శూన్యతను జయించండి

22 నిమిషాల క్రితం

Conquer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 3 నిమిషాల చదవడం

మీలో ధీమా ఏర్పడటానికి మీరు వేటిని ప్రతీకలుగా పరిగణిస్తారో, దాన్ని బట్టి మీలో శూన్యతమ మీరు అధిగమించ గల సామర్థ్యం ఏర్పడ్తుంది. లౌకికపరమైన వాటిని మీరు ఈ ప్రతీకలుగా భావించినంతకాలమూ మీలో నిండైన భావనలు ప్రోది చేసుకోవు.


ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఏర్పడటం, వృత్తి వ్యాపారాదులలో వైఫల్యాలు ఏర్పడటం ప్రతివ్యక్తి జీవితంలోనూ సర్వసాధారణం. కొంత మంది వ్యక్తులు ఈ ఒడిదుడుకులనే ప్రామాణికంగా తీసుకుని తాము ప్రస్తుతం చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలను మార్చుకోవాలని భావిస్తుంటారు. మరికొందరు కొత్తవాటిని ఎంచుకోవాలని తాపత్రయపడతారు. ఇటువంటి సందర్భాలలో వారి మనసుల్లో శూన్యత ఆవరిస్తుందని కేథీ గుడ్విన్ అనే కెరీర్ సైకాలజిస్టు అంటుంది. ఈ శూన్యతను అధిగమించడం ఎట్లాగో కూడా ఆమె నైపుణ్యంతో కూడిన సలహాలను ప్రతిపాదిస్తుంది. కెరీర్‌లో సక్సెస్ కావాలనుకునే వారందరికీ కేథీ సూచనలు బహుళ ప్రయోజనాలను అందిస్తాయి.

శూన్యత ఎట్లా ఆవరిస్తుంది?

కెరీర్‌‌లో ఒడిదుడుకుల వల్ల ముఖ్యంగా ఈ శూన్యత అవరిస్తుంది. తామేదీ సాధించలేకపోయామేనన్న విచారమో లేక, సాధించదగిన అవకాశాలను మెరుగుపర్చుకోగల సామర్థ్యం తమలో పరిపూర్ణంగా లేదనే భావన వారిని ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా తమ ఆదాయ వనరులు గణనీయంగా తగ్గిపోవడం వల్ల ఈ పరిణామం ఏర్పడుతుంది. డబ్బు సంపాదించగలగటమే కెరీర్‌లో సాధనకు ప్రతిగా ఇటు వ్యక్తిగతంగాను, అటు సామాజికంగాను పరిగణించే స్వభావంవల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కెరీర్ అంటేనే డబ్బు కూడబెట్టటానికి ఒక మార్గమనే ఆలోచన ఎక్కువగా వుండటం వల్ల ఎప్పుడైతే ఆదాయ వనరులు తగ్గుముఖం పట్టాయో క్రమంగా మనసులో శూన్యత నెలకొంటుంది.

వనరులు తగ్గిపోయినప్పుడు జీవితంలో కొంత తిరోగమన వైఖరి కనపరుస్తుంది. అంతవరకూ వున్న లౌకిక సంపదలు దూరంకావటం, వున్న దానితోనే సరిపెట్టుకుని ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి రావడం జరుగుతుంది. లౌకిక సంపదలను కొన్నాళ్ళపాటూ కలిగి వుండి ఆ తర్వాత అవి లేని జీవితాన్ని గడపడం చాలా కష్టమైన పనిగా తోస్తుంది. ఉదాహరణకు నాకు తెలిసిన ఒక మిత్రుడు తన వ్యాపారంలో కొంత నష్టం ఏర్పడటం వల్ల, ఖర్చులు తగ్గించుకోవల్సి వచ్చింది. కారు అమ్మేశాడు. కారు లేని జీవితం గడపటం అతనికి దుర్భరం కాసాగింది. ఆ నైరాశ్యం అతని ప్రతిమాటలోను స్పష్టంగా కనపడ సాగింది. ఒక్కసారిగా తన సర్వశక్తులూ పోయాయనే ఫీలింగ్ అతనిని వెంటాడ సాగింది. ఈ దశలోనే శూన్యతను అధిగమింపగలగాలని కేథీ వివరిస్తుంది.

నిండయిన భావన

లౌకిక సంపదలు మనిషికి ఒక నిండైన భావనను, ధీమాను ఏర్పరుస్తాయనేది కొంతమేరకు వాస్తవమే అయినప్పటికీ, అది ఆధారపడే మనస్తత్వాన్ని తెలియ పరుస్తుంది. మూర్తిమత్వ ప్రతిభా సామర్ధ్యాలను నిజంగా కోల్పోయినపుడు మాత్రమే ‘నిండయిన భావన’కు నిజమైన సవాల్ ఎదురవుతుందని, అంతవరకూ శూన్యత కారణంగా ఏర్పడే మానసిక విచారకర పరిస్థితులు మన ప్రజ్ఞాపాటవాల పరిధిలోనే వుండగలవని కేథీ అంటుంది. ‘నిండయిన భావన’ను పదిలపర్చు కోవటానికి మనిషి ఎంచుకునే ప్రతీకలు (Symbols) ఏమిటనే దాని మీద శూన్యతను జయింప చేయగల సామర్ధ్యాన్ని సంతరింప చేసుకోవచ్చు. ఇంగ్లీషులో ప్రాచీన నానుడి ఒకటుంది. ‘If... character is lost, every thing is lost’ అని దీనిని కొద్దిగా మార్చుకుని మనం If personality is lost.. అని చెప్పుకోవచ్చు. మూర్తిమత్వ వనరులను ప్రతిభా సామర్ధ్యాలను కోల్పోతేనే శూన్యతకు బలైనా అర్ధం వుంటుంది.

ఆ విపత్కర, అవాంఛనీయ పరిస్థితి ఉత్పన్నం కానంత వరకూ, లౌకిక పరమైన నిండయిన భావనల ప్రతీకలు (Symbols of abundance) ఎన్ని వున్నా, లేకపోయినా మనిషి ఆత్మవిశ్వాసానికి కొదవ ఏమీ వుండబోదని డా.కేథీ గుడ్విన్ ఉద్బోధిస్తుంది. మీలో నిండయిన భావనలు ఏ మేరకు పరిపూర్ణంగా కలవో నిర్ధారించుకోవడం ద్వారా మాత్రమే తాత్కాలిక ఒడిదుడుకుల వల్ల ఏర్పడిన నైరాశ్యాన్ని శూన్యతను మీరు జయించగల్గుతారు. లౌకికపరమైన అంశాలను మీ నిండయిన భావనకు ప్రతీకగా తీసుకున్నంత కాలమూ మీరు శూన్యతను జయించలేరు. మీ అస్థిత్వం, ‘మీరు’ అనే సుస్పష్టమైన స్వరూపం చెక్కు చెదరనంత కాలం మీ ‘నిండయిన భావన’ ఎప్పుడూ సజీవంగాను, చైతన్యవంతంగాను వుంటుంది. అదే ఎడారిలో సైతం చక్కని పంటలను పండించగలుగుతుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్