నవతెలంగాణ-హైదరాబాద్ : తమ పొరుగు ప్రాంతాల్లోని పిల్లలకు విద్య, అభివృద్ధి అవకాశాలను మరింత చేరువ చేసేందుకు చేపట్టిన ‘ప్రాజెక్ట్ విద్య’ కార్యక్రమాన్నివేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ విస్తరిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 800 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా స్టెమ్ విద్య, క్రీడలు, డిజిటల్ అక్షరాస్యత, అనుభవాత్మక అభ్యాసం, పర్యావరణ పట్ల అవగాహన వంటి అంశాలకు కూడా ఈ కార్యక్రమంలో ప్రాధాన్యం ఇస్తున్నారు.
చైల్డ్ రిసోర్స్ సెంటర్లు, పాఠశాలల అనంతరం నిర్వహించే ట్యూషన్ కార్యక్రమాల ద్వారా విద్యా వనరులతో పాటు నిరంతర విద్యా సహకారాన్ని అందిస్తున్నారు. విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ, క్రీడా సామగ్రి, స్టెమ్ కిట్లను అందిస్తున్నారు. తద్వారా ప్రాథమిక విద్యా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంతో పాటు శాస్త్రీయ అంశాలను తెలుసుకోవడానికి, తరగతి గది వెలుపల ఇతర నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. విద్యాపరమైన, ఇతివృత్త ఆధారిత ప్రత్యేక సందర్భాలను కూడా ఈ కార్యక్రమంలో నిర్వహిస్తూ పిల్లల్లో ఆసక్తి, శాస్త్రీయ ఆలోచనా విధానం, పర్యావరణ సమస్యలపై అవగాహన పెంపొందించేలా కార్యక్రమాలు చేపడుతున్నారు.
వేదాంత పవర్, తాము కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి అందిస్తున్న విస్తృత సహకారంలో భాగంగానే ఈ కార్యక్రమాలను చేపడుతోంది. సంస్థ కార్యక్రమాల ద్వారా ఏటా 3,000 మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 18 పాఠశాలలకు సంస్థ సహకారం అందించింది. పంజాబ్‌లోని తల్వాండి సాబో థర్మల్ ప్లాంట్ వద్ద 2023 నుంచి నిర్వహిస్తున్న కంప్యూటర్ అక్షరాస్యత కార్యక్రమం ద్వారా 250 మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందారు. ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి ప్రాంతంలో విద్యా, అవగాహన కార్యక్రమాలు, పాఠశాల సామగ్రి పంపిణీ, కెరీర్ గైడెన్స్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1,300 మంది లబ్ధి పొందారు. ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్న పర్యావరణ కార్యక్రమాలు కూడా పిల్లల్లో సుస్థిరమైన పద్ధతులను అలవర్చుకునేలా ప్రోత్సహిస్తున్నాయి.
ఈ సందర్భంగా వేదాంత పవర్ లిమిటెడ్ సీఈఓ, హోల్‌టైమ్ డైరెక్టర్ రాజీందర్ సింగ్ అహుజా మాట్లాడుతూ ‘‘అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యాల దిశగా ఇండియా ముందుకు సాగుతున్న తరుణంలో యువతకు జ్ఞానం, నైపుణ్యాలు, అవకాశాలు కల్పించడం కీలకం. వేదాంత పవర్ వద్ద ‘ప్రాజెక్ట్ విద్య’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి చిన్నారికి నేర్చుకునే, తన సామర్థ్యాన్ని గుర్తించే, తనకు నచ్చిన భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం కల్పించే వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాం. భావి తరాల జీవితాల్లో అర్థవంతమైన, శాశ్వతమైన మార్పు తీసుకురావడమే మా లక్ష్యం’’ అని పేర్కొన్నారు.
వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ యాక్టింగ్ సీఈఓ బిను రాఫెల్ మాట్లాడుతూ ‘‘మీనాక్షి ఎనర్జీ వద్ద విద్య అంటే కేవలం పాఠ్యాంశాల అభ్యాసం మాత్రమే కాదని, నిరంతరం మారుతున్న ప్రపంచంలో ముందుకు సాగేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం, అనుభవం మరియు నైపుణ్యాలను పిల్లలకు అందించడమేనని మేము విశ్వసిస్తున్నాం. తరగతి గది అభ్యాసానికి తోడు అనుభవపూర్వక అభ్యాసం, స్టెమ్ విద్య, డిజిటల్ అక్షరాస్యత, క్రీడలు, కెరీర్ గైడెన్స్‌ను కలిపి అందించడం ద్వారా యువ విద్యార్థులకు ‘ప్రాజెక్ట్ విద్య’ అవకాశాలను కల్పిస్తోంది. మేము కార్యకలాపాలను నిర్వహించే పొరుగు ప్రాంతాల్లోని పిల్లలు తమ సామర్థ్యాలను గుర్తించి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకునేందుకు అవసరమైన వనరులు, ప్రోత్సాహం అందేలా చూడటమే మా ప్రయత్నం’’ అని తెలిపారు.
‘ప్రాజెక్ట్ విద్య’ ద్వారా తమ పొరుగు ప్రాంతాల్లోని పిల్లల విద్యాభివృద్ధికి మీనాక్షి ఎనర్జీ తమ సహకారాన్ని కొనసాగిస్తోంది. తరగతి గది వెలుపల కూడా అభ్యాసానికి తోడ్పాటునందిస్తూ, యువత తమ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి అవకాశాలు కల్పిస్తోంది.





కామెంట్‌లు (0)