టాప్‌ టపటపా

16 నిమిషాల క్రితం

టాప్‌ టపటపా
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 3 నిమిషాల చదవడం

116 పరుగులకే 6 వికెట్లు పతనం

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 356/10

వెలింగ్టన్‌ టెస్టుపై ఆతిథ్య జట్టు పట్టు

వెలింగ్టన్‌ టెస్టుపై ఆతిథ్య న్యూజిలాండ్‌ పట్టు బిగించింది. బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులు చేసిన కివీస్‌... బంతితో భారత్‌ను కోలుకోలేని దెబ్బకొట్టింది. 104 పరుగులకే భారత్‌ టాప్‌-5 బ్యాటర్లను కోల్పోయింది. కివీస్‌ పేసర్లు హెన్రీ, జెమీసన్‌, స్మిత్‌, డఫ్ఫీలు వరుస వికెట్లతో భారత్‌ను ఇరకాటంలో పడేశారు. 46 ఓవర్లలో 6 వికెట్లకు 116 పరుగులే చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో మరో 240 పరుగుల వెనుకంజలో నిలిచింది.

నవతెలంగాణ-వెలింగ్టన్‌

తొలి రోజు ఆటలో స్వల్ప ఆధిక్యత ప్రదర్శించిన న్యూజిలాండ్‌.. రెండో రోజు ఆట ముగిసేసరికి వెలింగ్టన్‌ టెస్టును గుప్పిట్లోకి తీసుకుంది. 246/5 ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 110 పరుగులు జోడించిన న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగుల భారీ స్కోరు చేసింది. పేసర్లు మాట్‌ హెన్రీ, జాకబ్‌ డఫ్ఫీ, నాథన్‌ స్మిత్‌, కైల్‌ జెమీసన్‌లు సమిష్టిగా రాణించటంతో భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 116/6తో కట్టడి చేసింది. యశస్వి జైస్వాల్‌ (0), శుభ్‌మన్‌ గిల్‌ (17), దేవదత్‌ పడిక్కల్‌ (21), రిషబ్‌ పంత్‌ (23), కెఎల్‌ రాహుల్‌ (25), వాషింగ్టన్‌ సుందర్‌ (10) నిరాశపరిచారు. ధ్రువ్‌ జురెల్‌ (7 నాటౌట్‌, 45 బంతుల్లో 1 ఫోర్) అజేయంగా క్రీజులో నిలువగా, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో మరో 240 పరుగుల వెనుకంజలో నిలిచింది.

బ్యాటర్ల తడబాటు

న్యూజిలాండ్‌ బ్యాటర్లు రాణించిన పిచ్‌పై భారత బ్యాటర్లు పరుగుల వేటలో తడబాటుకు గురయ్యారు. తొలి టెస్టులో భారత్‌ దూకుడుకు బాట వేసిన ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (0) వెలింగ్టన్‌లో వికెట్ల పతనానికి నాంది అయ్యాడు!. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో అవుట్‌ స్వింగర్లతో విజృంభించిన మాట్‌ హెన్రీ.. ఆఖరు బంతిని ఇన్‌స్వింగ్‌తో జైస్వాల్‌ వికెట్లను గిరాటేశాడు. పరుగుల ఖాతా తెరవకముందే, భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. కెఎల్‌ రాహుల్‌ (25, 80 బంతుల్లో 3 ఫోర్లు), దేవదత్‌ పడిక్కల్‌ (21, 20 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) రెండో వికెట్‌కు 33 పరుగులు జోడించారు. పడిక్కల్‌ ఎదురుదాడి చేశాడు. ఓ సిక్సర్‌, ఫోర్‌తో దూకుడు చూపించాడు. జెమీసన్‌ ఓవర్లో వికెట్ల వెనకాల క్యాచ్‌తో పెవిలియన్‌కు అంతే వేగంగా చేరాడు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (17, 29 బంతుల్లో 3 ఫోర్లు) మూడు ఫోర్లతో మెరిసినా..జెమీసన్‌ మ్యాజిక్‌కు స్లిప్స్‌లో దొరికిపోయాడు. రిషబ్‌ పంత్‌ (23, 39 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) బౌలర్లపై నియంత్రణతో కనిపించినా.. అనవసర షాట్‌కు వెళ్లి వికెట్‌ కోల్పోయాడు. దీంతో భారత్‌ 96 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ రాహుల్‌ను డఫ్ఫీ అవుట్‌ చేయగా.. వాషింగ్టన్‌ సుందర్‌ను స్మిత్‌ సాగనంపాడు. 46 ఓవర్లలో 116 పరుగులకు భారత్‌ 6 వికెట్లు కోల్పోయింది. ధ్రువ్‌ జురెల్‌ (7 నాటౌట్‌) అజేయంగా క్రీజులో నిలిచాడు. కివీస్‌ పేసర్లు కైల్‌ జెమీసన్‌ (2/33), జాకబ్‌ డఫ్ఫీ (2/21), మాట్‌ హెన్రీ (1/29), నాథన్‌ స్మిత్‌ (1/29) రాణించారు. భారత్‌ 240 పరుగుల వెనుకంజలో నిలువగా, న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యంపై కన్నేసింది.

