Magazines

అక్షరాల్ని మోహించిన బైరాగి తత్వం

15 నిమిషాల క్రితం

ascetic
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

కవిలోంచి పాఠకుడి హృదయంలోకి ఒలికిపోకుండా కవితామృతాన్ని వంపడం అంత తేలికేం కాదు. అనుభూతి - నిలువెల్లా కంపిస్తున్న శివసత్తుల ఆటలా ఆస్వాదన అవడం ఒక పార్శ్యం అయితే 'వస్తువు'ను దొరకబట్టుకుందామని పరిగెత్తి అలసిపోవడం మరో పార్శ్యం. ఏది మొదలో తెలిస్తే అల్లిక అసాధ్యం కాదని అర్ధమైతది. ఇదంతా కవి సిద్ధార్థ రాసిన 'పాత ఎండుటాకుల గాలి ' కవిత తత్వం గురించి! అక్షరాల్ని మోహించిన బైరాగి దర్శనమిస్తడు. వస్తువు లేకుండా కవిత్వం మనగలుగుతుందా? కాశెంత సేపు మాటల ప్రవాహమై కొట్టుకు పోవడానికి ఏదో ఒక దినుసు పంటి కింద నలగకపోతే సారం పెయికి పురాగ ఇముడదు. ఒల్శెన్ని ముచ్చట్లు వున్నా ఎదురుంగ మనిషి లేని ఒంటరి ఏకాకితనం. ఇంతకాలం తిరిగి తిరిగి కాలందెబ్బకు సుడివడ్డ పానానికి దొరికిన వుప్పోస లెక్క 'ఈ పిల్లలంతా' అని ఏర్పాటు జేయడం, సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెడుతరని 'పాత ఎండుటాకుల గాలి' చేత గుర్తింపపడటం, సంకెళ్ళను తెంపి స్వేఛ్ఛను ప్రసాదింపజేసే మహత్తు దాగి వుందని రేణుకెల్లన్ముకు మొరపెట్టుకో వడం - శ్రమజీవుల పోరాట తత్వం వట్టిపోలేదని, కొనసాగింపు దాని ధర్మమని 'మన కాలపు నెత్తుటి బొట్లే..'

అని ప్రకటించడం, సొంతమేనని ఆవాహన చేసుకోవడం- పరమార్థాన్ని బోధిస్తున్నట్లుగా అనిపిస్తది. ముగింపు నుండి మొదలై తిరిగి మననం చేసుకుంటే 'తండ్లాట' అక్షరమక్షరం ప్రతిధ్వనిస్తది. నిర్మాణ పరంగా పరిశీలించినపుడు సంబోధన కారణంగా వచనంలా అనిపించే ప్రతి పాదం కవిత్వమయమై గుభాళిస్తది. తరతరాల బాధను, నొప్పిని తబాదల్ జేత్తది. పెకిలించబడుతున్న గడ్డకట్టిన దుక్కపు గొంతును జీరగా పలికిస్తది. యానాది దేవుడో, రేణుకెల్లమ్మో ఎవరో ఒకరు చెవుల్ని అప్పగించడానికి బారులు తీరుతరు. కుమ్మరి పాపమ్మ మట్టి దీపం 'గవాయితనం' నెరుపుతది. గాలి రుచిగా వుండటం, ఊపిరి చిమ్మటించడం, నిద్రగాలి మసిలిపోవడం వంటి పదబంధాల అల్లిక గాఢతను నిలిపి వుంచుతది. ఒక స్థితిని చెప్పడానికి దృశ్య శకలాల్ని పేర్చుకుంటూ పోవడం, ఉద్వేగాల్ని ప్రేరేపించడం ఒక వైపు, నిగూఢతను ఛేదించడానికి ఎరలా పదాల్ని ప్రయోగించడం, అంతరార్థాల్ని శోధించమని పురి గొల్పడం - దాటి తీరాల్సిన ఎత్తు గడలా కవిత్వనిర్మాణం గోచరిస్తది. ఆదిమ మూలాల్ని తడమడం, తడిని పరిచయం చేయడం తద్వారా జీవిని ఎరుకపర్చడం, ఉనికిని చాటడం సిసలు తత్వంగా కనిపిస్తది.


పచ్చగిల్లుతున్నట్టూ

నిశ్శబ్దం విరోధాభాస అవునా....

మొదటనే వాటిల్లిన సత్యమేనా

స్పర్శల తడితనమేనా... ఆదిమ వానలూ వనాలూ కలిసి తానం చేస్తున్నట్టూ వాగు అలల మీద తేలుకుంట

ఈత కొట్టుకుంట వోతున్న

మా కుమ్మరి పాపమ్మ మట్టిదీపం ఎంత పాతదీ

ఎంత గట్టిదీ దాని వెలుగూ నువ్వొద్దెనే..

నీలాగనే

ఈ పిల్లలంతా

కలె తిరిగి

నీ బొడ్డు పేగునుంచి రాల్తున్న

మన కాలపు నెత్తుటి బొట్లే..

ఇవి ఎంత వెచ్చగున్నాయీ కొత్తగున్నాయీ..

నీ శబ్ద నిశ్శబ్దాలనీ

పాత బేడీలనూ వంచి తెంపుతున్నవీ

అమ్మా మాయమ్మా రేణుకెల్లమ్మా-


'పాత' ఎండుటాకుల గాలి

ఈ గాలి సుత

ఎంత రుచిగా వున్నదీ సనమెత్తటి చర్మంతో

అర చేయిని స్పర్శిస్తదీ యానాది దేవా

మాగిన కనురెప్పల

జారే కోమల నిషాదం యాపరసం నమిలి కలింకాయను కొరికినట్టుంటదీ

లోపలి లోకాల బొరియలు పాటలతో శోకాన్ని పాడుతున్నట్టుంటదీ


వూపిరి చిమ్మటిస్తున్నట్లు గమకాలు

కాళ్ళను ముడుచుకొని కడుపు పేగుల దాగినట్టూ కెంపెరుపు కాంతి

పూడ్చి పూడ్చీ పండీ పండీ పగిలిన జాంపండు

కొమ్మకు వేలాడుతున్నట్టు అడుగంటిన బాయి లోపలి నిద్రగాలి

మసిలిపోతూ అలిసిపోతూ


బండారి రాజ్‌‌కుమార్‌



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్