ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించాలి
రూల్స్ సవరణ కోసం ఎస్‌జీఎం ఏర్పాటు అవసరం
హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పరిపాలన పగ్గాలు హైకోర్టు నియమిత ఏక సభ్య కమిటీ చేతుల్లో ఉన్నప్పటికీ.. హెచ్‌సీఏలో నిబంధనల ఉల్లంఘన, రాజ్యాంగ బద్ద పరిపాలన, ప్రజాస్వామ్య బద్ద ఎన్నికల నిర్వహణపై సభ్యులు గళం విప్పుతున్నారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ సారథ్యంలో 106 మంది క్లబ్ కార్యదర్శులు ప్రత్యేక సర్వ సభ్య సమావేశం (ఎస్‌జీఏం) నిర్వహించాలని సింగిల్ మెంబర్ కమిటీని కోరినా.. ఎటువంటి స్పందన లేదని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ అర్షద్ అయూబ్ వాపోయారు. హెచ్‌సీఏలో పలు అంశాలపై మాజీ కార్యదర్శి జాన్ మనోజ్, వంక ప్రతాప్, యాదగిరి, రాజేశ్ యాదవ్‌లతో కలిసి మంగళవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో అర్షద్ అయూబ్ మాట్లాడారు.
ఎస్‌జీఎం ఎందుకు పెట్టరు?
ప్రత్యేక సర్వ సభ్య సమావేశం నిర్వహించాలని 106 మంది సభ్యులు సంతకాలు చేసిన లేఖను సింగిల్ మెంబర్ కమిటీకి ఇచ్చాం. అయినా, ఎటువంటి స్పందన లేదు. ప్రతి ఏడాది వార్షిక సభ్య సమావేశం నిర్వహించాలి. ఏజీఎంలో లేదా ఎస్‌జీఎంలో ఆడిట్ నివేదికకు ఆమోదం లభిస్తేనే.. బీసీసీఐ నుంచి నిధులు వస్తాయి. ఏజీఎం లేకుండా, బీసీసీఐ నుంచి నిధులు ఏ విధంగా తీసుకొస్తారు. ఎస్‌జీఏం, లేదా ఏజీఎం నిర్వహణకు ఇకనైనా ఏకసభ్య కమిటీ అనుమతి ఇవ్వాలి.
ఎన్నికలు నిర్వహించాలి
హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ పదవీ కాలం ముగిసింది. అయినా, అపెక్స్ కౌన్సిల్‌కు న్యాయస్థానంలో పొడగింపు లభించింది. అధ్యక్ష పదవికి 45 రోజుల్లో ఎన్నిక నిర్వహించాలని కోర్టు ఆదేశించినా.. ఆ ఆదేశాలను అమలు చేయలేదు. అపెక్స్ కౌన్సిల్, ఏక సభ్య కమిటీ మధ్య స్పష్టమైన అంతరం కనిపిస్తోంది. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికైన కార్యవర్గమే హెచ్‌సీఏ వ్యవహారాలు చూసుకోవాలి. అందుకు, సింగిల్ మెంబర్ కమిటీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌ను నియమించి, ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టాలి.
టీజీ20 లీగ్ ఖర్చులు వెల్లడించాలి
టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ గడువు డిసెంబర్ 5న ముగియనుంది. టీజీ20 లీగ్ చైర్మన్, సభ్యులను ప్రతి ఏడాది ఏజీఎంలో ఎన్నుకోవాలి లేదా నియమించాలి. తొలి సీజన్ ముగిసినా, ఇప్పటివరకు లీగ్ ఆడిట్ నివేదిక సభ్యులకు అందలేదు. టీజీ20 లీగ్ నిర్వహణ వ్యయం, స్పాన్సర్‌షిప్ మొత్తం, ప్రకటనలు, టికెట్ల అమ్మకాలు వంటి అంశాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రవేశపెట్టాలి. టీజీ20 లీగ్ ఆడిట్ నివేదికకు ఏజీఎం ఆమోదం ఉండాలి. అప్పుడే రెండో సీజన్ నిర్వహణకు వీలు పడుతుంది.
సవరణలు చేయాల్సిందే
జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల ప్రకారం హెచ్‌సీఏ రాజ్యాంగంలో మార్పులు చేయాలి. అపెక్స్ కౌన్సిల్‌లో ఆఫీస్ బేరర్ పదవికి పోటీ చేసేందుకు అంతకుముందు ఎన్నిసార్లు ఏజీఎంకు హాజారు కావాలి, తొలుత కౌన్సిలర్‌గా అపెక్స్ కౌన్సిల్ పని చేయాలి వంటి నిబంధనలను తీసుకురావాలి. అపెక్స్ కౌన్సిల్‌లో కౌన్సిలర్ల సంఖ్యను సైతం పెంచాలి. అందుకు ఎస్‌జీఎం ఏర్పాటు చేసిన హెచ్‌సీఏ రూల్స్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అర్షద్ అయూబ్ అన్నారు.






కామెంట్‌లు (0)