది.

మోడీ అంతర్జాతీయ నాయకత్వంపై
 తగ్గిన విశ్వాసం

ప్రాంతీయ నాయకత్వం విషయంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ తర్వాత ఆసియాలో సమర్థవంతమైన నాయకుడిగా ప్రధాని మోడీ రెండో స్థానంలో ఉన్నారని నివేదిక పేర్కొంది. అయితే ప్రపంచ స్థాయి నాయకత్వం, వ్యూహాత్మక లక్ష్యాల విషయంలో మాత్రం మోడీ ప్రభావం తగ్గిందని స్పష్టం చేసింది. పశ్చిమాసియా యుద్ధ సమయంలో భారత్‌ తక్కువ స్థాయి దౌత్య పాత్రకే పరిమితం కావడం ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించింది.భారత్‌ నిర్వహించిన అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష, మిలాన్‌-2026 విన్యాసాల్లో పాల్గొని విశాఖపట్నం నుంచి తిరిగి వెళ్తున్న ఇరాన్‌ యుద్ధ నౌక ఐరిస్‌ దేనాపై మార్చిలో శ్రీలంక తీరానికి సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికా దాడి చేసింది. ఈ ఘటనలో కనీసం 84 మంది మరణించగా, పలువురు గల్లంతయ్యారు. అమెరికా దాడిపై భారత్‌ స్పందించకపోవడాన్ని మాజీ సైనికాధికారులు, దౌత్యవేత్తలు, విశ్లేషకులు వ్యూహాత్మక అవమానంగా అభివర్ణించారు. భారత్‌ ప్రాంతీయ విశ్వసనీయతకు ఇది దెబ్బ అని వ్యాఖ్యానించారు.

దౌత్యంలో పాకిస్తాన్‌ పైచేయి

మరోవైపు పాకిస్తాన్‌ 2026లో 0.6 పాయింట్లు పెంచుకుని మెరుగైన ప్రగతిని నమోదు చేసింది. అమెరికా-ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ చర్చల్లో మధ్యవర్తిత్వం చేస్తూ పాకిస్తాన్‌ కొంతకాలం కీలక పాత్ర పోషించింది. ఇస్లామాబాద్‌లో జూన్‌లో అవగాహన ఒప్పందం కుదరడానికి ఆ దేశ దౌత్య ప్రయత్నాలు దోహద పడ్డాయి. దీంతో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రాంతీయ, అంతర్జాతీయ నాయకత్వంపై నిపుణుల అంచనాలు మెరుగుపడ్డాయని నివేదిక పేర్కొంది.


ఆర్థిక సామర్థ్యంలో వెనుకడుగు

ఆర్థిక, సైనిక సామర్థ్యాలు, భవిష్యత్‌ వనరులు, దేశాల తట్టుకునే శక్తి, సాంస్కృతిక ప్రభావం వంటి అంశాల ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. భారత్‌ ఆర్థిక సామర్థ్యంలో స్వల్పంగా వెనుకబడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఆర్థిక వ్యవస్థల కొలమానాల్లో చేసిన మార్పులు దీనికి కారణమయ్యాయని నివేదిక వివరించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్