నవంబర్ 25 అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలనా దినోత్సవం. మహిళలకు సమాన హక్కులు, గౌరవం, భద్రత కల్పించాలని ప్రపంచమంతా ప్రతిజ్ఞ చేసే రోజు. కానీ మన దేశంలో మహిళలపై హింస కొనసాగుతూనే ఉంది. నిర్భయ ఘటన తర్వాత కఠిన చట్టాలు, వేగవంతమైన విచారణ, బాధితులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చినా ఆశించిన మార్పు రాలేదు. మోడీ ప్రభుత్వం ‘బేటీ బచావో-బేటీ పడావో’ వంటి నినాదాలు చేస్తున్నా, దాడుల సందర్భంలో ప్రభుత్వాల స్పందన, నిందితులకు అండగా నిలిచే రాజకీయ శక్తుల తీరు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉన్నావ్‌లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ బాలికపై లైంగికదాడి కేసులో దోషిగా తేలాడు. న్యాయం కోసం పోరా డిన బాధితురాలి తండ్రి పోలీ సుల అదుపులో మరణించడం, ఆమె ప్రయా ణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు బంధువులు చనిపో వడం దేశాన్ని కలచివేశాయి. బాధిత కుటుంబానికే రక్షణ కల్పించలేని వ్యవస్థ మహిళలకు భరోసా ఎలా ఇస్తుంది?
హత్రాస్‌లో 2020లో పందొమ్మి దేండ్ల దళిత యువతిపై జరిగిన దారుణం, ఆమె మరణం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి.
కుటుంబ అభీష్టానికి విరుద్ధం గా అర్ధరాత్రి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడం మానవ హక్కులను ప్రశ్నార్థకం చేసింది. 2023లో ప్రత్యేక కోర్టు ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించి, ప్రధాన నిందితుడిని నేరపూరిత మానవ వధ కింద దోషిగా తేల్చింది. కతువాలో ఎనిమిదేండ్ల బాలికపై లైంగికదాడి, హత్య కేసులో నిందితులకు మద్దతుగా ర్యాలీలు జరగడం, అందులో అప్పటి బీజేపీ మంత్రులు పాల్గొనడం ఆందోళన కలిగించింది. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి లైంగిక దాడి చేసిన ఘటన దేశాన్ని కుదిపేసింది. ముందే ఫిర్యాదులు అందినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. వీడియో బయటకు వచ్చాకే కేంద్రం స్పందించింది. నెలల తర బడి హింస కొనసాగుతున్నా ప్రధాని మౌనం విమర్శలకు దారి తీసింది.
గుజరాత్ అల్లర్ల సమయంలో ఐదు నెలల గర్భిణి బిల్కిస్‌బానోపై సామూహిక లైంగిక దాడిచేసి, ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేసిన కేసులో పదకొండు మందికి జీవిత ఖైదు విధించారు. అయితే అప్పటి గుజరాత్ ప్రభుత్వం 2022లో వారిని విడుదల చేయగా, పూలమాలలతో స్వాగతిం చడం మహిళల గౌరవాన్ని అవమానించింది. బిల్కిస్ పోరాటంతో 2024లో సుప్రీంకోర్టు విడుదలను రద్దుచేసి దోషులను తిరిగి జైలుకు పంపింది.
ఇటీవల వారిలో మరో ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు కావడంతో ఆమె ప్రాణభయంతో రాష్ర్టాన్నే వీడాల్సి వచ్చింది. రెండు లైంగికదాడి కేసుల్లో దోషిగా తేలిన డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్‌కు హర్యానా ప్రభుత్వం పదేపదే పెరోల్ మంజూరు చేస్తోంది. 2017 నుంచి 2026 ఆగస్టు నాటికి ఆయన 17వసారి తాత్కాలిక విడుదల పొందాడు. బాధితులు న్యాయం కోసం పోరాడుతుంటే దోషులకు పదేపదే వెసులుబాటు కల్పించడం అనుమానాలకు తావిస్తోంది.
2013 నుంచి 2024 వరకు దేశంలో సుమారు 3.92 లక్షల లైంగికదాడుల కేసులు నమోదయ్యాయి. ఇవి ఫిర్యాదుల ఆధారంగా నమోదైనవే. భయం, సామాజిక ఒత్తిడి, పరువు పేరుతో బయటకు రాని ఘటనలు లెక్కల్లోకి రావు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై చర్యలు కోరుతూ క్రీడాకారిణులు ఢిల్లీలో నెలల తరబడి నిరసన చేశారు.
దేశానికి పతకాలు తెచ్చిన వారు న్యాయం కోసం రోడ్డెక్కాల్సి రావడం, పోలీసుల బలవంతపు అణచివేత పాలకుల వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తాయి. 2026లో కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించగా, రెజ్లర్లు అప్పీలు చేస్తామని తెలిపారు. నిష్పాక్షిక విచారణ జరగాలన్న వారి డిమాండ్‌ను ప్రభుత్వం సకాలంలో పరిష్కరించలేకపోయింది.
నిర్భయ చట్టం, పోక్సో, గృహహింస నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టాలున్నా బాధితులు ఫిర్యాదు నుంచి న్యాయం పొందేవరకు అనేక అవరోధాలు ఎదుర్కొంటున్నారు. సాక్షుల రక్షణ, బాధిత కుటుంబాల భద్రత, వేగవంతమైన విచారణ, నిందితులకు రాజకీయ రక్షణ లేకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత. మహిళల దుస్తులు, స్వేచ్ఛ, ప్రేమ, జీవన విధానాలపై ఆంక్షలు విధిస్తూ, లైంగిక దాడుల నిందితుల విషయంలో మౌనం వహించడం ద్వంద్వ వైఖరి. పురుషాధిక్య భావజాలం, కులమత ఆధిపత్యాన్ని పాలకులు ప్రశ్నించాలి. నేరస్తుడి రాజకీయ హోదా, మతం, కులం చూడకుండా చట్టం పనిచేసినప్పుడే మహిళలకు నిజమైన భద్రత, నిజమైన స్వేచ్ఛ.






కామెంట్లు (0)