Magazines

యాత్రికులతో వెళ్తున్న రెండు బస్సులు ఢీ.. నలుగురు మృతి

2 గంటల క్రితం

two-buses-carrying-pilgrims
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తీర్థ యాత్రికులతో వెళ్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. 30 మంది యాత్రికులు గాయపడ్డారు. వారిలో 18 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. పంజాబ్‌లోని తరణ్ తరణ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉచిత తీర్థయాత్రల ద్వారా వృద్ధులను పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లేందుకు ఆ రాష్ట్రంలోని ఆప్‌ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి తీర్థ యాత్ర’ పథకాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా లాహిరిదాస్, బఘియారి గ్రామాలకు చెందిన యాత్రికులతో ఒక బస్సు తీర్థయాత్ర ముగించుకుని ఫరీద్‌కోట్ జిల్లాకు తిరిగి వెళ్తున్నది.

కాగా, శనివారం తరణ్ తరణ్ జిల్లాలోని నౌషెహ్రా పన్నూవాన్ సమీపంలో ఒక బాలుడితో కలిసి స్కూటీపై వెళ్తున్న మహిళ ఒక క్రాసింగ్‌ వద్ద హైవేను దాటేందుకు ప్రయత్నించింది. ఆమె స్కూటీని ఢీకొట్టకుండా ఉండేందుకు ఎదురుగా వస్తున్న ఫరీద్‌కోట్ వెళ్లే బస్సు డ్రైవర్ వాహనాన్ని వేగంగా పక్కకు తిప్పాడు. దీంతో మరో లేన్‌లోకి ఆ బస్సు దూసుకెళ్లింది. లాంబీ నియోజకవర్గంలోని భీడీవాల్ గ్రామం నుంచి అమృత్‌సర్ వైపు వెళ్తున్న ఎదురుగా వస్తున్న మరో తీర్థయాత్ర బస్సును అది ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి రెండు బస్సులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

అయితే స్కూటీ నడిపిన మహిళతోపాటు ఒక బస్సు డ్రైవర్‌, ఇద్దరు యాత్రికులతో సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో 30 మంది యాత్రికులు గాయపడ్డారు. మరణించిన మహిళతోపాటు స్కూటీపై ప్రయాణించిన బాలుడితో సహా 18 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదాన్ని గమనించిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులతో పాటు రాజకీయ నాయకులు కూడా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రలను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. పోలీసులు, అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్