నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం తీపికబురు అందించింది. 2026-27 సంవత్సరానికి గాను 'ఆటో డ్రైవర్ల సేవలో' పథకం కింద ఆర్థిక సాయం అందించేందుకు నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు వెనుకబడిన తరగతులకు చెందిన లబ్ధిదారుల కోసం రూ.231.13 కోట్లను విడుదల చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే అర్హులైన డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లోకి రూ.15 వేల చొప్పున జమ చేయనున్నారు.
సొంతంగా ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉండి, దానిని నడుపుతూ జీవనం సాగించే యజమానులకు ఈ పథకం కింద ప్రభుత్వం ఏటా రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మహిళల కోసం 'స్త్రీ శక్తి' పేరుతో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించడంతో తమ ఆదాయం తగ్గిందని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా డ్రైవర్లకు మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సాయం అందిస్తోంది.
ఈ పథకానికి అర్హత ఉండి జాబితాలో పేరు లేనివారు ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. లబ్ధిదారులు తప్పనిసరిగా ఏపీలో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఇదే సమయంలో పాత వాహనాలపై గతంలో ఉన్న గ్రీన్ ట్యాక్స్‌ను రూ.20 వేల నుంచి రూ.3 వేలకు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా వాహనదారులకు ఉపశమనం కలిగిస్తోంది.
ఏపీ ఆటో డ్రైవర్లకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.15 వేలు!
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)