నవతెలంగాణ - హైదరాబాద్ : ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఎయిర్‌పోర్ట్ టన్నెల్‌లో గంటకు సుమారు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కారు గోడను ఢీకొట్టడంతో 22 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద తీవ్రతకు కారు ఇంజిన్ ఊడిపోయి దూరంగా పడగా, వాహనానికి మంటలు అంటుకున్నాయి. మృతుడిని బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన అభినవ్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. టన్నెల్‌లో గరిష్ఠ వేగ పరిమితి గంటకు 80 కిలోమీటర్లు కాగా, అతను అంతకుమించిన వేగంతో ప్రయాణించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదానికి ముందు కారు స్పీడోమీటర్ ఫొటోలు, వీడియోలను స్నాప్‌చాట్‌లో స్నేహితులకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాద తీరును పరిశీలిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.






కామెంట్‌లు (0)