Wednesday, April 22, 2026
E-PAPER
Homeకరీంనగర్ఖాళీ కుర్చీల సందేశం..కో-ఆప్షన్ ఎన్నికలో రాజకీయ మౌనం

ఖాళీ కుర్చీల సందేశం..కో-ఆప్షన్ ఎన్నికలో రాజకీయ మౌనం

- Advertisement -

-హాజరు కాని కౌన్సిలర్లు… వాయిదా పడిన సమావేశం
– బయటపడుతున్న అంతర్గత గణితం
నవతెలంగాణ-రాయికల్

రాయికల్ పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం ఉదయం ఒక ముఖ్యమైన ప్రక్రియ జరగాల్సి ఉంది.కో-ఆప్షన్ మెంబర్ల ఎన్నిక-సాధారణంగా చూస్తే ఇది పరిపాలనా వ్యవహారం మాత్రమే. కానీ ఆ సమావేశ మందిరంలో కనిపించిన ఖాళీ కుర్చీలు మాత్రం వేరే కథ చెబుతున్నాయి.నిర్ణయానికి వేదిక కావాల్సిన ఆ గది,చివరికి రాజకీయ మౌనానికి ప్రతీకగా మారింది.

ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం… అరగంట గడిచినా ఒక్క కౌన్సిలర్ కూడా హాజరు కాలేదు.నియమావళి ప్రకారం ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నప్పటికీ,ప్రజా ప్రతినిధుల గైర్హాజరు కారణంగా సమావేశం వాయిదా పడింది.ఇదే ఘటన ఇప్పుడు రాయికల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

-నిబంధనలు ఒకవైపు… వాస్తవం మరోవైపు
తెలంగాణ మున్సిపాలిటీ కో-ఆప్షన్ మెంబర్ రూల్స్-2020 ప్రకారం, ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన ఇద్దరు, అల్పసంఖ్యాక వర్గానికి చెందిన ఇద్దరు సభ్యులను కో-ఆప్షన్ ద్వారా ఎన్నుకోవాలి.అందులో మహిళలకు తప్పనిసరి ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది.ఈ ప్రక్రియలో భాగంగా దరఖాస్తులు ఆహ్వానించగా,మొత్తం 19 మంది ముందుకు వచ్చారు. అంటే పోటీ ఉంది…ఆసక్తి ఉంది,అవకాశాలపై ఆశలు కూడా ఉన్నాయి.కానీ ఆ ఆశలను తీర్చాల్సిన నిర్ణయ వేదిక మాత్రం ఖాళీగా మిగిలింది.

-హాజరు కాకపోవడమే సందేశమా..?
సాధారణంగా ప్రజా ప్రతినిధులు సమావేశానికి రాకపోవడం ఒక అపవాదం.కానీ ఇక్కడ అందరూ ఒకేసారి గైర్హాజరు కావడం యాదృచ్ఛికంగా కనిపించడం లేదు. రాజకీయంగా చూస్తే ఇది ఒక స్పష్టమైన సంకేతంగా అనుకుంటున్నారు పట్టణ ప్రజలు.ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా సమావేశాన్ని వాయిదా వేయించడం-ఇది ఒక వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు ప్రజలు.ఎవరి అభ్యర్థికి అవకాశం దక్కాలన్న దానిపై స్పష్టత రాకపోవడం,అంతర్గత విభేదాలు, లాబీయింగ్ వంటి ఆరోపణల గుసగుసలు వినిపిస్తున్నాయి.

-అంతర్గత గణితం… బయటపడని ఒప్పందాలు..!?
కో-ఆప్షన్ సభ్యులు సాధారణ పోస్టులు కాదు.భవిష్యత్తులో మున్సిపల్ నిర్ణయాల్లో ప్రభావం చూపగల సామర్థ్యం ఉన్న స్థానాలు. అందుకే ఈ ఎన్నిక చుట్టూ అంతర్గత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.కొందరు తమకు అనుకూలమైన అభ్యర్థులను ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. మరికొందరు తుది నిర్ణయం వరకు వేచి చూడాలని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో సమావేశానికి హాజరు కాకపోవడం ఒకరకంగా ‘ప్రెషర్ టాక్టిక్’గా కనిపిస్తోంది.

-పార్టీ రాజకీయాల ప్రభావం..?
పార్టీల స్థాయిలో కూడా స్పష్టమైన మార్గదర్శకాలు రాకపోవడం ఒక కారణంగా భావిస్తున్నారు.హైకమాండ్ నుంచి క్లియర్ సిగ్నల్ లేకపోవడంతో స్థానిక నాయకులు నిర్ణయం తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తోంది.ఇది స్థానిక స్వయం పాలనలో పార్టీ రాజకీయాల ప్రభావాన్ని మరోసారి బయటపెడుతోంది.

-ప్రజాస్వామ్యానికి ప్రశ్నలు
ఈ పరిణామం కొన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది:ప్రజా ప్రతినిధుల బాధ్యత ఎక్కడ..‌.?సమావేశానికి హాజరు కాకపోవడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందా…?వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలపై ఆధిపత్యం సాధిస్తున్నాయా.‌.?

సమావేశం వాయిదా పడటంతో కొత్త తేదీ ప్రకటించాల్సి ఉంటుంది.కానీ అప్పటి వరకు రాజకీయ చర్చలు మరింత వేడెక్కే అవకాశం ఉంది. అభ్యర్థుల మధ్య పోటీ,కౌన్సిలర్ల మధ్య చర్చలు,ఇరు పార్టీల మధ్య సమన్వయం,ఇవన్నీ కలిసి తదుపరి సమావేశాన్ని కీలకంగా మార్చనున్నాయి.

రాయికల్ మున్సిపల్ లో కో-ఆప్షన్ ఎన్నిక వాయిదా పడటం ఒక చిన్న సంఘటనలా కనిపించవచ్చు.కానీ దాని వెనుక ఉన్న రాజకీయ గణితం మాత్రం పెద్దది. బుధవారం సమావేశ మందిరంలో ఖాళీగా ఉన్న కుర్చీలు…

నిజానికి నిశ్శబ్దంగా ఒక సందేశం ఇచ్చాయి.నిర్ణయం ఇంకా సిద్ధం కాలేదు.రాజకీయ గేమ్ ఇంకా కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -