బీజేపీ పాలిత రాష్ట్రాల్లో క్రైస్తవులపై పెరుగుతున్న వేధింపులు
దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపైనే మతమార్పిడి కేసులు
ఫిర్యాదు చేసిన వారిని అరెస్టు చేస్తున్న పోలీసులు
రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు ముప్పు
కార్వాన్-ఎ-మొహబ్బత్ నివేదిక
న్యూఢిల్లీ: దేశంలో మత స్వేచ్ఛకు రాజ్యాంగం కల్పించిన హక్కులు క్రమంగా ప్రశ్నార్థకమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో క్రైస్తవులపై దాడులు, వేధింపులు పెరుగుతున్నాయని, మతమార్పిడి నిరోధక చట్టాలను ఆయుధాలుగా మార్చుకుని బాధితులనే నిందితులుగా నిలబెడుతున్నారని 'కార్వాన్-ఎ-మొహబ్బత్' తాజా నివేదిక వెల్లడించింది. దాడులకు గురైన వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే, వారిపైనే కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. మతం పేరుతో సాగుతున్న ఈ దాడులు దేశ లౌకిక విలువలకు, రాజ్యాంగ హామీలకు సవాలుగా మారుతున్నాయని హెచ్చరించింది.
వేలాదిమందిలో భయాందోళనలు
'భయాందోళనలు.. బహిష్కరణలు: భారత్‌లో క్రైస్తవులుగా ఉండటానికి చెల్లిస్తున్న మూల్యం' పేరుతో నవంబర్ 27న విడుదలైన ఈ నివేదికను హర్ష్ మందర్ స్థాపించిన కార్వాన్-ఎ-మొహబ్బత్ రూపొందించింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమబెంగాల్‌తో పాటు మధ్యప్రదేశ్‌లోని ఘటనలను పరిశీలించి, నాలుగు రాష్ట్రాల్లోని 20 జిల్లాల నుంచి దాదాపు 900 మంది బాధితుల వాంగ్మూలాలను సేకరించింది. దాడులు, చర్చిలపై దాడులు, సామాజిక బహిష్కరణలు, ఆర్థిక వేధింపులు, అంత్యక్రియలకు అడ్డంకులు వంటి ఘటనలు పెరుగుతున్నాయని గుర్తించింది.
దాడి బాధితులపైనే కేసులు
మధ్యప్రదేశ్‌లోని ఝగ్డా గ్రామంలో గతేడాది డిసెంబర్‌లో క్రిస్మస్ గీతాలు పాడి తిరిగి వస్తున్న పాస్టర్ రమేశ్ వాసునియాపై బజరంగ్‌దళ్ సభ్యులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయనపై, పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం జరుగుతుండగానే మతమార్పిడి చట్టం కింద కేసు పెట్టాలని హిందుత్వ సంస్థల కార్యకర్తలు ఒత్తిడి తెచ్చారు. చివరకు గాయాలు పూర్తిగా మానకముందే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని నివేదిక పేర్కొంది.
చట్టాల పేరుతో వేధింపులు
దేశంలోని 13 రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మతమార్పిడి నిరోధక చట్టాల్లోని నిబంధనలు అస్పష్టంగా ఉండటంతో దుర్వినియోగానికి అవకాశం ఏర్పడుతోంది. విద్య, వైద్యం వంటి సేవలను అందించడం కూడా మతమార్పిడికి ప్రలోభపెట్టడంగా పరిగణించే పరిస్థితి ఉంది. మతం మారాలనుకునే వారు ముందుగానే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలనే నిబంధనలు, నిందితులే తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలనే నిబంధనలు వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నాయి. కొన్నిచోట్ల జీవిత ఖైదు, భారీ జరిమానాలు విధించేలా చట్టాలను కఠినతరం చేశారు.
పేరులేని వ్యక్తులపైనా ఎఫ్‌ఐఆర్‌లు
బీజేపీ పాలిత యూపీలో 170 ఎఫ్‌ఐఆర్‌ల పరిశీలనలో సుమారు 700 మందిపై కేసులు నమోదవగా, వారిలో 200 మందికి పైగా పేర్లు కూడా లేని వ్యక్తులుగా ఉన్నారని నివేదిక వెల్లడించింది. ప్రార్థనా సమావేశాలపై దాడులు జరిగినప్పుడు బాధితుల ఫిర్యాదులను పట్టించుకోకుండా వారిపైనే కేసులు పెట్టిన ఘటనలు ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో వెలుగుచూశాయి. కొన్నిచోట్ల పోలీసులే ఫిర్యాదుదారులుగా మారి మతమార్పిడి కేసులు నమోదు చేసినట్టు నివేదిక పేర్కొంది.
మతమార్పిడిలో ద్వంద్వ వైఖరి
మతమార్పిడి విషయంలోనూ వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. క్రైస్తవం, ఇస్లాంలోకి మారడంపై ఆంక్షలు విధిస్తున్న రాష్ట్రాలు, తిరిగి హిందూ మతంలోకి మారడాన్ని మాత్రం అనేక సందర్భాల్లో ప్రశ్నించడం లేదని నివేదిక విమర్శించింది. ఒకవైపు దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ రిజర్వేషన్లు కోల్పోతుండగా, మరోవైపు స్వమతంలోకి తిరిగి వస్తే వాటిని పునరుద్ధరించే నిబంధనలు కొనసాగుతున్నాయి. మతమార్పిడిపై చట్టాల అమలు ఏకపక్షంగా సాగుతోందని నివేదిక అభిప్రాయపడింది.
సామాజిక, ఆర్థిక బహిష్కరణలు
దాడులు, అరెస్టులతో పాటు క్రైస్తవ కుటుంబాలపై సామాజిక, ఆర్థిక బహిష్కరణలు కూడా పెరుగుతున్నాయి. గ్రామాల్లో మంచినీరు, రేషన్, ఉపాధి, వివాహాలు, అంత్యక్రియల్లో పాల్గొనే హక్కులను నిరాకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవుల మృతదేహాలను ఖననం చేయడానికి సైతం అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో క్రైస్తవ కుటుంబాలతో మాట్లాడినా, వారి నుంచి వస్తువులు కొనుగోలు చేసినా జరిమానాలు విధించే పరిస్థితులు ఉన్నాయని నివేదిక తెలిపింది.
రాజ్యాంగ హామీలకు తూట్లు
మొత్తంగా దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మతమార్పిడి నిరోధక చట్టాలు, హిందుత్వ సంస్థల దాడులు, పోలీసుల పక్షపాత వైఖరి కలిసి క్రైస్తవులను భయాందోళనలకు గురిచేస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. మత స్వేచ్ఛ రాజ్యాంగంలో రాసుకున్న హక్కుగా మాత్రమే మిగిలిపోకూడదని, ప్రతి పౌరుడికి భయం లేకుండా తన మతాన్ని ఆచరించే హక్కును ప్రభుత్వాలు కాపాడాలని నివేదిక సూచించింది.





కామెంట్‌లు (0)