Magazines

పురుషులకూ ఒక రోజు

22 నిమిషాల క్రితం

Men
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 3 నిమిషాల చదవడం

అంతర్జాతీయంగా మహిళలకు ఒక ప్రత్యేకమైన రోజు ఉన్నట్లుగానే పురుషులకూ ఒక రోజు ఉందనే సంగతి మీకు తెలుసా? అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (International Men's Day) ప్రతి సంవత్సరం నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజును 1999లో డాక్టర్ జెరోమ్ తిలక్‌సింగ్‌ ప్రారంభించారు. కుటుంబంలో, సమాజ నిర్మాణంలో పురుషులు, బాలుర సానుకూల సహకారాన్ని గుర్తించడమే ఈ దినోత్సవ లక్ష్యం. ప్రతి ఏటా ఒక నిర్దిష్ట థీమ్‌ను ఎంచుకుంటారు. అదే విధంగా ఈ ఏడాది థీమ్ "భవిష్యత్తు అందరిది".


నవంబర్ అనగానే అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు, శుభాకాంక్షల హోరు గుర్తుకు వస్తుంది. కానీ ఈ సంబరాల హోరులో ఎక్కడా వినిపించని ఒక నిశ్శబ్దం నేటి యువత చుట్టూ అలుముకుని ఉంటుంది. "మగవాడైతే ఏంటి, కన్నీరు రాకూడదు, కుటుంబ భారాన్ని ఒంటరిగా మోయాలి, ఎప్పుడూ దృఢంగా ఉండాలి" అనే సామాజిక మూస పద్ధతులు నేటి యువకులపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని మోపుతున్నాయి. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం సాధించాలనే ఒత్తిడి, పెరిగిన నిరుద్యోగం, కుటుంబ అంచనాలు, ఆర్థిక అనిశ్చితి మధ్య సతమతమవుతున్న యువకులు తన ఆవేదనను ఎవరితో పంచుకోలేక లోలోపలే కుమిలిపోతున్నారు. సమాజంలో మగవారికి భావోద్వేగాలు ఉండవనే అపోహ కారణంగా, వారు పడుతున్న మానసిక క్షోభ ఎవరికీ కనిపించడం లేదు. సోషల్ మీడియా యుగంలో అందరూ తమ విజయాలనే ప్రదర్శిస్తున్న తరుణంలో, వెనుకబడిన భావన యువకులలో ఆందోళనను పెంచుతోంది.

ఒకవైపు ఆధునిక భావనలు, మరోవైపు సంప్రదాయ బాధ్యతల మధ్య నలిగిపోతున్న నేటి పురుషుడు నిత్యం ఒక అంతర్మథనం అనుభవిస్తున్నాడు. తన బలహీనతలను, భయాలను పంచుకోవడానికి సరైన వేదిక లేక, తనలోని బాధను ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా భరిస్తున్న ఉదంతాలు కోకొల్లలు. పురుషుడు అంటే కేవలం యంత్రం కాదని, అతనికి కూడా అలసట వస్తుందని, కన్నీరు వస్తుందని, మానసిక సాయం అవసరమని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. పురుషుల దినోత్సవం రోజున కేవలం అభినందనలు తెలపడం కంటే, వారి మానసిక ఆరోగ్యానికి భరోసా కల్పించే వాతావరణాన్ని సమాజంలో సృష్టించడం అత్యంత ముఖ్యం. నిత్యం మారుతున్న సాంకేతిక ప్రపంచంలో, కెరీర్ ఆందోళనలు, ఆర్థిక అనిశ్చితి, సోషల్ మీడియాల ప్రభావం కారణంగా నేటి యువత తీవ్రమైన మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. చదువు పూర్తయిన వెంటనే ఉన్నత ఉద్యోగం సాధించాలనే ఒత్తిడి, నిరుద్యోగ భయం, కుటుంబ అంచనాలు యువతలో నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలను పెంచుతున్నాయి.

మరోవైపు, ఇతరుల విజయాలతో తమ జీవితాన్ని పోల్చుకోవడం వల్ల కలిగే న్యూనతా భావం వారి మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తోంది. తమ బలహీనతలను బయటికి చెబితే సమాజం ఏమనుకుంటుందనే భయంతో భావోద్వేగాలను లోపల దాచుకోవడం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. ఈ మానసిక ఒత్తిళ్లను విజయవంతంగా అధిగమించడానికి యువత కొన్ని సానుకూల జీవన శైలి మార్పులను అలవర్చుకోవాలి. సోషల్ మీడియా వాడకాన్ని కొంత మేర నియంత్రించుకుంటూ, వాస్తవ ప్రపంచంలోని సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మనసులోని ఆందోళనలను కుటుంబ సభ్యులతో, నమ్మకమైన స్నేహితులతో లేదా అవసరమైనప్పుడు మానసిక నిపుణులతో పంచుకోవడం ద్వారా సగం భారం తొలగిపోతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మెదడు ప్రశాంతతను పొంది ఒత్తిడి హార్మోన్లు నియంత్రణలో ఉంటాయి. వైఫల్యాలను జీవితాంతం వెంటాడే శాపాలుగా కాకుండా, భవిష్యత్తు పాఠాలుగా స్వీకరించే తత్వంతో ముందుకు సాగితే మానసిక స్థైర్యం పెరుగుతుంది.

మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలో లింగ సమానత్వం, పరస్పర సహకారం, ఐక్యతల ప్రాముఖ్యతను ఈ నినాదం బలంగా చాటుతోంది. ఏ ఒక్క వర్గానికో పరిమితం కాకుండా, అందరి భాగస్వామ్యంతోనే ఉజ్వలమైన భవిష్యత్తు సాధ్యమనే సత్యాన్ని ఇది గుర్తుచేస్తుంది. కుటుంబాలలో, ఆఫీసులలో, సమాజ నిర్మాణంలో పురుషులు పోషించే బాధ్యతాయుతమైన పాత్రను మెచ్చుకుంటూనే, వారు మరి ముఖ్యంగా యువకులు ఎదుర్కొనే మానసిక ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని ఈ థీమ్ నొక్కిచెప్పింది. ఈ తరుణంలో పురుషులు తమ భావోద్వేగాలను పంచుకోవడానికి, ఒకరికొకరు అండగా నిలవడానికి ఒక వేదిక ఏర్పడాలి. సమాజం పురుషుల నుంచి కేవలం బాధ్యతల నిర్వర్తనే కాకుండా, వారి వ్యక్తిగత సంతోషాన్ని, సంక్షేమాన్ని కూడా గౌరవించాలి. "భవిష్యత్తు అందరిది" అంటే కేవలం భౌతిక ప్రగతి మాత్రమే కాదు, అది అందరూ కలిసికట్టుగా, ఆరోగ్యకరమైన ఆలోచనలతో నిర్మించుకునే సుసంపన్నమైన సమాజం. ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ నినాద స్ఫూర్తిని అర్థం చేసుకుని, సహకారంతో కూడిన సమసమాజ నిర్మాణానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది.


అనంతోజు మోహన్‌‌కృష్ణ, 88977 65417

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్