నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాదయాత్రలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనాజీపురం చౌరస్తా వద్ద తిరుమలగిరి వైపు వెళ్తుండగా.. మల్లన్న ప్రయాణిస్తున్న టయోటా వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన టయోటా కారు ఎదురుగా వస్తున్న ఆల్ట్రోజ్ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో మల్లన్నకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనలో ఆల్ట్రోజ్ కారులో ప్రయాణిస్తున్న తిరుమలగిరికి చెందిన మేడబోయిన సాయినాథ్తో పాటు ఆయన డ్రైవర్ భార్య తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మల్లన్న వాహనంలో డ్రైవర్ బన్నీ, ఆయన సన్నిహితుడు రంగన్న ఉన్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర సమయంలోనే ప్రమాదం జరగడంతో టీఆర్పీ నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






కామెంట్లు (0)