వినుకొండ సీమ సాహిత్య చరిత్ర.
రచన & సంకలకం : కె. జె. రమేష్, వెల :350, ప్రతులకు: రచయిత, 9440111105.
వినుకొండ పట్టణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఉంది. కవులకు కళాకారులకు పుట్టినిల్లు, సాహిత్య పరంగా ఎదుగుతోన్న ప్రాంతం. జాతీయ, రాష్ట్ర స్థాయి పేరు ప్రఖ్యాతులు గాంచిన సాహితీవేత్తలు ఎందరో వినుకొండగడ్డపై పరిఢవిల్లినారు. ఆశోకుడేలిన కాలం నుండి వినుకొండను తన భాగం చేసుకుకున్న గుంటూరు పరిసర ప్రాంతాలకు ఎంతో మహనీయమైన చరిత్ర ఉంది. వినుకొండ రాజుధానిగా చేసుకుని పాలించిన విష్ణుకుండిన కాలం (క్రీ.శ. 400 - 600 వరకు) స్వర్ణయుగంగా భాసిల్లినదనవచ్చు. పురాణ కాలమున కమఠుడనే భక్తుడు శివానుగ్రహము వలన పర్వతాకారుడైనాడట. అందువల్ల ఈ ప్రాంతం కమఠపురం అయినదట. త్రేతాయుగంలో సీతను రావణుడు అపహరించినపుడు జటాయువు అనే పక్షి అడ్డగించి గాయపడితే, సీతాన్వేషణలో ఉన్న రామునికి జటాయువు ఈ ఉదంతం వివరించి ప్రాణాలు విడిచినదట.
జటాయువు సీతాపహరణాన్ని రామునకు విన్నవించినపుడు ఈ పర్వతం కూడా వినుట వలన ‘వినుకొండ’ అయినదని ఐతిహ్యము. వినుకొండ అనగానే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందిన కవికోకిల మహాకవి గుర్రం జాషువ, పెనుగొండ లక్ష్మీనారాయణ గుర్తుకు వస్తారు. వీరే కాకుండా వినుకొండ ప్రాంతంలో మరెందరో కవులు తమ కవితాపాటవాల్ని విష్ణుకుండినుల కాలం నుండే ప్రదర్శించారు.
‘వినుకొండ సీమ సాహిత్య చరిత్ర’ రచయిత కె.జె.రమేష్ గుంటూరు జిల్లాలో జన్మించిననూ నాలుగు దశాబ్దాలకు పైగా అధ్యాపకులుగా పనిచేయటం వల్ల వినుకొండతో అభిమానం పెంచుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పలు సాహిత్య సంబంధిత పురస్కారాలు పొందారు. పలు రచనలు, అనువాదాలు చేశారు. 15 అధ్యాయాలు, మూడు అనుబంధాలు (సప్లిమెంట్), 359 పేజీలు గల బృహత్ గ్రంథంలో రమేష్ వినుకొండ ప్రాంతం కలిగియున్న గుంటూరు సీమ చరిత్రతో ప్రారంభించారు. రాజకీయంగా, సామాజికంగా, సాహిత్యపరంగా గుంటూరు ప్రాంతం ఎంతో గొప్పదని చెబుతూ జాషువా ‘నాకథ’లోని వినుకొండ ప్రాంత వైభవాన్ని వివరించారు.
చాటు పద్యాలలో వినుకొండను, వైభవాన్ని చెప్పారు. ‘పారిజాతాపహరణము’ రచయిత ముక్కు తిమ్మన ఇక్కడి వారేనన్నారు. మంత్రి రాయని భాస్కరుడుతో మొదలై పూర్వ కవులను ప్రస్తుతించారు. వీరిలో వినుకొండ వల్లభరాయుడు, అహోబిల పండితుడు ఉన్నారు. పద్యానికి పట్టం కట్టిన దీపాల పిచ్చయ్య, గద్దల జోసెఫ్ ప్రభుతుల వివరాలను అందించారు. నయగరా కవులలో ఒకరైన కుందుర్తి మేనల్లుడు పోలూరి ఆంజనేయ ప్రసాద్ సాహితీ సేవను ప్రస్థావించారు. సాహితీవేత్తలకు అండదండలై నిలిచిన శాసన సభ్యుల గురించి తెలిపారు. వినుకొండ ప్రాంత కథకులు, నవలాకారులు, వ్యాసకర్తలు, వచన కవులు బుర్ర కథకులు ఈ సంకలనంలో చోటు చేసుకున్నారు. సినిమా పాటల రామజోగయ్య శాస్త్రి కూడా ఉండటం ఈ సంకలన సమగ్రతకు ఉదాహరణ. వినుకొండ ప్రాంత సాహితీ వేత్తల సమగ్ర చరిత్ర అనదగ్గ ఈ గ్రంథ రచయిత కె.జె.రమేష్‌కు అభినందనలు.
కూర చిదంబరం, 8639338675






కామెంట్లు (0)