Magazines

తుఫాన్ ప్రభావంతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది

1 గంట క్రితం

Sandra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

- పంట నష్టాన్ని సర్వే చేసి తక్షణమే పరిహారం చెల్లించాలి

- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్

నవతెలంగాణ-సత్తుపల్లి : ​సత్తుపల్లి నియోజకవర్గంలో మురసు తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం జరిగిందని, వెంటనే పంట నష్ట సర్వేను నిర్వహించి బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో భారీ వర్షపాతం నమోదు కావడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయని తెలిపారు.

​చేతికొచ్చిన పంటలు వర్షార్పణం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతలను ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ​నియోజకవర్గంలో విస్తారంగా సాగు చేసిన వరి పంట ప్రస్తుతం కోత దశకు వచ్చిందని. అయితే ఉన్నట్లుండి కురిసిన వర్షాలకు పంట పూర్తిగా నేలకొరిగి, పొలాల్లో నడుములోతు నీరు నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరితో పాటు తీత దశలో ఉన్న పత్తి పంట వర్షపు నీటిలో తడిసి ముద్దయిందన్నారు.  ఇప్పటికే వాతావరణ మార్పులతో నష్టపోయిన రైతులకు ఈ తుఫాను కోలుకోలేని దెబ్బతీసిందని ఆయన వాపోయారు. 

​వ్యవసాయ శాఖ యంత్రాంగాన్ని వెంటనే అప్రమత్తం చేసి, నియోజకవర్గ వ్యాప్తంగా పంట నష్టంపై తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించాలని సండ్ర వెంకట వీరయ్య కోరారు. సర్వే నివేదిక ఆధారంగా సత్తుపల్లి నియోజకవర్గాన్ని వెంటనే 'పంట నష్ట ప్రాంతం'గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకూ ప్రభుత్వం త్వరితగతిన తగిన పంట నష్టపరిహారాన్ని అందించి అన్నదాతలను ఆదుకోవాలని సండ్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్