పోలీసుల భయం ఉంటేనే
నేరాలు అదుపులో..
పోలీస్టేషన్‌లకూ ర్యాంకింగ్..
నేరాలు తగ్గుముఖం పట్టడమే ఫలితాలుగా భావిస్తాం
వీడీసీల ఆగడాల కట్టడికి సమగ్ర విధానం : రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
‘ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నాకు అలర్జీ. మంచి వాళ్లతో మంచిగా ఉంటాం. చెడ్డవాళ్లతో చెడ్డగా ఉంటాం. పోలీసులంటే భయం ఉంటేనే నేరాలు అదుపులో ఉంటాయి. శాంతిభద్రతలను కాపాడటంలో పోలీస్‌శాఖ పనితీరు బాగుందని, ఇకపై పోలీస్ స్టేషన్‌లకూ ర్యాంకింగ్‌లు ఇస్తాం. లోటుపాట్లపై ఏమేం చేయాలో ఎప్పటికప్పుడు నిర్దేశిస్తాం’ అని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో శనివారం ఆయన పర్యటించారు. 8 పోలీస్ స్టేషన్‌లతో కలిపి కొత్తగా రూరల్ కార్యాలయంతో పాటు మోపాల్ నూతన పోలీస్ స్టేషన్‌ను ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్‌లో జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌ఐలతో, సీఐలతో, ఏసీపీలతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఎస్పీగా తొలిసారి 27 ఏండ్ల క్రితం ఇక్కడే బాధ్యతలు స్వీకరించానని, అందుకు గుర్తుగా తన కొడుకుకు నిఖిల్‌గా పేరు పెట్టానని తెలిపారు. గతంలో నక్సలైట్‌ల ప్రభావం అధికంగా ఉండేదని, ఐదు దళాలు, మిలిటెంట్‌లతో ల్యాండ్‌మైన్ బ్లాస్ట్ లు, తూపాకుల మోతలు వినిపించేవని, కానీ ప్రస్తుతం అభివృద్ధి దిశగా సాగుంతుందని అన్నారు. లొంగిపోయిన మావోస్టులకు పునరావాసం కోసం ఇది వరకే రూ.6 కోట్ల మేర రివార్డు అందజేసినట్టు తెలిపారు. గ్రామాల్లో వారి జీవనం సాఫీగా సాగేలా ఆర్థిక, నైతిక సహకారం అందజేస్తామని వెల్లడించారు. జిల్లాలో పోలీస్‌శాఖ పనితీరు బాగుందని, కొన్ని పోలీస్ స్టేషన్‌ల ర్యాంకింగ్ సరిగ్గా లేదని తెలిపారు. నిజామాబాద్ టౌన్ 1, 3, రూరల్ ఆర్మూర్, బాల్కొండ, ముప్కాల్ తదితర స్టేషన్ పనితీరు మారాలని రివ్యూలో సూచించించినట్టు తెలిపారు. ఈగల్ ఫోర్స్ టీమ్‌కు మొదటిస్థానం వచ్చిందని, సైబర్ క్రైమ్ కేసుల్లో సైతం మెరుగైన ఫలితాలు సాధించినట్టు తెలిపారు. వీడీసీల తీరుపై తనకు సైతం ఫిర్యాదులు వస్తున్నాయని, చట్టానికి విరుద్ధంగా బహిష్కరణలు విధిస్తున్న వీడీసీల కట్టడికి ఇతర శాఖల సహకారంతో సమగ్ర విధానం తీసుకొస్తామని తెలిపారు. హైవేలపై పర్యవేక్షణకు టీ-మాస్ ద్వారా పెట్రోలింగ్ ముమ్మరం చేయనున్నట్టు తెలిపారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా కట్టడికి కృషి చేస్తున్నామని, నిజామాబాద్ బార్డర్ ఏరియా కాబట్టి ఇంటర్ డిస్ర్టిక్ మీటింగ్‌లు నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో సీపీ సాయి చైతన్య, ఐజీ కార్తికేయ, సీఐడీ డీఐజీ నారాయణ నాయక్, సైబర్ సెక్యూరిటీ ఎస్పీ హర్షవర్ధన్, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్, నిజామాబాద్ అడిషనల్ డీసీసీ శుభం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)