ఆకాశ్‌ దీప్‌కు ఐదు వికెట్లు

వెలింగ్టన్‌ టెస్టులో నిలకడగా బ్యాటర్లను ఇబ్బందిపెట్టిన పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్‌లో ఫీల్డర్లు ఏకంగా ఐదు క్యాచ్‌లు నేలపాలు చేసినా.. ఐదు వికెట్ల ఘనత సాధించటం విశేషం. ఓవర్‌నైట్‌ స్కోరు 246/5తో రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిలాండ్‌ మరో 110 పరుగులు జోడించింది. వికెట్‌ కీపర్‌ టామ్‌ బ్లండెల్ (89, 211 బంతుల్లో 10 ఫోర్లు) భారీ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. గ్లెన్‌ ఫిలిప్స్‌ (36, 67 బంతుల్లో 5 ఫోర్లు)ను అన్షుల్‌ తొలి ఓవర్లోనే సాగనంపాడు. నాథన్‌ స్మిత్‌ (26), కైల్‌ జెమీసన్ (19), మాట్ హెన్రీ (19) విలువైన పరుగులు జోడించారు. 116. ఓవర్లలో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో ఆకాశ్‌ దీప్‌ (5/99), గుర్నూర్‌ బ్రార్‌ (2/78), అన్షుల్‌ కాంబోజ్‌ (2/79) రాణించారు.

స్కోరు వివరాలు

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 356/10 (బ్లండెల్‌ 89, లాథమ్‌ 59, ఆకాశ్‌ దీప్‌ 5/99, కాంబోజ్‌ 2/79, గుర్నూర్‌ 2/78)

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : యశస్వి జైస్వాల్‌ (బి) మాట్‌ హెన్రీ 0, కెఎల్‌ రాహుల్‌ (సి) కాన్వే (బి) డఫ్ఫీ 25, దేవదత్‌ పడిక్కల్‌ (సి) బ్లండెల్ (బి) జెమీసన్‌ 21, శుభ్‌మన్‌ గిల్‌ (సి) లాథమ్‌ (బి) జెమీసన్‌ 17, రిషబ్‌ పంత్‌ (సి) జెమీసన్‌ (బి) డఫ్ఫీ 23, వాషింగ్టన్‌ సుందర్‌ (సి) లాథమ్‌ (బి) స్మిత్‌ 10, ధ్రువ్‌ జురెల్‌ నాటౌట్‌ 7, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (46 ఓవర్లలో 6 వికెట్లకు) 116.

వికెట్ల పతనం: 1-0, 2-33, 3-59, 4-96, 5-104, 6-116.

బౌలింగ్‌ : మాట్‌ హెన్రీ 13-4-29-1, కైల్‌ జెమీసన్‌ 13-4-33-2, నాథన్‌ స్మిత్‌ 12-3-29-1, జాకబ్‌ డఫ్ఫీ 8-3-21-2.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్