నవతెలంగాణ-హైదరాబాద్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి పట్ల మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజలకు పరిపాలనను చేరువ చేయడంలో భాస్కర్ రావు కీలక పాత్ర పోషించారని, నాటి ప్రభుత్వంలో సామాన్యుడికి మేలు చేసే సంక్షేమ పథకాల రూపకల్పనలో ఆయన వ్యూహకర్తగా వ్యవహరించారని ఈటల తెలిపారు.
స్వల్పకాలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన చట్టసభల్లో తన వాగ్ధాటితో ప్రజా సమస్యలను సమర్థంగా వినిపించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని అభిప్రాయపడ్డారు.భాస్కర్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ఈటల రాజేందర్ తెలియజేశారు.



