తప్పెవరిదీ..శిక్ష ఎవరికి?

13 నిమిషాల క్రితం

Whose fault is it... and who should be punished?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 3 నిమిషాల చదవడం

రవాణాశాఖలో 270 మంది హోంగార్డులు

రాష్ట్ర హోంశాఖకు సరెండర్

మెమో జారీ చేసిన రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి

హఠాత్పరిణామానికి బిత్తరపోతున్న చిరుద్యోగులు

నవతెలంగాణ - హైదరాబాద్‌బ్యూరో

బ్యూరోక్రాట్లు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థంకాదు. సమాజానికి మంచి జరిగితే సరి...కాదని చిరుద్యోగులపై కక్షసాధింపులకు పాల్పడితే దిక్కెవరు? పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో టోల్‌సిబ్బంది తనను గుర్తించకుండా, టోల్ ఫీజు అడిగారని అక్కడి ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాకు కోపం వచ్చి, అప్పటికప్పుడు అక్కడ విధులు నిర్వహిస్తున్న ఐదుగురు సిబ్బంది ఉద్యోగాలు ఊడగొట్టారు. ఇది తాజా పరిణామం. కానీ దీనికి ఐదు రోజుల ముందే అంటే ఈనెల 23న తెలంగాణ రవాణాశాఖలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ఆర్టీఏ కార్యాలయంలో పనిచేస్తున్న హోంగార్డు డబ్బు లెక్కపెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రవాణాశాఖ కమిషనర్ కె ఇలంబర్తికి కోపం వచ్చింది. దీంతో హోంశాఖ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి రవాణాశాఖలో పనిచేస్తున్న 270 మంది హోంగార్డుల్ని మాత సంస్థకు సరెండర్ చేస్తూ ఈనెల 23న మెమో నెంబర్ 4919/c2/2026 జారీ చేశారు. ఒకేచోట సుదీర్ఘకాలంగా పనిచే స్తున్న హోంగార్డులు ఏజెంట్లతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)తో పాటు మీడియా నివేదికల ద్వారా తమ దృష్టికి వచ్చిందని ఆ మెమోలో పేర్కొన్నారు. కానీ అదే రవాణాశాఖలో పదేండ్ల కు పైగా విధులు నిర్వహిస్తున్న అనేకమంది హోంగార్డులపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అత్యంత క్రమశిక్షణతో పనిచేస్తున్నారు. ఎక్కడో ఎవరో ఒకరు తప్పు చేస్తే, మొత్తం హోంగార్డులపై చర్య తీసుకోవడం ఏంటనే చర్చ ఇప్పుడు రవాణాశాఖలో జరుగుతుంది. అక్రమా లకు పాల్పడిన వారిపై చర్య తీసు కోవ డాన్ని తాము వ్యతిరేకించట్లేదనీ, కానీ అందర్నీ ఒకేగాటన కట్టేయడాన్ని మాత్రమే తాము తప్పు పడుతున్నామని హోంగార్డులు చెప్తున్నారు.

సంపాదించుకుంది చాలు...

ఇదే విషయాన్ని హోంగార్డులు ప్రభుత్వంలో కీలకబాధ్యతల్లో ఉన్న ఓ ప్రజాప్రతినిధికి విన్నవించారు. ‘ఇప్పటిదాకా సంపాదించుకుంది చాలు...ఇక సర్దుకోండి’ అని ఆ నేత అవమానకరంగా మాట్లాడారని చిరుద్యోగులు బావురుమంటున్నారు. హోంగా ర్డులు ప్రజాప్రతినిధిని కలిశారని తెలిసిన రవాణాశాఖ ఉన్నతాధికారి ఆయన దగ్గరకు ఎందుకు వెళ్లారంటూ కొన్ని జోన్లలోని హోంగా ర్డుల్ని వెంటనే రిలీవ్ చేయాలంటూ కిందిస్థాయి అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో కొందరు హోంగార్డుల్ని రిలీవ్ చేశారు.

మానవత్వం చూపాలి!

సుదీర్ఘకాలంగా ఒకేచోట ఎలాంటి రిమార్కులు లేకుండా పనిచేస్తున్న తమను అర్థంతరంగా రిలీవ్ చేయడం ఏంటని హోంగార్డులు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయనీ, వ ద్ధులైన తల్లిదండ్రులకు వైద్య సదుపాయం కోసం ఆస్పత్రులకు సమీపంలో ఇండ్లు కిరాయికి తీసుకొని జీవిస్తున్నామని బాధిత హోంగార్డులు చెప్తున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాల్సిం దేననీ, కానీ ఒక్కరు చేసిన దానికి అందరికీ శిక్ష విధించడం సరికాదనేదే తమ అభి ప్రాయమంటున్నారు. మానవతా దృక్పథంతో సర్క్యులర్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, సమగ్రంగా పునఃపరిశీలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


మెమోలో...

