నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా.. బీజేపీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంఒసి)ని ఉల్లంఘించినట్లు టీఎంసీ బుధవారం ఎన్నికల కమిషన్ కు లేఖరాసింది. గుజరాత్ లోని సూరత్ నుండి పశ్చిమబెంగాల్ కు ఉచిత ప్రత్యేక రైళ్ల ద్వారా ఓటర్లను తరలిస్తోందని మండిపడింది. బీజేపీ, దాని గుజరాత్ యూనిట్ రాష్ట్రంలో నమోదైన పశ్చిమబెంగాల్ వలసకార్మికులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి, ఉచిత ప్రయాణం, ఆహారం, అందించిందనే సమాచారం తనకు సోషల్ మీడియా పోస్ట్ లో తెలిసిందని టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ లేఖలో పేర్కొన్నారు.
ఇది ఎన్నికల ఉల్లంఘన అని, బీజేపీకి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని, అలాగే పార్టీ నాయకులపై ఫిర్యాదు నమోదు చేయాలని ఆదేశించాలని ఒబ్రెయిన్ ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రత్యేక రైళ్లపై అయిన మొత్తం ఖర్చును తమ ఎన్నికల ఖర్చుల్లోనే చేర్చాలని బిజెపిని ఆదేశించాలని ఆయన కోరారు. సూరత్ నుండి బీజేపీ ప్రత్యేక రైళ్లు ఇప్పటికే బయలుదేరాయని, టిఎంసికి వ్యతిరేకంగా ఓటు వేయమని ప్రయాణికులను ప్రభావితం చేయడానికి వారి గుజరాత్ యూనిట్ సభ్యులు కూడా వారితో పాటు వెళ్తున్నారని అన్నారు.
కేందప్రభుత్వ నియంత్రణలో ఉండే రైల్వే శాఖ ద్వారా రవాణాను ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. ఇది అధికార దుర్వినియోగం , ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడంపై తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోందని అన్నారు. ప్రత్యేక రైళ్లు, ఉచిత సేవలు ప్రజా ప్రాతినిథ్య చట్టం, 1951 కింద అవినీతి చర్యలకు పాల్పడటమేనని ఒబ్రియన్ మండిపడ్డారు.



