నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు జంక్షన్ వద్ద తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. తాజా సమాచారం ప్రకారం బల్మూరి వెంకట్ తన సతీమణితో కలిసి తిరుపతి నుంచి కారులో హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు జంక్షన్ వద్దకు చేరుకోగానే, ముందుగా కోళ్ల లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం వాహనాన్ని వీరి కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. తెల్లవారుజాము సమయం కావడంతో రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ, బల్మూరి వెంకట్ దంపతులు పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇద్దరికీ స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు వారికి తక్షణ సహాయం అందించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.






కామెంట్లు (0)