రవాణా శాఖలో చేరిన తేదీ నుంచి ఐదేండ్లకు పైగా పనిచేసిన హోంగార్డులను మాతృశాఖకు తప్పనిసరిగా పంపించాలని మెమోలో పేర్కొన్నారు. మిగిలిన వారిని కూడా ఐదేండ్లు పూర్తికాగానే వెనక్కి పంపాలనీ, కొత్త హోంగార్డులను కేటాయించేందుకు పోలీసు కమిషనర్లు, ఎస్పీలను సంప్రదించాలని జిల్లా రవాణా శాఖ అధికారులను ఆ మెమోలో ఆదేశించారు. ఆ మెమోకు ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారనే వివరాలను కూడా జతచేశారు. కానీ అవినీతికి, ఐదేండ్లు సర్వీసు కు ఏంటి సంబంధం అనే ప్రశ్నకు దానిలో సమాధానం లేదు.

చట్టంలో ఏముంది?

తెలంగాణ హోంగార్డ్స్ చట్టం-1948లోని సెక్షన్ 4(3) ప్రకారం హోంగార్డులపై సస్పెన్షన్, తొలగింపు వంటి చర్యలకు నిర్దేశిత నిబంధనలు వర్తిస్తాయి. సెక్షన్ 5 సేవా కాలం, విధుల ప్రాంతం, డిశ్చార్జికి సంబంధించిన అంశాలను నియంత్రించే నిబంధనలకు అవకాశం కల్పిస్తోంది. సెక్షన్ 10 ప్రకారం సేవా పరిస్థితులు, క్రమశిక్షణ, నియామకాలకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం రూపొందించవచ్చు.

హోంగార్డుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యతే!

తెలంగాణ ప్రభుత్వం గతంలో హోంగార్డుల సంక్షేమానికి పలు చర్యలు చేపట్టింది. 2015లో హోంగార్డులకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించే సామాజిక భద్రతా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద 18,380 మంది హోంగార్డులు నమోదయ్యారు. హోంగార్డుల కుటుంబాల సామాజిక భద్రతకు ప్రభుత్వాలు బాధ్యత తీసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విధుల కేటాయింపులో మార్పులు చేసేటప్ప్పు డు వారి కుటుంబాల జీవనోపాధి, ఆర్థిక భద్రతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పరిపాలనా సంస్కరణలు అవసరమే అయినప్ప టికీ అవి ఉద్యోగుల సంక్షేమానికి విరుద్ధంగా మారకూడదనే చర్చ రవాణాశాఖలో జరుగుతున్నది.


జీతంలో కోత

హోంగార్డుల్ని రవాణాశాఖ నుంచి రిలీవ్‌ చేసి, అడిషనల్‌ డీజీపీ (హోంగార్డ్స్‌)కు అటాచ్‌ చేస్తే, అక్కడి నుంచి వారు మరో చోటికి వీరిని నియమించేవరకు జీతాలు చెల్లించరు. పనిచేసిన రోజులకే హోంగార్డులకు వేతనాలు వస్తాయి. దీనివల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితులు తలకిందులు అవుతాయని చిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కోర్టు ఏమంది?

2018 జూన్ 8న తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ పీ మధు కేసులో హైకోర్టు హోంగార్డుల తొలగింపునకు సంబంధించిన పిటిషన్ల విచారణలో పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరోపణల పై చర్యలు తీసుకునే సందర్భంలో నిబంధనలకు అనుగుణంగా నోటీసులు, ఆరోపణల వివరాలు, వివరణ ఇచ్చుకునే అవకాశం వంటి సహజ న్యాయ సూత్రాల ప్రాధాన్యతను పాటించాలని సూచించింది. కానీ ఇప్పటి వ్యవహారం దీనికి పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం!


మేం కోరలేదు : హోంశాఖ

రవాణాశాఖ నుంచి హోంగార్డుల్ని రిలీవ్‌ చేయమని తాము కోరలేదని హోంశాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. రవాణాశాఖ రాసిన లేఖపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరిస్తున్నారు. రవాణాశాఖ నుంచి వచ్చే హోంగార్డుల్ని ప్రస్తుతం తాము స్వీకరించట్లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రిలీవ్‌ అయిన కొందరు హోంగార్డులు తమ మాతృసంస్థలో రిపోర్టు చేసేందుకు వెళ్తే, అక్కడ తిరస్కరణ ఎదురైనట్టు సమాచారం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్