నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రతికూల వాతావరణ పరిస్థితులు, జలవిద్యుత్ ఉత్పత్తిలో దాదాపు 4,000 మెగావాట్ల లోటు ఏర్పడినప్పటికీ తెలంగాణ రాష్ట్రం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ సరికొత్త చరిత్ర సృష్టించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గరిష్ట విద్యుత్ డిమాండ్ 20 వేల మెగావాట్ల మైలురాయిని దాటింది. సోమవారం (నవంబర్ 16) రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 20,018 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదై సరికొత్త ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సోషల్ మీడియా వేదికగా 'తెలంగాణ పవర్ రిపోర్ట్' వివరాలను వెల్లడించారు.
నవంబర్ 16 నాటి గణాంకాల ప్రకారం, గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఏకంగా 50.2 శాతం పెరిగింది. నవంబర్ 2025 డిమాండ్ 8,522 మెగావాట్లు నమోదు కాగా నవంబర్ 2026 డిమాండ్ 12,802 మెగావాట్లు కాగా ఈ ఏడాది అదనంగా సరఫరా చేసిన విద్యుత్ 4,280 మెగావాట్లు అని భట్టి పేర్కొన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందులో భాగంగా దావూద్‌ఖాన్‌గూడ, బడంగ్‌పేట్ ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన 2 కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు మరింత వెసులుబాటు కలగనుంది.






కామెంట్‌లు (0)