మీకు నచ్చిన స్నేహితునికి లేఖ వ్రాసి తీసుకురమ్మని చెప్పిన తెలుగు మాస్టారు కు మరుసటి రోజు విద్యార్థులు లేఖలు వ్రాసి తెచ్చి ఇచ్చారు. తరగతి గదిలో మాస్టారు చదివి వినిపిస్తున్నారు.
"ప్రియమైన చెరువు నేస్తానికి" అనే లేఖ చూడగానే మాస్టారు ఆశ్చర్యపోయి, లేఖ వ్రాసిన రాజుని పిలిచాడు.
"రాజు, అందరు తమ స్నేహితులకు లేఖ వ్రాస్తే, నువ్వు మాత్రం చెరువుకు వ్రాసావేమిటి " అని మాస్టారు అడగగానే విద్యార్థులు నవ్వారు.
"చెరువు నా నేస్తం సర్" అని రాజు చెప్పగానే విద్యార్థులు మళ్ళీ నవ్వారు.
మాస్టారు కోపంగా చూసేసరికి విద్యార్థులు నవ్వులు ఆపారు.
"చెరువు కింద మాకు పొలం ఉంది.చెరువు నీటి ద్వారా పంటలు పండుతున్నాయి.మా పశువులకు చెరువు గట్టుపై గడ్డి మేతగా దొరుకుతుంది.అందులో నేను ఈత కొడతాను.
మా కుటుంబానికే కాదు,ఈ ఊరు మొత్తానికి చెరువు దేవత వంటిది.నేను ప్రతి రోజు సాయంత్రం చెరువు దగ్గరికెళ్ళి ఆటలాడుతాను.చెరువు చుట్టూ పచ్చని పొలాలు బాగుంటాయి,పక్షులు చెరువుపై ఎగురుతూ ఉంటే గమ్మత్తుగా అనిపిస్తుంది.చెరువు అంటే నాకెంతో ఇష్టం "అని రాజు వినయంగా చెప్పాడు.
" శభాష్ రాజు,ప్రకృతి వనరులను నీలా అందరు అభిమానించి,రక్షించుకోవాలి.అది మన బాధ్యత" అంటూ మాస్టారు సంతోషించి తన జేబు కున్న కలం రాజు కు బహూకరించాడు.
ఎగతాళిగా నవ్విన విద్యార్థులే,అభినందిస్తూ చప్పట్లు కొట్టారు.
"ఈరోజు నుండి చెరువు మాకు కూడా నేస్తమే "అని తోటి విద్యార్థులు అనగానే రాజు సంబరపడిపోయాడు.
దుర్గమ్ భైతి, 9959007914







కామెంట్‌లు (0)